రాజకీయ కక్షతో జగన్ ఆడుతున్న జగన్నాటకం

-మొదలుపెట్టని పనిలో అవినీతి ఎక్కడుంటుందో ముఖ్యమంత్రే చెప్పాలి
-కరకట్ట ఇంటికి ఇచ్చిన జప్తు నోటీసుకు చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదు
-లింగమనేని రమేష్ భూములన్నీ ప్రపోజ్డ్ ఐఆర్ఆర్ కు 4 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి
-జగన్ ప్రభుత్వం ‘‘ డిస్ట్రక్టివ్’’. ఆయన పాలన ‘‘కన్ స్ట్రక్టివ్’’ కాదు
-జగన్ డైవర్షన్ యాక్టివిటీస్ లో దిట్ట
-చంద్రబాబు నివాసముంటున్న ఇంటిని జప్తు చేస్తూ ప్రభత్వం ఇచ్చిన నోటీసు జగన్నాటకం
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

జగన్ ది విధ్వంస పాలనేగానీ.. ఈయన ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రభుత్వం కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ‘‘ డిస్ట్రక్టివ్’’. ఆయన పాలన ‘‘కన్ స్ట్రక్టివ్’’ కాదు.

పాలన ప్రారంభించిన రోజుల్లోనే ప్రజా ఉపయోగమైన ‘‘ప్రజాదర్బార్’’ను కూలగొట్టి రాష్ట్ర ఖజానాకు నష్టం తెచ్చారు. ఇదే ప్రజా దర్బార్ ను ప్రజా ఉపయోగాలకు వినియోగించి ఉండొచ్చు. నేరం జరగకపోయినా, రాజకీయ దురుద్దేశంతో సీఐడీని తన ఆధీనంలోకి తీసుకొని చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్ తదితరులపై క్రైమ్ 16/22 రిజిష్టర్ చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారు. రేపో మాపో అరెస్టు కాబోతున్న మీ తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్టుపై ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఈరోజు ఈ జప్తు నాటకమని తెలుస్తోంది.

అలో లక్ష్మణా అని అల్లాడుతున్న రైతుల ఇక్కట్లు తీర్చలేక, వారిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఈ కరకట్ట ఇంటి కట్టుకథ కాదా? నేరం జరగకపోయినా, కేసు రిజిష్టర్ చేసి దర్యాప్తు చేస్తున్న వింత ప్రభుత్వం జగన్ ది. అమరావతి రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ పనులే మొదలుపెట్టలేదు. మొదలుపెట్టని పనిలో అవినీతి ఎక్కడుంటుందో ముఖ్యమంత్రే చెప్పాలి. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు జప్తు చేస్తున్నామని చెబుతున్న జగన్.. ఇంత హదావుడి చేయాల్సిన అవసరమేముంది? ఆయనేమైనా నేరస్థుడా? ఛీటరా? కోర్టులో ఆయనపైన ఏమైనా ఛార్జిషీట్లు ఉన్నాయా? ఏమీ లేనిదానికి ఇంత హంగామానా?

మీరు ముద్దాయిగా వున్న వేలాది కోట్ల రూపాయల ఖరీదుగల ఆస్తులైన జగతీ పబ్లికేషన్స్ కేసులో మీ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ని ఈడీ జప్తు చేసిన రోజున కూడా ఇంతగా పోలీసులు హడావుడి చేయలేదు. కోటి రూపాయలు ఖరీదైన కరకట్ట ఇల్లు జప్తు నోటీసుకు ఇంత హడావుడి అవసరమా? ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ఇంటిలోనే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఇంటిలోనే కొనసాగుతానని ముఖ్యమంత్రి అయిన మీకు ఆయన ఆనాడు లేఖ రాసింది నిజంకాదా? ఆనాడు ఆ లేఖపై స్పందించలేదు. సీఐడీ దర్యాప్తుకు పంపలేదు. ఈనాడు ఆ ఇంటి జప్తుపై అవసరానికి మించి ఉబలాటపడుతున్నారు.

లింగమనేని రమేష్ భూములన్నీ ప్రపోజ్డ్ ఐఆర్ఆర్ కు 4 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అటువంటప్పుడు ఆయన అతిగా లబ్ది పొందడానికి అవకాశమెక్కడ ఉంటుంది? ఈ కేసులో నష్టపోయినవారెవరు మీకు ఫిర్యాదు ఇవ్వలేదు. నేరమూ జరగలేదు, ఫిర్యాదు ఇచ్చిన బాధితులు ఎవరూ లేరు, మీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రిపోర్టు ఇస్తే ప్రతిపక్షాలను ఇబ్బంది పెడతారా ? ఇది కక్ష సాధింపు కాకపోతే మరేంటి?. ఇది మీ అరాచక, అస్తవ్యస్థ, రాజకీయ కక్షపూరిత పాలనకు నిదర్శనంకాదా?

వ్యక్తిగత కక్షతో ఈ ప్రభుత్వం నడుస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం బొక్కబోర్లా పడుతుంది. లింగమనేని రమేష్ 1984 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో అనేక పొలాలు కొన్నానని ఒకపక్క చెబుతుంటే, మీరొకపక్క ఆయన లబ్ధి కోసమే ఐఆర్ఆర్ఆర్ ఉపయోగించుకున్నారని అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు? ఈ ప్రభుత్వ మాటలు నమ్మొద్దు. కరకట్ట ఇంటికి ఇచ్చిన జప్తు నోటీసుకు చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదు.

జగన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయాడు. 22 కేసుల్లో జగన్ ను 420 అని చెబుతూ ఛార్జిషీట్లు వేశారు కావున ఇతరులపైన కూడా బురదజల్లాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ నాటకానికి తెరలేపాడు. అబద్ధాలు చెప్పి అందలమెక్కాలనుకోకూడదు. ప్రభుత్వ పాలన సరిగా లేదు. న్యాయబద్ధంగా నడచుకోవడంలేదు. అవినీతి, అరాచక, పాలేగాళ్ల, ఫ్యాక్షనిస్టు, రాక్షస పాలన రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైపోయింది.

ఇకమీదట జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. త్వరలోనే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. జగన్ డైవర్షన్ యాక్టివిటీస్ లో దిట్ట. చంద్రబాబును ఆ ఇంటిలో నుంచి బయటికి పంపాలనే ఆలోచన జగన్ కు ఉంది. దీన్ని బట్టి జగన్ ఎంత ఫ్యాక్షనిస్టో అర్థమవుతోంది.

జగన్ ప్రజాస్వామ్య పాలకుడో, ఫ్యాక్షనిస్టో అర్థంకావడంలేదు. దిక్కు, దిశ, ఆలోచన లేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ఆడమన్నట్లు ఆడే సీఐడీతో ప్రజలకు ఏం రక్షణ ఉంటుందో ప్రజలు ఒకసారి ఆలోచించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.