-
రేవంత్ సిఫార్సు చెల్లింది ఒక్కరికేనా?
-
వేం, అద్దంకి, ఫయీమ్, విజయాబాయి పేర్లు సిఫార్సు చేసిన రేవంత్?
-
అందులో అద్దంకి దయాకర్ ఒక్కరికే సీటు
-
అద్దంకి వెనుక రాహుల్ సలహాదారు కొప్పుల రాజు
-
దానితో దయాకర్‌కు కలసివచ్చిన అదృష్టం
-
కోమటిరెడ్డి-దయాకర్‌కు రాజీ కుదిర్చిన జానారెడ్డి?
-
దానితో అద్దంకి విషయంలో పట్టుసడలించిన కోమటిరెడ్డి?
-
ఎస్టీ కోటాలో విజయాబాయికి ఇవ్వాలని రేవంత్‌కు పొంగులేటి సిఫార్సు
-
జానారెడ్డి ర ంగంలోకి దిగడంతో శంకర్‌నాయక్‌కు సీటు
-
తన అనుచరుడికి సీటు ఇప్పించుకోవడంలో జానా సక్సెస్
-
షబ్బీర్ అలీకి జానారెడ్డి సిఫార్సు
-
మీనాక్షి ఫార్ములాతో సీటు దక్కని ఫయీమ్
-
కెసి వేణుగోపాల్ కోటాలో విజయశాంతికి సీటు
-
విజయశాంతికి మరిన్ని బాధ్యతలు?
-
సీఎం సిఫార్సులు పట్టించుకోని హైకమాండ్
-
కాంగ్రెస్‌లో కొత్త పరిణామాలపై చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ రంగప్రవేశం తర్వాత కాంగ్రెస్‌లో కథ మారుతోంది. ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దికాలం వరకూ తెలంగాణ కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన సీఎం రేవంత్‌రెడ్డి హవాకు.. మీనాక్షి రాకతో బ్రేకులు పడినట్లే కనిపిస్తోందన్న చర్చకు తెరలేచింది. తాజా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో సీఎం సిఫార్సులు చెల్లలేదని, మొత్తం హై‘కమాండ్’ చేసిందన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
కానీ కొన్ని ప్రధాన మీడియా సంస్థలు మాత్రం.. ఎమ్మెల్సీల ఎంపికలో రేవంత్ మాట చెల్లుబాటయిందని ప్రచారం చేసినప్పటికీ, తెరవెనుక జరిగిన కథ మాత్రం వేరేనంటున్నారు. అదంతా రేవంత్ వ్యూహబృందం మీడియాలో చేసుకుంటున్న ప్రచారమేనని, నిజానికి రేవంత్ సిఫార్సు చేసిన వారిలో, కేవలం ఒక్కరికే సీటు దక్కిందంటున్నారు. అది కూడా కొప్పుల రాజు మద్దతు ఉండబట్టి కలసివచ్చింద న్న ప్రచారం, పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో.. సీఎం రేవంత్‌రెడ్డి మాట పెద్దగా చెల్లుబాటు కాలేదన్న చర్చకు తెరలేచింది. నిజానికి రేవంత్.. తన అనుచరులైన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఫయీమ్, అద్దంకి దయాకర్, ఎస్టీ కోటాలో విజయాబాయి పేర్లు సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు.
అయితే వీరిలో హైకమాండ్ కేవలం అద్దంకి దయాకర్ ఒక్కరి పేరు మాత్రమే ఆమోదించినట్లు చెబుతున్నారు. అయితే దానికి మరో కారణం కూడా లేకలేదంటున్నారు. రాహుల్ రాజకీయ సలహాదారయిన, పార్టీ జాతీయ నేత కొప్పులరాజు కూడా దయాకర్ పేరు సిఫార్సు చేయడం, అద్దంకికి కలసివచ్చిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక తన అనుచరుడైన వేం నరేందర్‌రెడ్డి, ఫయీమ్ కోసం రేవంత్ ఎంత కృషి చేసినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తన జిల్లాకు చెందిన విజయాబాయికి సీటు ఇవ్వాలని, రేవంత్ ద్వారా ప్రయత్నించారు. ఆ క్రమంలో సీనియర్ నేత జానారెడ్డి రంగప్రవేశం చేయడంతో కథంతా మారిపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జానారెడ్డి తన జిల్లాకు చె ందిన శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ సీటివ్వాలని, ఢిల్లీకి వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది.
తన అనుచరుడైన శంకర్‌నాయక్ పార్టీ కోసం దశాబ్దాల నుంచి కష్టపడుతున్నారని, ఎంపీపీ, జడ్పీటీసి చేశారని, గతంలో అవకాశం రానందున ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాలని జానారెడ్డి పట్టుపట్టడంతో, నాయకత్వం ఆయన మాట గౌరవించి.. శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ ఇచ్చిందంటున్నారు. దానితో రేవంత్-పొంగులేటి సిఫార్సు చేసిన విజయాబాయికి సీటు రాకుండా పోయింది.
ఇక ఫైర్‌బ్రాండ్ విజయశాంతికి.. రాష్ర్ట స్థాయిలో ఎవరూ సిఫార్సు చేయలేదని, ఏఐసీసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సిఫార్సుతోనే ఆమెకు ఎమ్మెల్సీ వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయశాంతి సేవలు భవిష్యత్తులో పార్టీకి అవసరం ఉందని భావించిన వేణుగోపాల్, ఆమె వైపు మొగ్గుచూపించారు. ఆమెకు త్వరలో మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
మైనారిటీ కోటాలో తన వర్గీయుపైన ఫయీమ్‌కు సీటు ఇప్పించేందుకు రేవంత్ శతవిధాలా కృషి చేసినప్పటికీ, ఆయన ప్రయత్నాలను హైకమాండ్ పట్టించుకున్నట్లు లేదు. పైగా అదే మైనారిటీ కోటా నుంచి షబ్బీర్ అలీకి ఇవ్వాలని, జానారెడ్డి కూడా సిఫార్సు చేసినట్లు సమాచారం. పైగా రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రూపొందించిన ఫార్ములా కూడా, రేవంత్ ప్రయత్నాలకు గండికొట్టేందుకు కారణమయిందని చెబుతున్నారు. ఫయీమ్ ఇప్పటికే ఒక పదవిలో ఉన్నందున, మళ్లీ ఎమ్మెల్సీ ఇవ్వడం కుదరదని మీనాక్షి సైతం స్పష్టం చేయడంతో, రేవంత్‌కు దారులు మూసుకుపోయాయంటున్నారు.
ఇదిలా ఉండగా.. శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ ఇప్పించేందుకు జానారెడ్డి ప్రయత్నిస్తున్న సమాచారం తెలుసుకున్న రేవంత్.. జానారెడ్డితో మాట్లాడినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన అనుచరుడైన వేం నరేందర్‌రెడ్డికి కూడా, ఎమ్మెల్సీ సీటు సిఫార్సు చేయాలని జానారెడ్డిని అభ్యర్ధించినట్లు చెబుతున్నారు.
వేం ఎమ్మెల్సీ అయిన తర్వాత.. మిమ్మల్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించి, పాలనలో మీ సలహాలు తీసుకుంటానని జానారెడ్డికి ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనకు ఎలాంటి పదవులూ అవసరం లేదని, శంకర్‌నాయక్‌కు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే నాయక్‌కు సీటివ్వాలని కోరారని జానారెడ్డి స్పష్టం చేశారట. నిజానికి శంకర్‌నాయక్ తనకు సీటివ్వాలని గతంలోనే రేవంత్‌ను అభ్యర్ధించగా, జడ్పీ చైర్మన్ సీటు ఇప్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
అదే సమయంలో అద్దంకి దయాకర్‌కు గతంలో మంత్రి కోమటిరెడ్డికి ఉన్న వైరం దృష్ట్యా, వారిద్దరి మధ్య రాజీ కుదర్చాలన్న రేవంత్ అభ్యర్థనను.. జానారెడ్డి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఆ మేరకు వారిద్దరి మధ్య రాజీ కుదర్చడంతో, ఒక అవాంతరాన్ని అధిగమించినట్లయింది. గతంలో కోమటిరెడ్డి-దయాకర్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.