– జగన్ కో రూలు… రామచంద్రయాదవ్ కు మరో రూలా?
– ఈ రాష్ట్రంలో టిడిపి, వైసిపి తప్ప మరే పార్టీలు ఉండకూడదా?
– కేసులున్నాయనే సాకుతో అనుమతులు ఇవ్వరా?
– నాపై ఉన్న కేసులు తప్పుడు కేసులని అసెంబ్లీ సాక్షిగా ఇదే ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం మరిచారా?
– అనకాపల్లి పోలీసులు తీరుపై బీసీ వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం
విశాఖ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని బిసి వై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపి తప్ప మరే పార్టీలు ఉండకుండా పోలీసులు ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకున్నారా? అని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకున్న ఆయన విశాఖ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్య పేటలో ఏర్పాటు కాబోతున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని, సంఘీభావం తెలిపేందుకు తనకు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు. కరేడు పర్యటనకు ఏ అనుమతులు ఇచ్చారో అదే అనుమతులు నక్కపల్లి పర్యటనకు కూడా ఇవ్వాలని, ఈనెల 10వ తేదీ లోగా నిర్ణయాన్ని తెలియజేయాలని కోర్టు ఆదేశించిందన్నారు.
కానీ పోలీసులు మాత్రం 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తన వాట్సాప్ కు అనుమతులు ఇవ్వలేమంటూ నోటీసులు పంపారన్నారు. పుంగనూరులోని తన నివాసానికి నోటీసులు అతికించారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఢిల్లీలో ఉన్న తన వద్దకు పోలీసులు వచ్చారని, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నక్కపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు.
చంద్రబాబు మాటకే విలువలేదా?
రాజయ్యపేటలో పర్యటించేందుకు అనుమతులు ఇవ్వకపోవడానికి తనపై ఉన్న కేసులే కారణమని పోలీసులు చెప్పడం సిగ్గుచేటని రామచంద్రయాదవ్ పోలీసుల తీరును దుయ్యబట్టారు. తనపై 13 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందుకే అనుమతులు ఇవ్వడం లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారన్నారు. తనపై ఉన్నది 13 కేసులు కాదని, దాదాపు 28 కేసులు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలోనూ, అసెంబ్లీలోనూ తనపై పెట్టిన కేసులు తప్పుడు కేసులని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిండుసభలోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పినా కూడా… పోలీసులు అవే తప్పుడు కేసులు చూపించి తనకు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అనుమతులు ఇవ్వని పోలీసులు.. రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ఎలా అనుమతులు ఇచ్చారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో అందరికీ తెలుసన్నారు. ఆయనపై కేసులు లేవా? అని ప్రశ్నించారు. తాను పర్యటించాల్సిన ప్రాంతానికి చెందిన డివిజన్ లోనే జగన్ మోహన్ రెడ్డి ఆర్భాటంగా పర్యటించారని, పోలీసులు ఆయనకు ఎలా అనుమతులు ఇచ్చారని ఎద్దేవా చేశారు.