Suryaa.co.in

Andhra Pradesh

నేను గౌతమ బుద్ధుడిని కాదు

– అది కచ్చితంగా స్పీకర్‌ పదవిని అవమానించడమే
– ఇది నాపై వ్యక్తిగతంగా జరిగిన దాడి కాదు
– ఈ సెషన్‌లో టీడీపీ సభ్యుల ప్రవర్తన ఆక్షేపణీయం, హేయం, గర్హనీయం
– ఇవాళ మరీ మితి మీరారు… ప్లకార్డు నా ముఖంపై పెట్టారు.. ఛైర్ మీదకు వచ్చారు
– టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు తొలి రోజు నుంచీ దూషణలు..
– అయినా భరిస్తూ వచ్చాను… కానీ ఛైర్‌ను అవమానించారు
– అందుకే రూలింగ్‌ను రివోక్‌ చేస్తున్నాను.. గీత దాటితే వేటే..
– టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ ఆగ్రహం, ఆవేదన:

స్పీకర్‌ మాట్లాడుతూ..ఇంకా ఏమన్నారంటే…
నాకు సభ్యులంతా సమానమే, విపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పాను. అయితే తొలి రోజు నుంచి టీడీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారు.ముఖ్యంగా డోల బాలవీరాంజనేయస్వామి ప్రతి రోజూ తీవ్రస్థాయిలో దూషిస్తున్నారు.గవర్నర్‌గారు అసెంబ్లీలో ప్రసంగం కోసం వచ్చినప్పుడు, రాజ్‌భవన్‌ నోట్‌ ప్రకారమే, ఆయనను కాసేపు నా ఛాంబర్‌లో కూర్చోబెట్టాం.అయితే దాన్నీ తప్పు పట్టారు. ఆ విషయాన్ని కూడా బీఏసీలో చెప్పాలన్నారు. అది సరికాదు. ప్రశ్నోత్తరాలు అనేది సభ్యుల హక్కు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ దిశలోనే ప్రతి రోజూ కృషి చేస్తున్నాను.మాట్లాడితే సీనియర్లం అంటారు. కానీ వారి ప్రవర్తన ఏ మాత్రం సరిగ్గా లేదు. వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి, దాన్ని ఆమోదించాలని, చర్చకు అనుమతించాలని, అనుమతించకపోతే.. మా ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తామని అనడం ఏ మాత్రం సరి కాదు.అదే విధంగా ప్రతి రోజూ స్పీకర్‌ పోడియం చుట్టు ముట్టడం, రెండు వైపులా రావడం, దూషించడం, పేపర్లు చించేయడం, నా మీద వేయడం అలవాటుగా మారింది.

ఇక వీరాంజనేయులు అయితే, ఏకంగా నా ఛైర్‌ను తోస్తున్నారు. ఇవాళ నా ముఖంపై ప్లకార్డు కూడా పెట్టారు. మరోవైపు అచ్చెన్నాయుడు, రామకృష్ణబాబు, పక్క నుంచి ఆ పని చేస్తున్నార అలా నా ముఖం మీద ప్లకార్డులు పెట్టడంతో నాకు సభ కూడా కనిపించడం లేదు. నేను అలా చేయొద్దంటే, చేయి చేసుకున్నట్లు అనుకోవాలా? నేను నిజంగా అలా చేసి ఉంటే, వారం రోజుల నుంచి సహిస్తూ ఉంటానా? ఇన్ని రోజులు భరిస్తానా? నిజానికి ఛైర్‌కు ఒక వైపు నుంచి కూడా ఎవరూ రారు. రాకూడదు. కేవలం ప్యానెల్‌ స్పీకర్‌ వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు మాత్రమే అలా వస్తారు. కానీ టీడీపీ సభ్యులు రోజూ ఆ పని చేస్తున్నారు. ఛైర్‌ను చుట్టుముడుతున్నారు.నేను ఏనాడూ టీడీపీ సభ్యులను అగౌరవపర్చలేదు. వారికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలనుకున్నాను. కానీ వారు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. నన్ను రోజూ అగౌరవపర్చారు. అయినా ఇన్ని రోజుల భరించాను.

కానీ ఇవాళ వారి ప్రవర్తన మితి మీరింది. ప్లకార్డు తెచ్చి ఏకంగా నా ముఖం మీద పెట్టారు.అప్పుడు ఎలీజా మాట్లాడుతూ, తమ హక్కులు కాపాడాలని కోరుతూ, నన్ను రక్షించే ప్రయత్నం చేశారు. ఆయనను తోసేశారు. అదే సమయంలో నేను ఆయన్ను (బాల వీరాంజనేయులు) కొట్టానని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి. ప్రజల సమస్యలపై మాట్లాడాలి. ఎంతో ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తున్నాం. అందుకే విపక్షం కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలి. టీడీపీ సభ్యులు రోజూ గొడవ చేస్తే, ఏరోజుకు ఆరోజు సస్పెండ్‌ చేస్తే, నన్ను ప్రశ్నించారు కొందరు.. మొత్తం సెషన్‌ అంతా సస్పెండ్‌ చేయొచ్చు కదా అని? కావాలంటే నేను అలా చేయొచ్చు. కానీ నేను ఆ పని చేయను. గత అసెంబ్లీలో రోజాపై ఏడాదిపాటు నిషేధం విధించారు. దాని వల్ల ఏం జరిగింది? ప్రజలు అన్ని గుర్తించారు కాబట్టే, గత ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు.

అందుకే నేను ఇప్పుడు కూడా నేను వారిని కోరుతున్నాను. మీరు మారండి. ఈ సభ ద్వారా మీ నాయకుడికి కూడా చెబుతున్నాను. మారండి. సభకు రండి, ప్రజా సమస్యలు చర్చిద్దాం. అయినా మీరు మారకపోతే, మీ బుద్ధి మార్చాలని దేవుణ్ని కోరుకుంటాము. సభలో మీరూ మాట్లాడొచ్చు. మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. కానీ పోడియం వద్దకు రావడం, టిక్‌.. టిక్‌ అని శబ్ధాలు చేయడం, నా కోసం పెట్టిన పేపర్లు చించి, నాపై వేయడం మంచి పద్ధతి కాదు. పోడియంను చుట్టుముట్టడమే కాకుండా, నాపై వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరికాదు.

అందుకే రూలింగ్‌ ఇస్తున్నాను. గతంలో కూడా ఇచ్చాం…15.02.2022. మధ్యాహ్నం 12 గం.కు ఒక రూలింగ్‌ ఇచ్చాం. ఎవరైనా సభ్యుడు వెల్‌లోకి రావడం, స్పీకర్‌పై వ్యాఖ్యలు వంటివి చేస్తే, ఆటోమేటిక్‌గా మూడు సెషన్లు లేదా హౌజ్‌ అనుకుంటే, మొత్తం సమయానికి సస్పెండ్‌ చేయాలి. ఆ హక్కు సభకు ఉంది. ఈ సభకు అలా ఎన్నో విశేషాధికారాలు ఉన్నాయి.దిసీజ్‌ ది బ్యూటీ ఆఫ్‌ ది ఇండియన్‌ కాన్సిటిట్యూషన్‌. ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలు అడ్డుకోవడం, స్పీకర్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం, విమర్శించడం, పోడియం వద్దకు చేరి, అనైతికంగా వ్యవహరించడం వంటివి చేస్తే.. వరసగా 5 సెషన్ల పాటు సస్పెండ్‌ చేయొచ్చు. ఇది గతంలో రూపొందించడం జరిగింది. ఇది లోక్‌సభలో కూడా చేశారు. నేను గౌతమ బుద్ధుడిని కాదు. మనిషికి ఎక్కడో ఒక దగ్గర మార్పు రావాలి.ఈరోజు టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు హేయం. సభ అంటే వారికి గౌరవం లేదు. స్పీకర్‌ పదవి అన్నా కనీస గౌరవం లేదు.
ఇక్కడ వ్యక్తి కాదు. స్పీకర్‌ పదవి అనేది ముఖ్యం. నా కంటే ముందు ఎందరో గొప్పవారు, ఈ స్థానంలో ఉండి, దానికి గౌరవ ప్రతిష్టలు ఇనుమడింప చేశారు.ఇక్కడ వ్యక్తిగా కాదు. స్థానానికి గౌరవం ఇవ్వాలి. సభ్యులు తమ నిరసన వ్యక్తం చేయొచ్చు. కానీ ఇవాళ టీడీపీ సభ్యుల ప్రవర్తన గర్హనీయం. ఆక్షేపణీయం. హేయం.

అందుకే ఈ కింది విధంగా రూలింగ్‌
సభ్యులు ఎవరైనా సభాపతి పోడియం వద్దకు వచ్చి, అగౌరవ పర్చే విధంగా వ్యవహరిస్తే, ఆటోమేటిక్‌గా సస్పెండ్‌ అయినట్లు. ఆ రూలింగ్‌ను నేను రివోక్‌ చేస్తున్నాను. దీన్ని ఆమోదించాలని నేను సభను కోరుతున్నాను’. ఈ గౌరవం నా వ్యక్తిగతం కాదు. పదవిది. నేను బీసీనే అయినా, బలవంతుడు అనే కదా నాకు ఈ పదవి ఇచ్చారు. అంతేకానీ, బలహీనుణ్ని అని కాదు కదా? అందుకే నాకు ఇచ్చిన ఈ గుర్తింపును నిలబెట్టుకుంటాను. మళ్లీ ప్రజాక్షేత్రంలో నిలబడతాను.

LEAVE A RESPONSE