Suryaa.co.in

Andhra Pradesh

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి పెమ్మసాని

తెనాలి బుర్రిపాలెంలో పుట్టి.. నర్సరావుపేటలో పదవ తరగతి వరకూ చదవి.. అక్కడి నుంచి గుంటూరు.. అక్కడి నుంచి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు టీడీపీ అభ్యర్ధిగా ఖరారయ్యారు. ఆ క్రమంలో ఆయన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాకినేని పెద రత్తయ్య సహా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోని పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు.

యువకుడైన పెమ్మసాని నిజానికి ఎప్పుడో ఎంపీ కావలసిన వ్యక్తి. ఆయన అదృష్టం ఒకసారి నర్సరావుపేటలో రాయపాటి సాంబశివరావు.. మరోసారి గుంటూరులో గల్లా జయదేవ్ తన్నుకుపోవడంతో, ఇప్పటివరకూ ఎదురుచూడటం అనివార్యమయింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా.. నాటి నుంచి యువనేత లోకేష్‌తో సత్సంబంధాలు నిర్వహిస్తూ, పార్టీకి ఆర్ధికంగా తనవంతు దన్నుగా నిలిచారు.

ఇప్పుడు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తాత్కాలిక విరమణ ప్రకటించడంతో, అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం పెమ్మసానికి లభించింది. నర్సరావుపేట సిట్టింగ్ వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. దానితో పెరిగిన నర్సరావుపేట నుంచి పోటీ చేయాలన్న పెమ్మసాని కోరిక ఆ రకంగా నెరవేరకుండా పోయింది.

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేపధ్యం
పేరు : డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
తల్లి దండ్రుల పేర్లు : శ్రీమతి సువర్చల, శ్రీ సాంబశివరావు
స్వగ్రామం : బుర్రిపాలెం గ్రామం, తెనాలి మండలం , గుంటూరు జిల్లా
జన్మ తేది : 07.03.1976
విద్యార్హతలు : ఎండి ( జనరల్ మెడిసిన్ )
సహాధర్మచారిణి పేరు : డాక్టర్ శ్రీ రత్న
సోదరుడు : శ్రీ రవిశంకర్
సంతానం : ఒక కుమారుడు, ఒక కుమార్తె

కుటుంబ నేపధ్యం : స్వగ్రామమైన బుర్రిపాలెం గ్రామంలో రైతాంగకుటుంబ నేపద్యం. తండ్రి శ్రీ పెమ్మసాని సాంబశివరావు వ్యాపార రీత్యా బుర్రిపాలెం గ్రామం నుండి వెళ్ళి నరసరావుపేట పట్టణంలో స్థిరపడ్డారు. నర్సారావుపేట వాసులకు ఆయన రాజకీయంగా సుపరిచితుడే .తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటినుండి రెండు దశాబ్దాలు పాటు పార్టీకీ విశిష్ట సేవలందించారు.

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన పదవ తరగతివరకు నరసరావుపేట మున్సిపల్ స్కూల్ లోను,ఇంటర్మీడియట్ గుంటూరులోను పూర్తి చేసారు. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ,తెలుగు మీడియంలో చదివినప్పటికి ఆయన పట్టుదలతో చదివి 1993 – 94 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 60 వేల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరు కాగా రాష్ట్రస్థాయిలో ఆయన తన ప్రతిభతో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు.

తదనంతరం ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన ఆయన మెడికల్ పీజీ, ఇంటర్నల్ మెడిసిన్ లను పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గైసింగర్ వైద్య కేంద్రం నుండి పూర్తి చేయడమే కాకుండా అక్కడ కూడా అత్యధిక మార్కులు సంపాదించి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. పీజీ శిక్షణా సమయంలో సైతం అమెరికా దేశంలో జరిగే వైద్య విద్య విజ్ఞానపు పోటీల్లో పెన్సిల్వేనియా రాష్ట్రం తరఫున పాల్గొన్న అయన వరుసగా రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. తదనంతరం జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీలోని సినాయి హాస్పిటల్ లో ఐదు సంవత్సరాలు పాటు విద్యార్థులకు వైద్య విద్య బోధకుడుగాను ఫిజీషియన్ గాను సేవలందించారు.

ఇతర దేశాల నుండి అమెరికాలో వైద్యులుగా పని చేసేందుకు వెళ్లేవారు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అమెరికా యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జాం ( USMLE) పూర్తి చేసేందుకు వెళ్ళిన అయన సరైన వసతులు లేక,తగిన శిక్షణ లభించక అనేక వ్యయప్రయాసలకు లోనయ్యారు.

నాటి లెక్కల ప్రకారం శిక్షణా ఖర్చే 5 వేల డాలర్లు. ఈ పరీక్షలు పూర్తి చేయడంలో వైద్యులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లైన వసతి భారం, శిక్షణలో నాణ్యతా లోపం ,భారీగా శిక్షణా వ్యయంవంటి స్వీయ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అయన తన 25 సంవత్సరాల వయస్సులో 2001 వ సంవత్సరంలో వైద్య విద్యార్దులు, ఎవరు తనలా ఇబ్బందులు ఎదుర్కొకూడదని భావించి సేవాభావంతో తన శిక్షణ లో భాగంగా తాను రూపొందించుకొన్న నోట్స్ సాయంతో 250 ప్రశ్నలతో ఒక పుస్తకాన్ని రాసి, అమెరికాలోని ముద్రణాలయాలను సంప్రదించినప్పటికీ వారు ముద్రణకు ముందుకు రాలేదు.

అమెరికాలో సాఫ్ట్వేర్ రంగం వేళ్ళూనుకొంటున్న తరుణంలో తన సతీమణి డాక్టర్ శ్రీ రత్న, సాఫ్ట్వేర్ నిపుణులు అయిన కుటుంబ సభ్యులైన శ్రీ రవిశంకర్, శ్రీ కోనేరు శ్రీకాంత్ ల సహకారంతో తన పుస్తకాన్ని అంతర్జాలంలో ఉంచారు. తనలా ఎవరు ఇబ్బంది పడకూడదని భావించిన ఆయన సేవాభావంతో దీని ధర కేవలం 20 డాలర్లుగానే నిర్ణయించారు.. ఈ పుస్తకానికి వైద్యవిద్యా రంగం నుండి అపూర్వమైన స్పందన లభించింది.

ఆ ప్రేరణతోనే ఆయన వైద్య విద్యార్థుల కోసం అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్ధులకు స్వల్ప రుసుముతో అత్యంత నైపుణ్యంతో కలిగిన , అనుభవజ్ఞులైన, అంకితభావంతో కూడిన బోధనా సిబ్బందితో కలిసి తాను ఫౌండర్, సీఈఓ గా “యూ వరల్డ్ “ పేరుతో సంస్థను స్థాపింఛి ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారు.. అమెరికాలో మంచి ఖ్యాతి గడించిన తన సంస్థ ద్వారా ఆయనక అనేక మందికి ఉపాదికూడా కల్పించారు. . ప్రస్తుతం ఈ సంస్థ వైద్యం, నర్సింగ్, ఫార్మసీ, న్యాయవాదం, వాణిజ్యం ,అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణను అందిస్తుంది.

అందుకున్న అవార్డులు : ప్రపంచ వ్యాప్తంగా జయప్రదంగా వ్యాపారం నిర్వహిస్తున్నవ్యాపారవేత్తలకు అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఫోర్బ్స్ సంస్థ అవార్డులను అందిస్తుంది. ఫోర్బ్స్ నుండి ఆయన 2020 సంవత్సరంలో ప్రతిష్టాత్మక “ఎర్నేస్ట్ ఎంటర్ప్రెన్యూర్“ అవార్డును అందుకున్నారు. ఇదేవిధంగా అమెరికాలోని అనీక ప్రతిష్టాత్మక మీడియా సంస్థలైన మీడియం, సీఈఓ వరల్డ్, ఫాస్ట్ మాగజైన్లు కూడా అవార్డులు అందించాయి . ASU-GSV Summit నుండి ఆయన సన్మానం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సేవలను దృష్టిలో ఉంచుకోన సదరు సంస్థలు ఆయనకు తమ సభ్యత్వాన్ని ఇచ్చాయి. భారతీయ మూలాలు కలిగిన అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్ లో సైతం ఆయన సభ్యుడే .

సేవారంగం : వైద్య బీమా లేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయులకు అమెరికా దేశంలోని డల్లాస్ నగరంలో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు.అలానే నాటి ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు దాత్రుభావంతో 2010 సంవత్సరం నుండి షుమారు 100 వరకు ఉచిత బోర్ వెల్స్ ఏర్పాటు, ఆర్వో ప్లాంట్ లు ఏర్పాటు,ఓవర్ ట్యాంకుల నిర్మాణం, మంచినీటి ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు.

తన స్వగ్రామమైన బుర్రిపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం భూమిని ఉచితంగా అందించారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు చదువుల నిమిత్తం ఆర్ధిక బ్రుతి అందజేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద ధార్మిక భావం కలిగి విద్యా సేవలు అందిస్తున్న సంస్థలకు ఇతోదిక విరాళాలను అందిస్తున్నారు.అలానే అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో సైతం వారు పలు సంస్థలకు తమ ఆర్థిక తోడ్పాటును అందించారు.

ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న డాక్టర్ పెమ్మసాని తెలుగుదేశం పార్టీ చేస్తున్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు బాసటగా నిలిచేందుకు 2010 సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తరఫున పనిచెస్తూ తన విరాళంతోపాటుగా, ప్రవాసాంధ్రులు నుండి కూడా విరాళాలు సేకరించి పార్టీ అభివృద్దిలో భాగస్వాములయ్యారు. అలానే ఎన్నారై విభాగం తరపున ఆయన అందిస్తున్న సేవలపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు , పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు పెమ్మసాని కుటుంబీకులను పలుమార్లు అభినందించారు.

పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పాదయాత్ర సమయంలో స్వయంగా చూసిన నారా చంద్రబాబునాయుడు డాక్టర్ పెమ్మసానిని రాజకీయాల్లోకి వచ్చి అందరికీ స్పూర్తిదాయకంగా నిలవాలని ఆహ్వానించారు. చంద్రబాబునాయుడు కోరిక మేరకు 2014 సంవత్సరంలో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు అయినప్పటికీ చివరి దశలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాటి కాంగ్రెస్ నేత రాయపాటి సాంబశివరావుకు టికెట్టు కేటాయించారు.

ప్రస్తుత ప్రభుత్వంలో నానాటికి దిగజారుతున్న రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతాంగంను ప్రస్తుత ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందిలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఆర్దిక స్థితిగతులు మెరుగయ్యేందుకు , రాజధాని నిర్మాణం జరిగినప్పుడే ద్వారానే రైతాంగం ఆశలు నెరవేరతాయని ఆయన భావిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం ఏర్పాటే అందుకు సరైన మార్గంగా అనే భావంతో అయన తనవంతు భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీకి నిర్ణయం తీసుకొన్నారు.

LEAVE A RESPONSE