Suryaa.co.in

Telangana

హరీష్.. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?

– రైతు స‌మ‌స్య‌లు, నీటి పారుద‌ల ప్రాజెక్ట్ లు, గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ అవినీతిపై చర్చించడానికి సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరిన జూపల్లి
– స‌మ‌యం, తేదీ, వేదిక ఏదో చెప్పాల‌ని డిమాండ్
– హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్

అస‌లు సినిమా ముందుంది. బీఆర్ఎస్ హాయంలో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెడ‌తాం. మీ తప్పులన్నీ బయట పెట్టాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు. హ‌రీష్ రావు స‌చివాల‌యాన్ని ముట్ట‌డిస్తామ‌ని అంటున్నారు. గ‌త పదేళ్ల‌లో రాష్ట్ర ఖ‌జానాను బీఆర్ఎస్ నాయ‌కులు ముట్ట‌డించారు.

ఇప్పుడు చేసేదేం లేక సచివాలయం ముట్టడిస్తామని అంటున్నారు. రాయలసీమకు నీళ్ళు త‌ర‌లించుకుపోతుంటే గుడ్లు అప్పగించి చూసారు. కొత్త ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేయ‌లేదు… పాత ప్రాజెక్ట్ ల నిర్వ‌హ‌ణ‌ను గాలికి వ‌దిలేసారు. పది సంవత్సరాల్లో ఎప్పుడైనా పంట నష్టానికి ప‌రిహారం ఇచ్చారా? ఇన్ పుట్ స‌బ్సిడీ, పంట‌ల బీమాను అమ‌లు చేశారా ? పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు.

మీ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్లే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అస‌లు బీఆర్ఎస్ నాయ‌కుల‌కు రైతుల గురించి, వ్య‌వ‌సాయం గురించి మాట్లాడే నైతిక హ‌క్కు ఉందా? గ‌తంలో వ‌రి వేస్తే ఉరి అన్న‌ది మీరు కాదా? రైతుల‌కు వ‌రి వేయ‌ద్ద‌ని చెప్పి…. ఎర్ర‌వెల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో వ‌రి వేసింది ఎవ‌రు?

అకాల వ‌ర్షాల వల్ల పంట న‌ష్ట‌పోయిన రైత‌న్న‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది. పంట న‌ష్టంపై సీయం రేవంత్ రెడ్డి వెంట‌నే స్పందించారు. పంట న‌ష్టంపై స‌మ‌గ్ర నివేదిక అంద‌జేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నివేదిక రాగానే రైతుల‌కు ఎక‌రానికి రూ. 10 వేల న‌ష్ట ప‌రిహానం చెల్లిస్తాం.

వ‌చ్చే వాన కాలం సీజ‌న్ నుంచి పంట‌ల బీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తాం. అన్న‌దాత‌ల క‌ష్టాలు, క‌డ‌గండ్లు గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాప‌మే. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌లేదు. గ‌త ప‌దేండ్ల‌లో 6, 651 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.

మేడి గ‌డ్డ ప్రాజెక్ట్ కుంగుబాటు మీ పాపం క‌దా? వ‌ర్షం కాలం సీజ‌న్ లో అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కాదా? మ‌రి ప్రాజెక్ట్ ల్లో నీళ్లు ఎందుకు నింప‌లేక‌పోయారు. ప్ర‌తీ నీటిని బొట్టును ఒడిసి ప‌డితామ‌ని చెప్పి… స‌కాలంలో ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేయ‌లేదు. క‌ట్టిన ప్రాజెక్ట్ లు కూడా కూలీ పోయే పరిస్థితులు ఉన్నాయి.

పాల‌మూర్ – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఎందుకు పూర్తి చేయ‌లేదో స‌మాధానం చెప్పాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆద‌ర‌బాద‌ర‌గా పాల‌మూర్ – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప్రారంభించారు. కానీ ఒక్క ఎక‌రానికి కూడా నీళ్లివ్వ‌లేక‌పోయారు. పాల‌మూర్ – రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఇవాళ ద‌క్షిణ తెలంగాణ ఎడారిగా మారి ఉండేది కాదు.

నీటిపారుద‌ల ప్రాజెక్ట్ లే కాదు ఏ ఒక్క హామీని గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేక‌పోయింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చి… చిప్ప చేతికి ఇచ్చి వెళ్ళిపోయారు. అయినా సీయం రేవంత్ రెడ్డి సార‌ద్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌ని చేస్తుంది. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తున్నాం.

బీఆర్ఎస్ నాయ‌కులు దిగ‌జారుడు రాజ‌కీయాలు మానుకోవాలి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ కు ప్ర‌జ‌లు బుద్ది చెప్పుతారు. ఉమ్మ‌డి పాల‌మూర్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం మాదే.

ఈ మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యేలు క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి, శంక‌ర్, వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE