– నరసింహారావు తల్లిదండ్రులకు మంత్రి సవిత భరోసా
మంగళగిరి : ‘మీ బిడ్డ ఆరోగ్య బాధ్యత మాది.. మీ బిడ్డ కోలుకునేలా మెరుగైన వైద్యమందిస్తాం.. అధైర్యపడొద్దు’ అంటూ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థి నరసింహరావు తల్లిదండ్రులకు రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత భరోసా ఇచ్చారు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బీసీ హాస్టల్ విద్యార్థి నరసింహకు మెరుగైన వైద్యం కోసం మంత్రి సవిత ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు శనివారం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థిని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సత్యనారాయణతో కలిసి మంత్రి సవిత పరామర్శించారు. నరసింహా ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవల గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి తక్షణమే కోలుకునేలా వైద్య సేవలందించాలని మంత్రి సవిత తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ నటరాజన్ తోనూ మంత్రి సవిత ఫోన్లో మాట్లాడారు.
మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆయన తెలిపారు. అక్కడే ఉన్నవిద్యార్థి తల్లిదండ్రులు గురవయ్య, సుజాతను మంత్రి పరామర్శిస్తూ ఓదార్చారు.
‘మీ బిడ్డకు మెరుగైన వైద్యం అందిస్తాం… మీ బిడ్డ ఆరోగ్య బాధ్యత మాది… అధైర్యపడొద్దు’ అంటూ భరోసా ఇచ్చారు. విద్యార్థి ఆరోగ్యం మెరుగుపడే వరకూ ఆసుపత్రిలోనే బీసీ సంక్షేమ శాఖాధికారులు ఉండాలని మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి సవిత వెంట జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి మయూరి, ఇతర అధికారులు ఉన్నారు.