– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ ను దృష్టిలో పెట్టుకుని బీసీ హాస్టళ్ల వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొంథా తుఫాన్ మంగళవారం అర్ధరాత్రి తీరం దాటనున్న నేపథ్యంలో వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు, ప్రిన్సిపాళ్లు 24 గంటలూ హాస్టళ్లలో ఉండాలని, విద్యార్థులతో కలిసి రాత్రి నిద్ర చేయాలని ఆదేశించారు.
మారిన వాతావరణం నేపథ్యంలో విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలని స్పష్టంచేశారు. బయట ఆహారాలను హాస్టళ్లలోకి అనుమతించొద్దన్నారు. తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశముందని, ఇన్వర్టర్లను పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. టార్చిలైట్లు, క్యాండిల్స్, అగ్గిపెట్టెలను పెద్ద మొత్తంలో ముందు జాగ్రత్తగా సమకూర్చుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్ల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్యులతో వైద్య సేవలందించాలన్నారు. హాస్టళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేయాలని స్పష్టంచేశారు. జిల్లా స్థాయిలో డీబీసీడబ్ల్యూవోలు, రాష్ట్ర స్థాయిలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లిఖార్జున, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలత హాస్టళ్లను, ఎంజేపీ స్కూళ్లను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సవిత ఆదేశించారు.