-విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి
-ఎంపీ రఘురామకృష్ణం రాజు
ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినంత దారుణంగా, దరిద్రంగా తాను ఎప్పుడైనా మాట్లాడానా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సిఐడి చీఫ్ సునీల్ కుమార్, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి లు ఏమని ఆలోచిస్తున్నారన్నది తనకు ముఖ్యం కాదన్నారు. ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారన్నదే తనకు ముఖ్యం అన్నారు.
పాలకులు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోమని చెప్పానని, దానికే తనపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య, మతాల మధ్య విభేదాలు సృష్టించానని తనపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా తన మాటల వల్ల ప్రజలు, మతాల మధ్య ఘర్షణలు జరిగాయా? అంటూ సూటిగా ప్రశ్నించారు. తక్కువ ధరకు ఇసుక విక్రయించాలని, నాణ్యమైన మద్యం మద్యపాన ప్రియులకు అందుబాటులోకి తేవాలని, దేవుని భూములు అమ్మకానికి పెట్టవద్దని మాత్రమే నాలుగు మంచి మాటలు చెప్పానని గుర్తు చేశారు.
గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల లో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆరు నెలల వ్యవధిలో కర్ణాటక రాష్ట్రం 1600 కోట్ల రూపాయల అప్పులు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 49, 500 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. అధిక అప్పులు చేసింది చాలదన్నట్లుగా, గతంలో కంటే తామే తక్కువ అప్పులు చేశామని పాలకులు కవరింగ్ చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పట్టుమని పది స్థానాలు గెలిచే అవకాశం లేదు
రాష్ట్రంలో మన వారి చేత మనమే సారా వ్యాపారం చేయిస్తున్నామంటే రానున్న ఎన్నికల్లో పట్టుమని పది స్థానాలు కూడా గెలిచే అవకాశం లేదని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. క్రమశిక్షణ కలిగిన ఒక పార్టీ కార్యకర్తగా, ప్రజల చేత ఎన్నికైన పార్లమెంటు సభ్యునిగా రాష్ట్రంలో జరుగుతున్న మద్యం వ్యాపార లావాదేవీలపై నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు . ఢిల్లీలో 8 జోన్ల లలో 150 నుంచి 200 మద్యం దుకాణాల కోసం వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే, రాష్ట్రంలో సింహభాగం మద్యం వ్యాపారం అడాన్ డిస్టలరీస్ దేనని గుర్తు చేశారు. లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన అడాన్ డిస్టలరీస్ వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన వేల కోట్ల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు . దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న మెక్ డొవెల్స్, షావాలిస్ వంటి సంస్థల కాదని, అడాన్ డిస్టలరీస్ నుంచే రకరకాల మద్యం బ్రాండ్లను కొనుగోలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని ఒక జూనియర్ స్థాయి అధికారి అయిన వాసుదేవరెడ్డిని తీసుకువచ్చి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారన్నారు. కాశీ చైనుల శ్రీనివాస్, బొల్లారం శివకుమార్ అనే అదృశ్య వ్యక్తులు స్థాపించిన అడాన్ డిస్టలరీస్ కు వాసుదేవ రెడ్డి వేల కోట్ల రూపాయల మద్యం కొనుగోళ్ల కు ఆర్డర్ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటన్నారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వాసుదేవ రెడ్డికి తాను లేఖలు రాస్తున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
మీ బంధువులే సారా వ్యాపారంలో ఉన్నారట…
రాష్ట్రంలో సారా వ్యాపారంలో మీ బంధువులే ఉన్నారని ప్రజలు అంటున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి సతీమణి తరపు బంధువు రాజ్ కసిరెడ్డి, ముఖ్యమంత్రి పెద్దనాన్న కుమారుడు ఆఫ్రికాలో సారా వ్యాపారం చేసేవారన్నారు. ఆ అనుభవంతో రాష్ట్రంలో సారా వ్యాపారం చేస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారన్నారు. వారం, వారం లావాదేవీల కోసమో, దేనికోసమో మీరు వారిని కలుస్తున్నారన్నారు.
మద్య నిషేధం దేవుడెరుగు…?!
రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని ప్రజలకు ఎన్నికల ముందు హామీ ఇచ్చామని రఘురామకృష్ణం రాజు గుర్తుచేశారు. మధ్య నిషేధం మాట దేవుడు ఎరుగని… రాష్ట్రంలో మద్యం ఏరులై పారుపోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 స్థానాలను గెలవాలన్న ఉద్దేశంతో గడపగడప కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గడపగడపకు కార్యక్రమంలో అడాన్ డిస్టలరీస్ ఎవరిది?, అడాన్ డిస్టలరీస్ శరత్ చంద్రారెడ్డి దే అయితే, ఢిల్లీలో చిన్న మద్యం వ్యాపారానికే వందల కోట్ల రూపాయలు విమానాల్లో తరలిస్తే, ఇక్కడి నుంచి డబ్బులు ప్రత్యేక విమానంలో తరలించకుండా ఊరుకుంటారా? అన్న అనుమానాలు ప్రజలకు లేకపోలేదన్నారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారంపై నిష్పక్షపాత విచారణ కోసం వారానికి ఇద్దరు ముగ్గురిని అరెస్టు చేస్తూ అత్యుత్సాహాన్ని చూపిస్తున్న ఏజెన్సీలకే బాధ్యతలు అప్పగించాలని సూచించారు .
అడ్డగోలుగా ధరల పెంపకం
రాష్ట్రంలో ఒక అక్షరం మార్చి అడ్డగోలుగా మద్యం ధరలు పెంచినట్లు ఒక బాధితుడు తనకు ఫోన్ చేసి వివరించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో ఆయన తాగే బీర్ కు 230 రూపాయలు వసూలు చేస్తున్నారని, అదే తెలంగాణలో 150 రూపాయలకు లభిస్తుండగా, బెంగళూరులో 90 రూపాయలకే దొరుకుతుందని బాధితుడు తెలిపారని వెల్లడించారు. మద్యం రేట్లను అర్ధాంతరంగా పెంచి, నగదులోనే వేల కోట్ల రూపాయల లావాదేవీలను నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కనికారెడ్డి విమానాలు నిరంతరంగా ఆంధ్రకు వస్తుంటాయని, ఆంధ్ర నుంచి వెళుతుంటాయన్నారు . కనికా రెడ్డి విమానాలలో పెద్ద మొత్తంలో నగదు రవాణా జరిగినట్టు పత్రికలలో కథనాలు వచ్చిన నేపథ్యంలో, ఆంధ్రా నుంచి కూడా నగదు తరలించారేమోనన్న అనుమానాలు లేకపోలేదని అన్నారు. సాక్షిలో గతంలోనే ఉత్తమ మహిళా ఎంటర్ పెన్యూర్ గా కనికా రెడ్డి ఇంటర్వ్యూ వచ్చిందని, దీనితో ప్రజలకు అనుమానాలు రావడం సహాజమన్నారు. మన రాజకీయ అవసరాల దృష్ట్యా వాటిని నివృత్తి చేయవలసిన అవసరం మనకు ఉందన్నారు. నిజాయితీకి మారుపేరైన కేజ్రీవాల్ ప్రభుత్వంపైనే ఆరోపణలు వచ్చాయని, మన ట్రాక్ రికార్డు అంతంత మాత్రమేనని అపహాస్యం చేశారు.
ఆ జన ప్రభంజనాన్ని చూస్తే కర్నూల్ లో బోణి కొట్టడం కష్టమే
కర్నూలు జిల్లా పర్యటనల ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అపూర్వ ప్రజాస్పందన లభించిందని, ఆ జన ప్రభంజనాన్ని చూస్తే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బోణి కూడా కష్టమేనని స్పష్టమవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కర్నూల్ లో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాలలో తమ పార్టీ యే గెలిచిందని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ద్వారా, న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పినా తమ పార్టీకి ఎంతటి ప్రజా వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. ఆ జన ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయంగా కనిపిస్తుందన్నారు.
తమ పార్టీ నాయకత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు. లేకపోతే రానున్న ఎన్నికలు కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు అవుతాయని అన్నారు. ఈసారి గెలిస్తే 30 ఏళ్లు తమదే అధికారం అని చెబుతున్న తమ పార్టీ పెద్దల మాటలు పరిశీలిస్తే, ఈసారి తాము గెలువబోయేది లేదని అర్థమే కదా అంటూ అపహాస్యం చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్లలో ఎన్టీ రామారావుకు ఎటువంటి జనాదరణ లభించిందో, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ప్రజాదరణ లభిస్తుందని అన్నారు.
40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబుపై ప్రేమ ఉంటే ఉండవచ్చునని కానీ ప్రస్తుతం ఆయనకు లభిస్తున్న ప్రజాధరణ మాత్రం అపూర్వమని అన్నారు. తనపై కస్టడీలోనే సిఐడి పోలీసులు హత్యాయత్నం చేసిన విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజల ముందు ప్రస్తావించడం ద్వారా ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం ఉందన్నారు. తన పట్ల ఎంతో ఆదరణ కనబరిచిన చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
రైతులపై భారం వేస్తే… బటన్ నొక్కే సమయంలో ఆలోచిస్తారు
రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులపై భారం వేస్తే, బటన్ నొక్కే సమయంలో రైతులు కూడా ఆలోచిస్తారని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు .. ఆక్వా రంగం కుదుటపడే వరకు 100% పెంచిన వాటర్ సెస్సు ను తగ్గించాలని, కరెంటు సబ్సిడీని అందరికీ కొనసాగించాలని కోరారు. ఆక్వా రంగంపై
ప్రత్యేక టాక్స్ విధిస్తున్నట్లుగా మార్కెట్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయని , ఆ టాక్స్ ను రైతులకు వర్తింప చేయవద్దని సూచించారు. ఆక్వా రంగంలో ఉన్న వారంతా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారేనని ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన లేకి తనానికి నిదర్శనమని విమర్శించారు. ఆక్వా రంగంలో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆక్వా రంగం ప్రాసెసింగ్ యూనిట్లపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దాడులు నిర్వహించి, సోదాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆక్వా రంగ రైతులు సింహ భాగం తన నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారన్నారు. ఆక్వా రంగ ఎగుమతి దారులతో ప్రభుత్వం బలవంతంగా పత్రికల్లో ప్రకటనలు ఇప్పించుకుందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. గతంలో ఆక్వా రంగానికి రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ను సరఫరా చేయగా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని రూపాయిన్నరగా తగ్గించిందన్నారు. అయితే, కేవలం 25 శాతం మంది రైతులకు సబ్సిడీపై విద్యుత్తును సరఫరా చేస్తున్నారన్నారు. మిగిలిన 75 శాతం మంది ఆక్వా రైతులకు రూ. లు 3.25 పైసలకు యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తుండడం వల్ల, ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందన్నారు.
ప్రాసెసింగ్ ప్లాంట్లకు గతంలో రూపాయి 20 పైసలుగా ఉన్న ఒక కే ఎల్ నీటిని, ప్రస్తుతం 100% పెంచి 120 రూపాయలు చేశారని తెలిపారు. త్వరలోనే ఆక్వా రంగంపై 1000 కోట్ల రూపాయల భారాన్ని మోపనున్నారని తెలిసిందన్నారు. అనధికారికంగా ఆక్వా రంగం రైతుల నుంచి పెద్ద మెత్తం డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రికి ఈ విషయం తెలుసో, తెలియదో… కానీ ఆక్వా రైతులపై అదనపు భారం పడకుండా చూడాలని రఘురామకృష్ణం రాజు కోరారు..