గాడ్సే నేను కాదు…ఢిల్లీలో ఉన్న అమిత్ షా, మోడీలు

– వీళ్ల పంపకాల పంచాయతీ వల్లే ఉపఎన్నిక
– అమిత్ షా, మోడీలు కేసీఆర్ గాడ్ ఫాదర్లు
– టీఆర్‌ఎస్, బీజేపీపై రేవంత్ ఫైర్
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రజలు కోరుకుంటే వచ్చింది కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికను అడ్డుపెట్టుకొని రెండు ఆంబోతులు తమ బలప్రదర్శనను చూపెట్టుకుంటున్నాయని ఆయన అన్నారు. వీణవంక మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరపున రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.
‘తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? తెలంగాణ వచ్చాక ఏడేండ్లలో పేదలకు ఏం వచ్చింది? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామముంటే.. ఈ ఎన్నికల్లో మా అభ్యర్థి తరపున ఓట్లు అడగమని చెప్తున్నా. హరీశ్ రావు ఇండ్లు లేనివాళ్లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు. మీరు ఇండ్లు ఇవ్వని దగ్గర మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలోనే పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, భూములు ఇచ్చింది. రైతులకు ఉచిత కరెంట్, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇంటికో ఉద్యోగమన్నారు కదా ఇచ్చారా మరి. డబుల్ బెడ్ రూం ఇచ్చారా, రుణమాఫీ చేశారా, దళితులకు మూడు ఎకరాలు ఇచ్చారా. మరి టీఆర్ఎస్ వాళ్లు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు మొన్నటివరకు ఒకే మంచం.. ఒకే కంచం. బడేమియా, చోటేమియాలాగా ఇద్దరూ 20 ఏండ్లు కలిసే తిరిగారు కదా. ఈటల రాజేందర్ దేనికోసం కొట్లాడిండు. పెన్షన్ల కోసమా, దళితుల కోసమా, ఫీజు రియంబర్స్ మెంట్ కోసమా? దేనికోసం కొట్లాడిండు. దేవుడి భూములు, అసైన్డ్ భూముల కోసం కేసీఆర్‎తో పంచాయతీ పెట్టుకుండు. వీళ్ల పంపకాల పంచాయతీ వల్లే ఉపఎన్నిక వచ్చింది.
పెట్రోల్ మీద పన్నుల రూపంలో కేసీఆర్ 35 రూపాయలు, మోడీ 30 రూపాయలు వసూల్ చేస్తున్నారు. వీరిద్దరి వల్లే రూ. 40కి అమ్మాల్సిన పెట్రోల్ రూ. 110కి అమ్ముతున్నారు. దోపిడిలో ఇద్దరూ ఒక్కటే. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షాలకు వంగివంగి దండాలు పెట్టి రాలేదా? ఇవన్నీ మీరు గమనించాలి. కాంగ్రెస్ అభ్యర్థిని కొంత ఆలస్యంగానే ప్రకటించాం. మేనరికంలో పిల్లగాడు ఉండని.. పిల్ల పెళ్లి ఆలస్యం చేస్తే.. పిలగాడు లేచిపోయిండు. అప్పడు పెళ్లి సంబంధాలు చూడాల్సి వచ్చింది. మన అభ్యర్థి విషయంలో కూడా ఇలాగే జరిగింది. అయినా మంచొన్ని నిలబెట్టినం. టీఆర్ఎస్ వాళ్లు గెల్లు అనే చిల్లును పెట్టారు. అది ఎక్కడా చెల్లదు. విద్యార్థులు తెగించి కొట్లాడి తెలంగాణ తెస్తే.. గొర్లు, బర్లు ఇస్తానంటున్నడు.
కేసీఆర్ పిల్లలు రాజ్యమేలితే.. మన పిల్లలు గొర్లు బర్లు కాయాలా? ఓట్ల కోసం డబ్బులు, సీసాలు పంచడానికి వస్తారు. అలా వచ్చినోళ్ల బట్టలు బాగున్నా ఊడపీక్కోండి. ఎందుకంటే వాళ్లదంతా అక్రమ సంపాదనే. వాళ్లు ఏది ఇచ్చినా తీసుకొని.. ఓటు మాత్రం కాంగ్రెస్‎కే వేయండి. నేను, ఈటలను మే 7న ఓ పెండ్లిలో కలిశాను. ఈటల బీజేపీలో చేరేలా చేసింది మీ అయ్యా కొడుకులే కదా. ఈటల రాజేందర్ దేవుని మాన్యాలు ఆక్రమించుకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు. కేటీఆర్ నన్ను గాడ్సే అంటున్నారు. గాడ్సే నేను కాదు. ఢిల్లీలో ఉన్న అమిత్ షా, మోడీలు గాడ్పేలు. వాళ్లిద్దరినీ కేసీఆర్ గాడ్ ఫాదర్‎లా పెట్టుకున్నాడు. మీ పెన్షన్, రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లకోసం మా బల్మూరి వెంకట్ కొట్లాడుతాడు. మా అభ్యర్థి కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేశాడు. మీ ఆశలు, ఆశయాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.