Suryaa.co.in

Features

భవిష్యత్తులో వీధి లైట్లు ఉండవు..ఇళ్లలో లైట్లుండవు!

ప్రకృతి ధర్మం ప్రకారం మన కళ్లు వెలుతురులో మాత్రమే చూడగలవు. కనుక మన ఆదిమూల పూర్వికులు వెలుగునిచ్చే సూర్యుడిని పూజించారు. వెన్నెలలో చూడగలిగారు కనుక చంద్రుని పూజించారు. పిడుగు పడినపుడు, కార్చిచ్చు రగిలినపుడు రేగిన మంటలలో రాత్రి పూట కూడా చూడగలమని గ్రహించారు. ఆ అగ్నిని ఆహారం అరిగేలా వంటకు వాడుకోవచ్చని గ్రహించారు. అగ్నిని పూజించారు. మండుతున్న కర్ర, ఆకు కొమ్మా చేతితో పట్టుకుని వెళితే దారీతెన్నూ కనిపిస్తుందని గుర్తించారు.
కానీ అవేవీ తమ గుడిసెలో గుహలో ఎక్కువ సేపు ఉండటం లేదు. తాము చంపిన జంతువుల కొవ్వు పడిన కర్ర ఎక్కువ సేపు కాలుతూ గాలికి ఆరకుండా వెలుగుతోందని గుర్తించారు. అపుడు కాగడాలు తయారు చేసుకున్నారు. పిడుగులకు, కార్చిచ్చుకూ రేగిన మంటనే జాగ్రత్తగా దాచుకునే వారు. అలా నిత్యాగ్నిహోత్రం అనేది ఒక క్రతువుగా మొదలైంది. తర్వాత కర్రలను రాపాడించి, రాళ్లను కొట్టి నిప్పు తయారు చేయగలగటం ఒక గొప్ప ముందడుగు.
కాలక్రమంలో కొబ్బరి చిప్ప లేదా జంతువు కపాలంలో కొవ్వువేసి పీచు వేసి వెలిగిస్తే నిలిచి వెలుగుతుందని గుర్తించారు. తర్వాత ఆముదం కనిపెట్టారు. వెలుగు వారి ఆధీనంలోకి వచ్చింది. మట్టి, లోహ ప్రమిదలు తయారు చేయసాగారు. ఎక్కువ వెలుగు కావాలంటే ఎక్కువ దీపాలు, తక్కువ కావాలంటే కొన్ని దీపాలు ఊదేయటం చేయాలని తెలిసింది. దీన్నే ఇపుడు లక్స్ అంటున్నారు.
ఇదే సమయంలో మంచు ప్రాంతాలలోనూ కొవ్వు వినియోగం కనిపెట్టారు. అక్కడ చలికి కొవ్వు గడ్డకడుతుంది కనుక కొవ్వొత్తులు తయారు చేయగలిగారు. అందుకే వారు ప్రార్ధనల్లో కొవ్వొత్తులు వాడతారు! మనవాళ్లు నెయ్యి, నూనెలను ప్రమిదలలో వేసి వత్తివేసి వెలిగించసాగారు. కనుక మన పూజలలో దీపారాధన ప్రారంభమైంది. క్రమంగా లక్క, గుగ్గిలం వంటివి కూడా మండుతాయని గ్రహించారు.
శిలాజ ఇంథనం కనిపెట్టే వరకూ దీపం, కొవ్వొత్తి – ఇవే చీకటిని పోగొట్టాయి. కిర్సనాయిలు తయారీతో దీపాల యుగం ముగిసింది. క్రమంగా లాంతర్లు, తర్వాత పెట్రోమాక్స్ లైట్లూ వచ్చాయి.
ఇక్కడితో ఆసియాదేశాల మేథోమధనం ఆగిపోయింది. ముస్లిం, యూరప్ దేశాల దాడులతో చాలా ఆసియాదేశాలు వలస పాలనలోకి పోయాయి. ఈ జనం కూలీలుగా, బానిసలుగా, నిరక్షరాస్యులుగా మారారు. వృత్తులన్నీ కనుమరుగయ్యాయి. యూరప్ అమెరికాలు భారత్ చైనా వంటి దేశాల నుంచి తరలించిన సంపదతో పారిశ్రామిక విప్లవం సాధించాయి.
విద్యుత్తు ఉత్పత్తి చేశాక ధామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నాడు. అంతటితో మానవునికి రాత్రి, పగలూ తేడా దాదాపు అంతరించిపోయింది. నేడు ఎడిసన్ బల్బు మాయమై ఎల్ ఇ డి లోకం ఆవిష్కృతమైంది. ఇపుడు అదే నడుస్తోంది.
ఇక్కడివరకూ ఒప్పుకుంటారు కదూ… ఇక భవిష్యత్ ఏమిటో చెపుతా ఆశ్చర్యపోవద్దు!మళ్లీ శక్తికోసం, వెలుతురుకోసం సూర్యుని మీద ఆధారపడబోతున్నాం. ఇప్పటికే సోలార్ పవర్ సామర్ధ్యం లోకానికి అర్ధమైంది.భవిష్యత్తులో వీధి లైట్లు ఉండవు. ఇళ్లలో లైట్లుండవు. సూర్య రశ్మిని భూమిమీదికి ప్రతిఫలించే చిన్న చిన్న చందమామలు (శాటిలైట్లు) కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. సూర్యరశ్మిని విద్యుత్ గా మార్చే బ్యాటరీలు పెద్ద ఎత్తున వినియోగంలోకి వస్తాయి.ఇపుడు పెట్రోలు కోసం గల్ఫ్ దేశాలమీద ఆధారపడినట్లు అపుడు విద్యుత్ కోసం భూమధ్యరేఖ సమీపాన ఉన్న ఆఫ్రికా ఇండియా, మెక్సికో వంటి దేశాలమీద ప్రపంచం ఆధార పడుతుంది.ఐటి బూమ్ ఎలా వచ్చిందో అలా సోలార్ బూమ్ వస్తుంది. సహారా, ధార్ వంటి ఎడారులకు మహా డిమాండు వస్తుంది.
అమెరికా మాత్రం తన ఆధిపత్యాన్ని కోల్పోదు, ఎందుకంటే ఇంగ్లండ్ మన ధన సంపదను మాత్రమే దోచుకుని మేధో సంపదను నాశనం చేసింది. అమెరికా మన మేథోసంపదను ధనం ఆశచూపి ఆకర్షిస్తూనే ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఆఫ్రికా, మెక్సికోలకు వలసలు మొదలవుతాయి.
దీపం ఇంతటి శక్తిమంతమైనది కనుకనే మనకు దీపావళి ఒక పండుగ అయింది.
సేకరణ : ఐ-హబ్

LEAVE A RESPONSE