– అది కాంగ్రెస్‌కే సాధ్యం
– ఇదేనా ప్రజాపాలన?
– రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ లేఖ
హైదరాబాద్: పెంచిన జీతాన్ని తగ్గించే సంప్రదాయం కాంగ్రెస్ పాలనలోనే చూస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేసిన ప్రభుత్వ వైఖరిని తూర్పారపడుతూ ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి ఒక లేఖ రాశారు.
మినీ అంగన్వాడీ కార్యకర్తలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా గుర్తించి, వారికి పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేసుకోవడం మినహా, వారికి చేసిందేమీ లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.
జనవరి 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న పూర్తి జీతాలను మినీ అంగన్వాడీలందరికీ వెంటనే చెల్లించాలని, అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట హెల్పర్లను నియమించాలని, మే నెల జీతాలు అందని జిల్లాల్లో కూడా తక్షణమే పంపిణీ చేయాలని హరీశ్ రావు తన లేఖలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న మహిళల కడుపు కొట్టడం సరికాదని హితవు పలికారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తించి, వారిని అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ 2023 సెప్టెంబర్‌లో జీవో ఇచ్చిందని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా అది అమలు కాలేదని హరీశ్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మంత్రి సీతక్క ఇదే అంశంపై తొలి సంతకం చేశారని, డిసెంబర్ 15న జీవో కూడా ఇచ్చారని, కానీ అది పాత జీవోకు నకలేనని ఆరోపించారు.
ప్రభుత్వం జనవరి 2024 నుంచి మూడు నెలల పాటు రూ. 13,650 చొప్పున పెరిగిన వేతనం అందించి, ఆ తర్వాత మళ్లీ వారి జీతాన్ని రూ. 7,800కు తగ్గించి పాత పద్ధతిలోనే చెల్లిస్తున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణమని, పెంచిన జీతాలు తగ్గించే సంప్రదాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఎద్దేవా చేశారు. మే నెలకు సంబంధించి కేవలం 8 జిల్లాల్లోనే పెరిగిన జీతాలు చెల్లించి, మిగతా జిల్లాల వారిని విస్మరించడం అన్యాయమన్నారు.