– ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలకు ఓకే
– హైస్కూళ్లలో 49 దాటిన తర్వాత 2వ సెక్షన్ ఏర్పాటు
అవసరం మేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్, సర్‌ప్లస్ ఉపాధ్యాయుల సర్దుబాటు
– ఉద్యమ కార్యాచరణ తాత్కాలిక వాయిదా
అమరావతి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వ చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి.
సమాంతర మాద్యమం విషయంలో మాత్రం మంత్రి నారా లోకేష్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో చర్చించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తరఫున చర్చలు ఫలించినట్లు వారు ప్రకటించారు.
ఎస్‌జీటీలకు మాన్యువల్ పద్దతిలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పకుందని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో 49 దాటిన తరువాత 2వసెక్షన్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తామని, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ప్రాధమిక పాఠశాలలు విడిగా నిర్వహిస్తామని ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భంలో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకు అవసరం మేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్, సర్‌ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది.