కాళేశ్వరం దర్యాప్తు నివేదిక రాకముందు మంత్రులు ఎలా మాట్లాడుతారు?

-ఆరు హామీల అమలుపై ప్రజల్లో అనేక అనుమానాలు
-కాలయాపన కోసమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారని ప్రజల్లో చర్చ
-ప్రజల వివరాలు అందుబాటులో ఉన్నా దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారు ?
-రూ. 4 వేలకు పెంచి డిసెంబరు, జనవరి నెలల పెన్షన్లను ఒకటిన పంపిణీ చేయాలి

కాన్వాయ్ వాహనాలపై సీఎం వ్యాఖ్యలు ఆయన గౌరవాన్ని తగ్గిస్తాయి
వాహనాల కొనుగోలు ఇంటెలిజెన్స్ విభాగం చూస్తుంది.. అందులో నాయకుల పాత్ర ఉండదు
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలి
సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న కవిత గారు

వరంగల్/ ములుగు: ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల కోసం స్వీకరిస్తున్న దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాలయాపన చేయడానికే దరఖాస్తుల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న చర్చ ప్రజల్లో జరుగుతోందని చెప్పారు.

సమ్మక్క ‌ – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోడానికి మేడారం వెళ్తున్న మార్గమధ్యంలో వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి కవిత గారు మాట్లాడారు. అనంతరం మేడారానికి బయలుదేరి వెళ్లారు.

వరంగల్ విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ…. ప్రస్తుతం ప్రభుత్వం అనుకుంటే పెన్షన్లు పొందుతున్న 44 లక్షల మందికి ఇచ్చిన హామీ మేరకు రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచి పెన్షన్ అందించవచ్చునని, కాబట్టి ముందు పెన్షన్ మొత్తాన్ని పెంచి ఇచ్చిన తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ఈ నెల పెన్షన్, రైతు బంధు రాలేదని గ్రామాల్లో చర్చ జరుగుతోందని, కాబట్టి మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచి పెండింగ్ లో ఉన్న డిసెంబరు నెల పెన్షన్ తో పాటు జనవరి పెన్షన్ ను కలిపి ఒకటో తేదీని పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే, పథకాల అమలు కోసం ప్రభుత్వం స్వీకరిస్తున్న దరఖాస్తుల విషయంలో ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, అన్ని వివరాలు అడుగుతున్నప్పటికీ బ్యాంకు ఖాతా వివరాలు అడగడం లేదని, కాబట్టి దరఖాస్తులు ఆమోదం పొందిన తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుంటారా లేదా కాలయాపన చేస్తారా అన్నది ప్రజల్లో చర్చ జరుగుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, చాలా ఇళ్లల్లో పురుషుల పేరిట గ్యాస్ సిలిండర్లు ఉన్న రీత్యా సబ్సిడీ సిలిండర్ పథకం తమకు వర్తిస్తుందా లేదా అని మహిళలు అనమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగానికి కరెంటు బిల్లుకు కట్టనవసరం లేదని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఈ నెల కరెంటు బిల్లు చెల్లించడంపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోందని చెప్పారు. జనవరి నెలలో వచ్చే డిసెంబరు బిల్లలు ఎవరూ చెల్లించకుండా ఉంటే బాగుంటుందన్న ఆలోచన ప్రజల నుంచి వస్తున్నదని తెలిపారు.

ప్రభుత్వం స్వీకరిస్తున్న దరఖాస్తులో నిరుద్యోగ భృతి కోసం వివరాలను సేకరించడం లేదని, దాంతో యువకులు అయోమయానికి గురవుతున్నారన్నారు. “ఎఫ్ఐఆర్ ఉన్న ఉద్యమకారులకే ప్రభుత్వం పెన్షన్ ఇస్తామంటున్నదని చాలా మంది అంటున్నారు. ఎఫ్ఐఆర్ ను ప్రామాణికం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎఫ్ఐఆర్ లు ఉన్నాయి. అమరవీరుల వివరాల సేకరణకు కూడా గతంలో మేము ఎఫ్ఐఆర్ ను ప్రామాణికంగా తీసుకుంటే విమర్శించారు.

ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే నిబంధన పెడుతోంది. ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసి అనేక కష్టాలు పడిన వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. ఎఫ్ఐఆర్ ఉన్నా లేకున్నా ప్రతి ఉద్యమకారుడ దరఖాస్తు చేయండి. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం” అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థైర్యాన్ని కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. ఓపికతో ఉండి పార్టీ సిద్ధాంతాలను మరింత ఉత్తేజంతో ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మనస్సులను చూరగొనడం ద్వారా మళ్లీ మనం మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కిరావడం జరుగుతుందని దిశానిర్దేశం చేశారు. స్థైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రస్తుతం అలవిగాని హామీలిచ్చి, అబద్ధాలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నామని, ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండదని స్పష్టం చేశారు.

కాళేశ్వరం అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కవిత గారు సమాధానమిస్తూ… ఈ అంశంపై తమ పార్టీ వైఖరిని ఇప్పటికే వెల్లడించిందని, దర్యప్తు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం దర్యాప్తు నివేదిక రాకముందే మంత్రులు ఇలా మాట్లాడడం సరికాదని సూచించారు.

సింగరేణి ఎన్నికలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… ఆ ఎన్నికల్లో పోటీ చేయవద్దని తమ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని, ఆ విషయాన్ని బాహాటంగానే ప్రకటించామని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ ఎదుగుదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేయాలని తాము పిలుపునిచ్చామని చెప్పారు.

కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాన్ని కాకుండా సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీని కార్మికులు గెలిపించుకున్నారన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి టీబీజీకేఎస్ నాయకులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పోటీలో లేము కాబట్టే ఈ రకమైన ఫలితాలు వచ్చాయని, కానీ పోటీలో ఉండి ఓడిపోయినట్లు పలు పత్రికలు రాశాయని, పోటీ లేని వాళ్లం ఎలా ఓడిపోయారన్నది వాళ్లే ఆలోచించుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి, మంత్రుల భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం చూస్తుందని, ముప్పును బట్టి భద్రతను కేటాయిస్తారని వివరించారు. కాన్వాయ్ ని భద్రతకు అనుగుణంగా ఎలా, ఎక్కడ తీర్చిదిద్దాలన్నదాన్న పోలీసులు ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతారని, అవసరమైనప్పుడు తీసుకొచ్చి కాన్వాయ్ ని వినియోగిస్తారని తెలిపారు. భద్రత విషయంలో రాజకీయ నాయకుల పాత్ర ఉండదని స్పష్టం చేశారు.

గత పదేళ్లలో తనకు ఇంత భద్రత… అంత భద్రత ఉండాలని కేసీఆర్ గారు కోరలేదని, పోలీసులే అవసరమైనంత భద్రత కల్పించారని ప్రస్తావించారు. అయితే, దాన్ని పెద్ద అంశంగా చేసి వాహనాలను విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి వెటకారంగా మాట్లాడడం వారి గౌరవాన్నే తగ్గిస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం దురదృష్టకరమని తెలిపారు.

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి
శనివారం రోజున మేడారంలోని సమ్మక్క ‌- సారలమ్మ అమ్మవార్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పూజారులు కవిత గారికి ఘన స్వాగతం పలికారు. కవిత గారి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, బీఆర్ఎస్ నాయకురాలు బీ నాగజ్యోతి ఉన్నారు.

అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ…. అమ్మవార్లను దర్శించుకోడం సంతోషంగా ఉందన్నారు. మేడారం సమ్మక్క ‌- సారలమ్మ జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, ఇది చేయగలిగిన అంశమేనని, కష్టమైన అంశం కాదని తెలిపారు. లక్షలాది మంది భక్తులు జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారని, ఇది లక్షాలాది మంది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

దక్షిణ భారత కుంభమేళగా చెప్పుకునే మేడారం జాతర తెలంగాణలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండడం అందరి అదృష్టమని అన్నారు. అటువంటి జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని ఎంతో కాలంగా తాము డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, ఎంపీలు, మంత్రులు అనేక సార్లు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మేడారం జాతరను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ఏర్పడిన వెంటనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూ. 100 కోట్ల మేర నిధులిచ్చి మొదటి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు.

ఆ తర్వాత ప్రతీ జాతరకు రూ. 75 కోట్లు ఖర్చు చేస్తూ మంచి ఏర్పాట్లు చేశామని వివరించారు. గత జాతరకు దాదాపు 3800 బస్సులను నడిపేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అయితే, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండి ఆయా రకాల గొడవలయ్యి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్న సందర్భాన్ని చూస్తున్నామని, ఈ క్రమంలో జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా బస్సులు నడిపించాలని, జాతరకు బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి సూచన చేశారు.

కాగా, గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం సమ్మక్క -‌ సారక్క పేరు పెట్టడం అందరూ సంతోషించతగ్గ విషయమన్నారు. గిరిజన విశ్వవిద్యాలయానికి బీఆర్ఎస్ హయాంలో భూమి ఇవ్వడమే కాకుండా రూ. 15 కోట్ల మేర నిధులు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. రూ. 850 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని నెలకొల్పడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ కృషి వల్ల రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ సంపద హోదా లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు మన ప్రాంతాన్ని చరిత్రలో మన జిల్లా, రాష్ట్రం పేర్లను గౌరవంగా చాటిచెప్పేందుకు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.

Leave a Reply