ఏపీలో మూడేళ్ల క్రితం పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కూడా సంచలనాలు రేపుతోంది. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో దీన్ని బయటపెడుతున్న సీబీఐ అధికారులపై కూడా కేసుల పరంపర మొదలైంది.
ముఖ్యంగా ఈ కేసులో దర్యాప్తులో కీలకంగా ఉన్న సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ ను టార్గెట్ చేస్తూ ప్రైవేటు కేసులు దాఖలవుతున్నాయి. దీనిపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కనిపెట్టిన అంశాల ఆధారంగా దర్యాప్తు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఆటంకాలు తప్పడం లేదు. దీంతో సీబీఐ కూడా ఈ వ్యవహారంలో ముందుకు సాగలేని పరిస్ధితులు తలెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా సీబీఐ నిందితులుగా గుర్తించిన వారిలో కొందరిని రిమాండ్ కు పంపింది. మరికొందరి వాంగ్మూలాలు తీసుకుని వదిలిపెట్టింది. వీరిలో కొందరు విచారణకు హాజరుకమ్మని సీబీఐ కోరితే హాజరుకాకుండా సీబీఐపైనే ప్రైవేటు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మరో ట్విస్ట్ గా మారుతోంది.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరుకావాలని నిందితుల్ని కోరింది. అయితే విచారణకు వెళ్లిన కొందరు ఇందులో తమకు అనుకూలంగా వాంగ్మూలం చెప్పాలని సీబీఐ అధికారులు వేధిస్తున్నారంటూ ఆరోపించారు. ఇదే అంశంపై దిగువ కోర్టుల్లో సీబీఐ అధికారి రామ్ సింగ్ పై చర్యలు కోరుతూ ప్రైవేటు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సీబీఐ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులతో తాత్కాలిక ఊరట దక్కింది. అయితే ఈ వ్యవహారం మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది.
వివేకా కేసు దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై దిగువ కోర్టుల్లో నిందితులు లేదా అనుమానితులు దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్లు కొట్టేయాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది కీలక వాదన వినిపించారు. విచారణకు నిందితుల్ని పిలిస్తే తమపైనే కేసులు దాఖలు చేస్తే ఇక వివేకా కేసులో దర్యాప్తు ముందుకు సాగదని హైకోర్టుకు తేల్చిచెప్పేశారు. నిందితుల వ్యవహారశైలిపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో దిగువ కోర్టుల్లో దాఖలైన ప్రైవేటు పిటిషన్లను కొట్టేయాలని కోరింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును కోరింది. అయితే హైకోర్టు మాత్రం 22వ తేదీకి ఈ పిటిషన్ విచారణ వాయిదావేసింది.