– తన అవలక్షణాల్ని ఎదుటి వారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజం
చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్ లపై తప్పుడు కేసులు
– మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు
ఆనాడు జలయజ్ఞంలో ధనయజ్ఞంపై ప్రజాదృష్టి మళ్లించడానికి చంద్రబాబుపై 26 సభా సంఘాలు, సిఐడి కేసులు పెట్టారు. రుజువులు చూపలేకపోయినందున వాటిని కోర్టులు కొట్టివేసినవి. నేడు లాండ్, శాండ్, వైన్, మైన్ లలో లూటీపై ప్రజాదృష్టిని డైవర్ట్ చేయడానికి అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ దుష్ప్రచారం చేశారు. వీటికి రుజువులు చూపనందున ఇన్ సైడ్ ట్రేడింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇది బాధితులు లేని కేసని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
తాజాగా వివేకా హత్యలో అవినాష్ రెడ్డి అరెస్ట్, తాడేపల్లి ప్యాలెస్ పాత్రపై రాబోయే చర్చను డైవర్ట్ చేయడానికి అమరావతిలో లేని, వేయని రింగ్ రోడ్డులో క్విడ్ ప్రోకో అంటూ చట్టవిరుద్దమైన జీవో 89 విడుదల చేశారు. చట్ట, ప్రజా ప్రయోజనప్రాతిపదిక లేని జీఓ.89 న్యాయస్థానంలో నిలవదని జగన్ రెడ్డికి తెలిసీ రాజకీయ దుష్ప్రచారం కోసమే అక్రమ జీఓ విడుదల చేయించారు. సాక్షి మీడియాతో పాటు జగన్ రెడ్డి కుటుంబ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది కాబట్టి ఎదుటి వారికి ఆ మరకలు అంటించేందుకు లింగమనేని గెస్ట్ హౌస్ పై అటాచ్ మెంట్ నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్ లపై తప్పుడు కేసులు పెట్టారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు- వాస్తవాలు:
• ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగం. మాస్టర్ ప్లాన్ ని ఖరారు చేయడానికి అప్పటి ఉన్నతాధికారులు అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలు స్వీకరింపబడి వాటిని మెరిట్ ఆధారంగా అవి పరిష్కరించబడ్డాయి. అభ్యంతరాల పరిష్కారంపైన ప్రజలు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.
• లింగమనేని కుటుంబానికి అమరావతి ప్రాంతంలో ఉన్న భూమి 1986-2014 మద్య కాలంలో కొనుగోలు చేసినవి. రాష్ట్ర విభజన తరువాత లింగమనేని ఆస్తులు కొనుగోలు చేయలేదు.
• ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కారణంగా లింగమనేని కుటుంబం 14 ఎకరాల భూమిని కోల్పోయింది. లింగమనేని భూములు ప్రతిపాదిత ఇన్నర్ రింగ్‌రోడ్డుకు 4 నుంచి 10 కి.మీ దూరంలో ఉన్నాయనేది వాస్తవం. ఆయన ఆస్తులు ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని లేవు.
• లింగమనేని ఏ విధంగా అయాచితంగా లబ్ది పొందాడో ఫిర్యాదుదారుడైన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. సి.ఐ.డీ కూడా వారు చేస్తున్న ఆరోపణలకు తగు సాక్ష్యాధారాను చూపలేకపోతున్నారు. జగన్ రెడ్డి మెప్పుకోసమే తప్పుడు కేసులు పెట్టారు. గత ఏడేళ్లలో లింగమనేని ఆస్తులపై ఏ ప్రయివేటు వ్యక్తికూడా పిర్యాదు చేయలేదు. గతంలో గుడ్డిగా జీఓలపై సంతకాలు పెట్టిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను జగన్ రెడ్డి కుటుంబం జైలుకు పంపిన విషయాన్ని నేడు గుడ్డిగా సంతకాలు పెట్టే అధికారులు గుర్తుపెట్టుకోవడం మంచిది.
• ఇన్నర్ రింగ్ రోడ్డుతో కూడిన మాస్టర్ ప్లాన్ ను రిట్ పిటీషన్ నెం.13203/2020 లో గౌరవ హైకోర్టు సమర్ధించింది. ఇప్పుడు ఆ కేసు సుప్రీం కోర్టులో ఉంది. సబ్ జుడీషియస్ గా ఉన్న రమేష్ ఆస్తిని అటాచ్ చేయడం చట్టం ముందు నిలవదని జగన్ రెడ్డికి తెలిసి కూడా రాజకీయ దుష్ప్రచారం కోసమే అటాచ్ మెంట్ నాటకం ఆడుతున్నాడు.
• చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం ఆయన పేరున రిజిస్టర్ చేయలేదని జీవో లో పేర్కొన్నారు. ఆ గెస్ట్ హౌస్ కు ఓనర్ లింగమనేని అయినప్పుడు అందులో చంద్రబాబు క్విడ్ ప్రోకో ఎలా ఉంటుందనే విజ్జత లేకుండా తప్పుడు జీవో ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రజాప్రయోజనం ఏమీలేదు. జగన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కొందరు కళంకిత పోలీసు అధికారులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. నీలిమీడియాలో పుంఖానుపుంఖాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు.
• 27.04.2022 న ఆళ్ల రామకృష్ణారెడ్డి ధాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను అనుసరించి క్రైమ్.నం. 16/22 ను రిజిస్టర్ చేశారు. ఈ అక్రమ కేసులో గౌవర హైకోర్టు సెప్టెంబర్ 06, 2022 న నారాయణ వగైరాలకు బెయిల్ మంజూరు చేసి ఉన్నది. ఒక అబద్దాన్ని పదేపదే తిప్పించి మళ్లించి చెప్పడం జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ రాజకీయం. ఇన్నర్ రింగ్ రోడ్డు కాగితాల మీదనే ఉన్నది. భూమిపై రోడ్డు నిర్మించలేదు. పైగా సుప్రీంకోర్టులో ఉన్నది. ఇందులో క్విడ్ ప్రోకో ఎలా జరుగుతుంది? అమరావతిలో జగన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నారని, చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని వైకాపా నేతలు ఎన్నోసార్లు విమర్శలు చేశారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా జీఓలు ఇవ్వడం, వైకాపా నేతలు మాట్లాడటం అబద్ధాలకు, రాజకీయ కక్షలకు పరాకాష్ట కాదా? తన నేరాలు, కుంభకోణాలు కప్పిపెట్టుకునేందుకు జగన్ రెడ్డి ఎదుటివారికి తన అవలక్షణాల్ని అంటకట్టడాన్ని ప్రజలు విశ్వసించరు, సహించరు. జగన్ రెడ్డి వికృత క్రీడను ఆపలేకపోతే ప్రజాకోర్టులో దోషిగా నిలబడక తప్పదు. గుడ్డిగా జీఓలు విడుదల చేసే కళంకిత అధికారులు చట్టంముందు నిలబడక తప్పదు.