Suryaa.co.in

Andhra Pradesh Features

21వ శతాబ్దంలో పేరు మోగిపోతున్న కొత్త తరం భారత మెట్రోపాలిటన్‌ నగరాలు హైదరాబాద్, బెంగళూరు!

(ఎంపి విజయసాయిరెడ్డి)

ఐక్యరాజ్య సమితి తాజా అంచనాల ప్రకారం కర్ణాటక రాజధాని బెంగళూరు అత్యధిక జనాభా ఉన్న మొదటి నాలుగు నగరాల్లో స్థానం సంపాదించింది. తెలుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ భారతదేశంలో జనాభా రీత్యా ఆరో అతిపెద్ద నగరంగా అవతరించింది. అలాగే ప్రపంచ సంపన్నుల జాబితాలు రూపొందించే హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ సంస్థ అధ్యయనం ప్రకారం బెంగళూరు, హైదరాబాద్‌ లో అపర కుబేరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

30 ఏళ్ల క్రితం, అంతకు ముందు దేశంలో మహానగరాలు అంటే ఢిల్లీ, బొంబాయి (ముంబై), కలకత్తా, మద్రాసు (చెన్నై) పేర్లే చెప్పేవారు. బ్రిటిష్‌ వారి పాలనాకాలంలో వీటిలోని మూడు నగరాలు వాటి పేరుతో ఉన్న 3 ప్రెసిడెన్సీలకు (కలకత్తా, మద్రాసు, బొంబాయి) రాజధానులు. 1911లో బ్రిటిష్‌ పాలకులు దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించాలని నిర్ణయించాక నాలుగో పెద్ద నగరంగా హస్తిన అవతరణకు పునాది పడింది. ఇవి పాలనా రాజధానులుగానే గాక, పారిశ్రామిక కేంద్రాలుగా శతాబ్దాలపాటు సేవలందించాయి.

ఐరోపా దేశాల పారిశ్రామిక విప్లవం కూడా కలకత్తా, మద్రాసు, బొంబాయి నగరాల అభివృద్ధికి కాణమైంది. పారిశ్రామిక విప్లవం, ఆంగ్లేయుల పాలన– చెన్నై, ముంబై, కోల్‌కత్తా నగరాల ప్రగతికి దోహదం చేస్తే, 20వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మొదలైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) విప్లవం, అంతకు ముందు ఔషధాల తయారీ రంగంలో వచ్చిన మార్పులు, ఫార్మాస్యూటికల్‌ సెక్టర్‌ లో భారతీయ నిపుణులు సాధించిన నైపుణ్యాలు బెంగళూరు, హైదరాబాద్‌ అనూహ్య అభివృద్ధికి ఇంధనంగా మారాయి.

20వ శతాబ్దం ద్వితీయార్ధంలో రూపురేఖలు మారిపోయిన రెండు దక్షిణాది నగరాలు!
నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్, బెంగళూరు నగరాలు రెండూ దక్షిణ భారతదేశంలోని దక్కన్‌ పీఠభూమిలో ఉన్నాయి. 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో 1960లు, 70లు, 80ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, భారత రక్షణ రంగ తయారీ కంపెనీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఏర్పాటయ్యాయి. లక్షలాది మందికి వీటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయి.

ఉద్యానవనాల నగరం బెంగళూరులో, సరస్సుల నగరం హైదరాబాద్‌ సిటీలో ఔషధాల ఫ్యాక్టరీలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఫ్లోరికల్చర్‌ (పువ్వుల వ్యాపారం) బాగా సాగిన బెంగళూరులో టెక్నాలజీ, ఐటీ కంపెనీల స్థాపన 1990ల నుంచీ వేగం పుంజుకుంది. కాని, ఫార్మా రంగంలో ముఖ్యంగా బల్క్‌ డ్రగ్స్‌ తయారీ యూనిట్ల ఏర్పాటుతో ఔషధాల తయారీ కేంద్రంగా అప్పటికే ప్రసిద్ధికెక్కిన హైదరాబాద్‌ వేగంగా బెంగళూరు దారిలో 1990ల రెండో భాగంలో ఐటీ పరిశ్రమ కేంద్రంగా ఎదగడం ప్రారంభించింది. 21వ శతాబ్దం ఆరంభానికి కొద్దిగా ముందు అంతర్జాతీయ ఐటీ సమస్య వై2కే పరిష్కారానికి సంబంధించిన ప్రాజెక్టుల ఫలితంగా కంప్యూటర్‌ సాఫ్ట్‌ వేర్‌ రంగం హైదరాబాద్‌ సిటీలో అంచనాలకు అందని రీతిలో 2004 నుంచి ఇప్పటి వరకూ విస్తరించింది.

సాఫ్ట్‌ వేర్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో భెంగళూరుతో పోటీ పడింది. ఐటీతో పాటు బయోటెక్నాలజీ, బయోసైన్సెస్‌ రంగాలు బెంగళూరు నగరం విపరీతంగా విస్తరించడానికి తోడ్పడ్డాయి. ఇలా ఆధునిక టెక్నాలజీ ఆధారిత ఔషధాల రంగం, ఐటీ రంగాలకు కేంద్రాలుగా మారిన క్రమంలో బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు గ్లోబలైజేషన్‌ ను అందిపుచ్చుకున్నాయి. అంతర్జాతీయ ఫైనాన్స్‌ కాపిటల్‌ ప్రవాహంలా వచ్చిపడడంతో హైదరాబాద్‌ నగరం మిలియనీర్లు, బిలియనీర్లకు నివాస కేంద్రంగా మారింది.

ఇక బెంగళూరు ఆధునిక ప్రగతికి కొద్దిగా ముందు పునాదులు పడడంతో ఈ కన్నడ నగరం ఇంకాస్త ముందుకెళ్లింది. పైన చెప్పిన హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ స్టడీ ప్రకారం బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో సెంటీ మిలియనీర్లు వరుసగా 50 మంది, 40 మంది ఉన్నారు. అలాగే, బిలియనీర్లు ఈ సిటీల్లో వరుసగా 8 మంది, ఐదుగురు ఉన్నారని తేలింది. ఆరంభంలోనే చెప్పుకున్న ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో పోటీపడడమేగాక కోల్‌ కత్తాను ఈ కొత్త తరం మెట్రోపాలిటన్‌ నగరాలు దాటిపోతున్నాయి. భారత అగ్రశ్రేణి నగరంగా కాస్త ముందే అవతరించిన చెన్నైకి బెంగళూరు, హైదరాబాద్‌ తోడయ్యాయి. 24 గంటలూ పనిచేసే గ్లోబల్‌ సిటీస్‌ గా పేరు సంపాదించాయి.

LEAVE A RESPONSE