– వెంకటరమణపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సిందే
– న్యాయం అమ్మకానికి గురవుతున్నదన్న భావనకు దారితీస్తుంది
– జస్టిస్ లక్ష్మణ్
హైదరాబాద్, జూన్ 26- హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. వెంకటరమణపై నమోదైన కేసులో దర్యాప్తు పెండింగులో ఉన్నందున కేసును కొట్టివేయజాలమని హైకోర్టు పేర్కొంది.
”పిటిషనరుకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. ఈ న్యాయస్థానంలోని న్యాయమూర్తులకు లంచం ఇచ్చేందుకు డబ్బు వసూలు చేశాడని వచ్చిన ఆరోపణ న్యాయవ్యవస్థ స్వతంత్రతపైన తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తుంది. న్యాయం అమ్మకానికి గురవుతున్నదన్న భావనకు దారితీస్తుంది. అటువంటి తీవ్రమైన ఆరోపణలపై తప్పనిసరిగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది” అని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
కేసులో తుది నివేదిక వచ్చేదాకా ఆయనను అరెస్టు చేయబోరని హైకోర్టు పేర్కొంది. వెంకటరమణ ఈ కేసు దర్యాప్తులో అధికారులకు సహకరించాలని, సహకరించకపోతే చట్టప్రకారం అధికారులు చర్యలు తీసుకోవచ్చునని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని కోర్టు పేర్కొంది. తన భూమికి సంబంధించిన వివాదంపై సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణను ఆశ్రయించగా న్యాయమూర్తులను మేనేజ్ చేసి అనుకూల తీర్పు పొందేందుకోసమని తన నుంచి ఏడుకోట్ల రూపాయలు తీసుకున్నాడని నిమ్మ నారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.