Suryaa.co.in

Andhra Pradesh

గుండ్లకమ్మ పాపం సర్కారుదే

– ఆ పదిగేట్ల మరమ్మతుల కోసం 3 కోట్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం
– జాలర్ల జీవనోపాధి ప్రశ్నార్ధకం
– జాలర్లను పరామర్శించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

అద్దంకి మండలం ధేనువుకొండ గ్రామంలో ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి ఎగువ నుండి వచ్చిన వరదనీరు వలన ప్రాజెక్టులోని స్పిల్ వే 3వగేటు కొట్టుకొని పోయి ప్రాజెక్టులోని నీరు కిందికి పోవడంతో వలలు,పడవలు కొట్టుకొని పోయిన మత్స్యకారులను, రైతులను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ..పైనుండి వరద జలాలు వస్తే ఏం చేయాలో ఒక ప్రణాళిక రూపొందించడంలో ప్రభుత్వం – అధికారుల నిర్లక్ష్య వైఖరివల్ల నీరు సముద్రం పాలయింది. ఖరీఫ్,రబీ సాగుకు ఢోకా లేదనుకున్న తరుణంలో ప్రాజెక్టు నిర్వాహణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాగు ప్రశ్నార్థకంగా మారడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారని, గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ఆధారపడిన పొలాలకు సాగునీరు సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందీ రానీయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

దశాబ్ద కాలం గడవకముందే ప్రాజెక్టులోని కీలకమైన గేట్లు తుప్పు పట్టిపోవడం చూస్తుంటే నేటి ప్రభుత్వ పనితీరుకు నిలువుటద్దంలా కనిపిస్తోందని అన్నారు. రెండు సంవత్సరాల క్రితమే జలవనరుల శాఖ అధికారులు గుండ్లకమ్మ జలాశయంలోని మొత్తం 15 గేట్లకుగాను 10 గేట్లకు మరమ్మతులు అవసరమని గుర్తించి , దాదాపు 3 కోట్ల రూపాయలు అంచనాలు సిద్ధంచేసి, పై అధికారులకు నివేదికను సమర్పించినా నిధుల కేటాయింపులో నిర్లక్ష్యధోరణి అవలంభించడమే నేటి ఈదుస్థికి కారణమని ఆయన తెలిపారు.

వైకాపా ప్రభుత్వం ఏర్పడిననాటినుండి ప్రాజెక్టులు పర్యవేక్షణ నోచుకోలేదు. రాష్ట్రంలో మెకానికల్ వర్క్ షాపుల ఇంజనీర్లు ఏటా రెండుసార్లు ప్రాజెక్టులు తనిఖీ చేసి ఏఏపనులు చేయాలో సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నివేదించాలి, కానీ ప్రస్తుత తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. కేంద్ర ఆకృతుల సంస్థ ఆధ్వర్యంలో డ్యాం భద్రతా కమిటీలు ఇచ్చే నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యమని అన్నారు.

డ్యాం గేట్ల నిర్వాహణకు ప్రాథమిక మరమ్మత్తులైనటువంటి గ్రీజు వాడకం, తలుపులు ఎత్తేందుకు వీలుగా ఇనుప తీగలు, సులభంగా తిరిగేందుకు వాడే , కాడ్మియం కాంపోనెంట్ సక్రమంగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.జలాశయ పరిధిలోని జాలర్ల జీవనోపాధి ప్రశ్నార్ధకంగా మారింది
గ్రామాలలో ముందుగా చెప్పకుండా అకస్మాత్తుగా వరద నీటిని ప్రాజెక్టులోకి విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వం ,జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు.ప్రాజెక్టులోని స్పిల్ వే గేటు దెబ్బతినడం,అటు గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవావాహం ధాటికి చేపలుపట్టేందుకు వేసిన వలలు, పడవలు కొట్టుకుపోయాయి అన్నారు.

గుండ్లకమ్మ జలాశయ పరిధిలో చేపలవేటపై జీవనం కొనసాగిస్తున్న జాలర్లు దాదాపు 3వేల కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నదని చేపలవేట సాగించే సమయంలో ఈ పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు.గత తెలుగుదేశంపార్టీ హయాంలో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఏటా ప్రాజెక్టులో మరియు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలలో నివసిస్తున్న జాలర్ల కోసం చేప పిల్లలను నదిలోకి వదలడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

మత్స్య శాఖ జిల్లా అధికారితో ఫోన్లో మాట్లాడుతూ…బాపట్లజిల్లా మత్స్యశాఖ అధికారితో చరవాణీలో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడచిన నెల 31వ తేదీన ఈ ఘటన జరిగిందని సంబంధిత జలవనరులశాఖ ఇటు మత్స్యశాఖ అధికారులు సమన్వయం చేసుకొని ముందుగా జాలర్లకు సమాచారం ఇచ్చి ఉంటే ఇంతటి నష్టం వాటిల్లి ఉండేది కాదని తెలిపారు.

అదేవిధంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో చేపలవేట సాగిస్తూ ఈనీటివిడుదల కారణంగా నష్టపోయిన జాలర్ల వివరాలు నమోదు జాప్యం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యపు చర్యల వలన ఒక్కో జాలరి వలలు,పడవల రూపేణా దాదాపుగా 75 వేల నుండి లక్ష రూపాయల వరకు నష్టపోయారని అన్నారు.మత్స్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన వివరాలను అంచనాలువేసి పై అధికారులకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

జీవనాధారం కోల్పోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రాజెక్టు పరిధిలో దాదాపు 3వేల మంది వరకు మత్స్యకారులు చేపలవేటే జీవనాధారంగా జీవిస్తున్నారని తెలిపారు.ఇటు వలలు,పడవలు, చేపలు కొట్టుకుపోయి అగమ్య గోచర స్థితిలో ఉన్న జాలర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.మత్స్యకార రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్ ని కలసి జరిగిన నష్టాన్ని నివేదిస్తానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జాలర్లకు తిరిగి ప్రాజెక్టులో చేపల వేట ప్రారంభమయ్యే వరకు నెలకు 10వేల రూపాయలు నగదు ఇవ్వాలని మరియు నష్టపోయిన వలలు,పడవలు వెంటనే అందజేయాలని త్వరితగతిన ప్రాజెక్టులో నీటినినింపి చేప పిల్లలను విడిచి వారి జీవన అభివృద్ధికి తోడ్పాటు నందించాలని ఎమ్మెల్యే గొట్టిపాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE