Suryaa.co.in

Andhra Pradesh

ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం..సీబీఐ విచారణతోనే రైతులకు న్యాయం

-ఏపీలో వ్యవసాయ రంగాన్ని హత్య చేస్తోన్న జగన్ రెడ్డి ప్రభుత్వం
-కొనుగోళ్లలో అక్రమాలను నిర్ధారించిన వైసీపీ అధికార పత్రిక -సాక్షి…ఇందులో ప్రధాన పాత్రదారులు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, దళారులే
-2020లో సర్వేపల్లిలో పురుడుపోసుకున్న ఈ కుంభకోణం ఈ రోజు వేల కోట్ల అక్రమాలతో రాష్ట్రమంతా విస్తరించింది
-ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ జరిపించడంతో పాటు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
-తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ధాన్యం కొనుకోళ్లలో జరిగిన భారీ కుంభకోణాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహద్‌రెడ్డి, బీద రవిచంద్రయాదవ్ డిమాండ్ చేశారు.
వారు ఇంకా ఏమన్నారంటే… మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో రైతుల్ని నిండా ముంచేశారు..ఇన్ని పాపాలు చేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.ధాన్యం కొనుగోళ్లలో జరిగిన భారీ కుంభకోణాన్ని 63 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు(వీఏఏ)కి అంటగట్టే ప్రయత్నం చేశారు..కానీ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వైపీపీ నేతలు, దళారులదే.

ఇది ఈ రోజే మొదలైన స్కాం కాదు..2020లోనే సర్వేపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కుంభకోణానికి బీజం పడింది. అప్పట్లో వెంకటాచలం మండలం ఈదగాలి ప్రాంతంలో గ్రావెల్ గుంటల సర్వే నంబర్లను చూపి దళారులు, వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆధారాలతో సహా బయటపెట్టాం. అప్పట్లో సాక్షి పత్రిక కూడా ఈ కుంభకోణం నిజమేనంటూ గింజ గింజకూ దోపిడీ శీర్షికతో ప్రధాన వార్తగా రాసింది. కానీ కుంభకోణంపై విచారణ జరిగితే పెద్ద తలకాయలు బయటపడతాయనే ఉద్దేశంతో ఆధారాలు వెలుగులోకి తెచ్చిన దళిత రైతు జైపాల్ పైనే రివర్స్ కేసు పెట్టి వేధించారు. అప్పటి నుంచి మేం అనేక మార్లు విచారణకు డిమాండ్ చేస్తూనే వస్తున్నాం..కానీ ప్రభుత్వంలో చలనం కరువైంది.

ఈ రోజు మళ్లీ వైసీపీ అధికార పత్రిక సాక్షి దళారులు…దగారులు అంటూ ఈ కుంభకోణంపై మరోవార్త రాసింది…ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా మొదటి నుంచి దీనిపై కథనాలు రాస్తూనేవున్నాయి.ఇది భారీ కుంభకోణం..మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో దోపిడీ జరిగింది.ఒక్క నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు..క్రమేణా రాష్ట్రమంతా విస్తరించిన వేలాది కోట్ల రూపాయల కుంభకోణం.మేము రైతుల నుంచి సేకరించి పక్కాగా వేసిన లెక్కల ప్రకారం ఒక్క నెల్లూరు జిల్లా రైతులే మూడేళ్లలో రూ.3 వేల కోట్లు నష్టపోయారు.

కనీస మద్దతు ధర రూ.16660గా ఉంటే ఈ మూడేళ్లలో రైతులకు దక్కిన ధర కనిష్టంగా రూ.8 వేలు, గరిష్టంగా రూ.12 వేలు మాత్రమే..అందులోనూ పుట్టికి 850 కిలోలకు బదులుగా 1050 నుంచి 1150 కిలోల వరకు దోచుకున్నారు. రైతుల్ని నిలువు దోపిడీ చేయడానికి పుట్టికి అర్థం మార్చేశారు. ఆర్నెల్ల క్రితం ధాన్యం అమ్ముకున్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నిన్న రూ.200 కోట్లు చెల్లించింది. ఈ ఆర్నెళ్లలో ఈ రూ.200 కోట్లకు వడ్డీలకు వడ్డీలు కట్టుకుని రైతులు మరింతగా మునిగిపోయారు. ఆ రోజు రైతులకు దళారుల ద్వారా పుట్టికి రూ.12 వేలకు మించి ధర దక్కలేదు. ఆ డబ్బులు కూడా ఆర్నెళ్లకు వచ్చాయి..ఈ రోజు పుట్టి ధాన్యం ధర రూ.18 వేలకు పైగా పలుకుతోంది..చేతిలో నగదు పెట్టి మరీ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కానీ రైతుల వద్ద మాత్రం ధాన్యం లేవు.

ఆ రోజు అప్పులోళ్లకు కట్టడం కోసం వచ్చిన కాడికి తెగనమ్ముకున్న రైతులు రెండు విధాలా దారుణంగా మోసపోయారు, నష్టపోయారు.మొన్న జరిగిన జెడ్పీ సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి మరో విషయం వెలుగులోకి తెచ్చారు. దళారులు వడ్లు కొలుచుకుని కోట్లు ఎగ్గొట్టారు. రైతులు వెళ్లి కేసులు పెడితే జిల్లా మంత్రి తరఫున ప్రభుత్వ న్యాయవాది వెళ్లి పోలీసులను బెదిరించి మరీ దళారులను వదిలించారట. ఆ దళారుల్లో మంత్రి మనుషులు కూడా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి జెడ్పీ సమావేశంలోనే నిలదీసిన పరిస్థితిని చూశాం. ఇన్ని దారుణమైన మోసాలు చేస్తూ మరో పక్క ఈ మూడేళ్లలో రైతుల ధాన్యం కొనుగోళ్లకు రూ.44 వేల కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు రూ.7 వేల కోట్లు ఖర్చుపెట్టామని మోసపు ప్రకటనలు ఇవ్వడం అన్యాయం. ఒక్క నెల్లూరు జిల్లా రైతులే 3 వేల కోట్లు నష్టపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరిగిన నష్టం ఎంతో.

ఏపీలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అమ్ముకోలేక పోతున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఏసీపీ నివేదిక ఇచ్చింది.అయినా ప్రభుత్వం స్పందించదా..రైతులు వేల కోట్లు నష్టపోతుంటే కనీసం చర్యలు తీసుకోవాలనే జ్ఞానం లేదా?టీడీపీ హయాంలో ఎకరా వరిసాగు పెట్టుబడి రూ.20 వేలుగా ఉంటే ఈ రోజు రూ.35 వేలకు పెరిగింది..దిగుబడులు మాత్రం తగ్గిపోయాయి.భూసార పరీక్షలు నిర్వహించి అవసరమైన సూక్ష్మపోషకాలను ఉచితంగా పంపిణీ చేయని కారణంగా గతంలో కట్టే దిగ్గుబడులు తగ్గి రైతులు నష్టపోయిన పరిస్థితి.

ఇంత భారీ నష్టం జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి స్పందించరు.. ఈ మూడేళ్లలో అన్ని రకాల ఉత్పత్తులు, వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి..కానీ ఒక్క రైతులు పండించే ధాన్యం ధర మాత్రం గణనీయంగా తగ్గిపోవడం బాధాకరం.ఏపీలో వ్యవసాయాన్ని ప్రభుత్వమే హత్య చేస్తోంది….ఫలితంగా రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.కళ్ల ముందే పుష్కలంగా నీళ్లున్నా పంటలు వేయలేక క్రాఫ్ హాలిడేలు ప్రకటించుకుంటున్నారు.

పది ఎకరాల రైతు కూడా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేక కూలికెళుతున్న దారుణమైన పరిస్థితులు పల్లెల్లో కనబడుతుండటం బాధాకరం.ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, మోసాలపై ఎమ్మెల్యేల చేతిలో గుమస్తాలుగా మారిపోయిన కొందరు పోలీసులు, అధికారుల కారణంగా విచారణ సక్రమంగా సాగే అవకాశం లేదు.రైతులకు న్యాయం జరగలాంటే ఏకైక మార్గం సీబీఐ విచారణే.సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి కూడా అవసరం లేదు…కనీస మద్దతు ధర అమలు పర్యవేక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది..అందులోనూ ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో ఎక్కువగా జరిగింది. ఈ ఒక్క జిల్లాలో ఎంక్వయిరీ జరిపితే మొత్తం గుట్టు బయటపడిపోతుంది.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలను మోసం చేసినట్టే…ఏపీలో రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్ర నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించి ఏపీలో జరిగిన ధాన్యం కొనుగోలు కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి.రైతుల సొత్తును మెక్కిన వారిపై కఠినంగా వ్యవహరించి ఈ నగదును కక్కించి బాధిత రైతు సోదరులకు రికవరీ చేయాలి.

వెంకయ్య నాయుడు అనుమతులు ఇప్పించింది వైపీపీ నేతలు దోచుకోవడానికా?
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై మేం మూడేళ్లుగా గొంతు చించుకుంటూనే ఉన్నాం.జిల్లా ఉన్నతాధికారుల అలసత్వంతోనే వేల కోట్ల కుంభకోణం జరిగింది.ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రత్యేకంగా జిల్లాలో ధాన్యం సేకరణకు అనుమతులు ఇప్పించింది వైపీపీ నేతలు దోచుకోవడానికా?కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలివైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల నుంచి ధాన్యం సేకరణలో దగా జరుగుతూనే ఉంది.

జరుగుతున్న అక్రమాలు, దోపిడీపై జిల్లాలోని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, రైతులు పదేపదే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తీసుకున్న చర్యలు శూన్యం.రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించలేని పరిస్థితుల్లో ఈ జిల్లా వాసి ఉప రాష్ట్రపతి అయిన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అనుమతులు ఇప్పించింది వైసీపీ నేతలు దోచుకోవడం కోసమా?

ఈ రోజు ఇతర పత్రికలు, ఇతర టీవీలో కాదు వైఎస్సార్ సీపీ అధికార పత్రిక సాక్షి మీడియానే తమ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై అర పేజీ రాసిందంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.గడిచిన నాలుగు నెలలుగా రైతులు ఏడుస్తుంటే అధికారులు ఎక్కడైనా ఒక్క చర్య అయినా తీసుకున్నారా?

వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇంతటి దారుణమైన దోపిడీ జరుగుతుండటం బాధాకరం.టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా చిన్నపొరపాటు జరిగినా, రైతులకు మంచి చేసినా, అదనపు ధర ఇప్పించినా చంద్రబాబు నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై నోరు పారేసుకున్నారు. అయినా మేం రైతుల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతిమండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ధాన్యం సేకరణ ప్రక్రియలో అవాంతరాలు లేకుండా పర్యవేక్షించాం.ఈ రోజు ధాన్యం సేకరణలో జరుగుతున్న అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు ఎందుకు చలనం లేకుండా ఉన్నారు..వైఎస్సార్ సీపీ గ్రామస్థాయి నేతలు కూడా జిల్లా ఉన్నతాధికారులను శాసించే పరిస్థితి రావడం బాధాకరం. మూడేళ్లుగా దోపిడీ కొనసాగింది.. రైతులు విలపిస్తున్నారు, మీడియాలో కథనాలు వస్తున్నాయి అయినా చర్యలు లేకపోవడంతో ఈ రోజు బరితెగించి చెరువులు, రోడ్లు, కాలువలు, గ్రామాలు, హైవే సర్వే నంబర్లు వేసి దోపిడీకి పాల్పడుతున్నారు.

ఇది ఆర్బీకేల్లో ఉండే సాధారణ వీఏఏలు చేయగలిగిన పనికాదు…ఈ రోజు వారిని పావులు చేసే ప్రయత్న చేస్తున్నారు.మూడేళ్లుగా డీఎస్వో, సివిల్ సప్లయీస్ డీఎం, జాయింట్ కలెక్టర్లకు తెలియకుండానే ఈ దోపిడీ జరుగుతోందా?ఓ వైపు ఆర్బీకేలు రైతులను పట్టపగలే దోచుకుంటుంటే అధికారులు ఎందుకు స్పందించలేకపోతున్నారు.

ఈ అక్రమాలు, దోపిడీపై విచారణ సమగ్రంగా జరగాల్సిందే. వైసీపీ నేతల దోపిడీపై ఆ పార్టీ ప్రభుత్వమే విచారణ చేస్తే న్యాయం జరగదు.సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ మేరకు సీబీఐ విచారణ జరిగితేనే రైతులకు న్యాయం జరుగుతుంది.నెల్లూరు జిల్లా కేంద్రంగా ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలి.

LEAVE A RESPONSE