– దసరా రెస్టారెంట్లో కుళ్ళిపోయిన మటన్
– ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరసా రెస్టారెంట్లు
– నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్
– నాగోల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లలో తనిఖీలు
– నగరంలోని పలు హోటళ్లలో అధికారులు తనిఖీలు
(వెంకటాచారి)
హైదరాబాద్ హోటళ్లకు వెళుతున్నారా? అయితే ఒక్క నిమిషం. ఇది చదివిన తర్వాత హోటళ్లకు వెళ్లాలా? వద్దా అన్నది ఆలోచించుకోండి. లేకపోతే ఆనక ఆగమయిపోతారు. ఇక మీ ఇష్టం! ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నారనుకుంటున్నారు కదా? మరి హోటళ్ల లోపల వాతావరణం ఎంత భయానకంగా ఉంటుందో.. అక్కడ తయారుచేసే వంటలను లొట్టలేసుకుని తినే భోజన ప్రియులకు తెలియాలి కదా? అందుకే ఓసారి హైదరాబాద్ హోటళ్లలోకి వెళదాం రండి.
హైదరాబాద్ నగరంలో దాదాపుగా ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితమే. దీంతో, చాలా మందికి ఇంట్లో వండుకు తినే తీరికా.. సమయం ఉండడం లేదు. ఆ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లకు జనం భారీగా క్యూ కడుతున్నారు..
ఇక వారాంతంలో.. అంటే శనివారం, ఆదివారం అయితే నగరం లోని దాదాపు అన్ని రెస్టారెంట్లు కస్టమర్లలతో కిటకిటలాడి పోతుంటాయి. దీంతో వారిని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రెస్టారెంట్లలో భారీగా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు.
ఒక్కొక్కసారి ఆయా పదార్ధాలు మిగిలి పోతున్నాయి. వాటిని నిల్వ ఉంచి.. మరునాడు కస్టమర్లకు హోటల్, రెస్టారెంట్ల సిబ్బంది వినియోగిస్తున్నారు. వాటిని తిన్న వినియోగదారులు.. తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో నగరం లోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అందులోభాగంగా బుధవారం నాగోల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. స్థానిక సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరసా రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని వారు గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గమనించారు.
కాలం చెల్లిన బ్రెడ్, మిల్క్ ప్యాకెట్లు, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాస్ లను సైతం ఆహార పదార్ధాల తయారీలో వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, వంట గది అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా.. బొద్దింకలు సైతం తిరుగుతున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది.
దసరా రెస్టారెంట్లో అయితే కుళ్ళిపోయిన మటన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే హోటల్, రెస్టారెంట్ యజమానులకు నోటీసులు సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేశారు..