Home » పల్నాడులో వేడెక్కిన రాజకీయం..

పల్నాడులో వేడెక్కిన రాజకీయం..

స్థానిక సంస్థల ఎన్నికల సమరంతో పల్నాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసిపి,టిడిపి లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పల్నాడులోని మొదటిసారి జరుగుతున్న గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికలకు నగారా మ్రోగింది. దీంతో ఇరు పార్టీలు పట్టు సాధించేందుకు రంగంలోకి దిగారు.
అధినేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పావులు కదుపుతున్నారు. స్థానిక వైసీపీ గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు దగ్గరుండి శుక్రవారం నామినేషన్ చివరి రోజు నామినేషన్లు వేయించారు. గురజాలలో 20 వార్డులు, దాచేపల్లిలో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద వెంటాడుతోండగా ప్రతిపక్ష టీడీపీకి అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి అభ్యర్థులు ఎక్కడ ఉపసంహరించుకుంటారో అన్న భయం వెంటాడుతుంది.
ఇలా అధికార,ప్రతిపక్ష పార్టీల అధినేతలు రంగంలోకి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం నామినేషన్ల తో పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తోపాటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు.
టిడిపి నుండి యరపతినేని శ్రీనివాసరావు దగ్గరుండి అభ్యర్థులతో నామినేషన్ల ప్రక్రియను కొనసాగించారు. ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పల్నాడు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ సహకరించాలని కోరిన విషయం తెలిసిందే. టిడిపి నేత యరపతినేని మాట్లాడుతూ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రెండున్నర ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అక్రమ కేసులు, అవినీతి తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఓటమి భయంతో అభ్యర్థులను ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. అధికార యంత్రాంగం పోలీసులు, వాలెంటర్ల్లు నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు. లేనట్లయితే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు, సంక్షేమ పథకాలు ఈ నగరపాలక ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయని అభివర్ణించారు. గెలవలేక అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. గురజాల, దాచేపల్లిలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని తాము చర్చకు సిద్ధమని ప్రతి సవాలు విసిరారు. తాగునీటి వంటి కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. ఒక పేదవాని గూడా పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చుపెట్టి ప్రతిపక్ష పార్టీ మనుగడను కాపాడుకుంటోంది అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పల్నాడులో తాగునీటికి, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు.
నరసరావుపేట ఎం‌పి శ్రీకృష్ణ దేవరాయ మాట్లాడుతూ. ఈ రెండున్నరేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందిస్తాయని అన్నారు. గడిచిన కాలంలో గురజాల ను ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సాధిస్తున్నామని అన్నారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ, రైల్వే పనులు, దాచేపల్లి – గురజాల మధ్య మార్గాన్ని జాతీయ రహదారిగా మారేలా చేశామని, త్వరగా పనులు కూడా జరిగేలా కృషి చేస్తామని అన్నారు. మరింత అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు అత్యధిక మెజారిటీలు అందించాలని కోరారు.ఇలా నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రతిష్టాత్మకంగా మారిన పల్నాడు ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కక్షలు కార్పణ్యాలకు నిల యమైన పల్నాడులో ప్రశాంతత ఎన్నికలకు ఇటువంటి భద్రత పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
– వీఆర్‌సీ

Leave a Reply