-ఈనెల 29న మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం
-చంద్రబాబును కాళ్ళ, వెళ్ళా పడి బ్రతిమాలుదాం
-టిడిపి ఎంపీలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా
-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
గతంలో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మరొకసారి ఎంపీల మూకుమ్మడి రాజీనామాలకు ప్రతిపాదన చేయాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. తన పార్లమెంట్ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమాలుదామన్న ఆయన, ముగ్గురు టీడీపీ ఎంపీలను రాజీనామాకు ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు . రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలకు గాను 25 మంది ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా కేంద్రం పై వత్తిడికి తీసుకు వద్దామని సూచించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ … ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ హామీని విస్మరిస్తే ప్రజలు అసహ్యించుకుంటారని చెప్పి తమ పార్టీ ఎంపీల చేత జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించాలని సూచించారు. తనని పార్టీ సభ్యుడిగా పరిగణలోకి తీసుకోకపోయినప్పటికీ, తాను మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమేనని తెలిపారు . 1937లో జరిగిన శ్రీ బాగ్ ఒప్పందం గురించి మాట్లాడుతున్న మనం… నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి… ఇప్పుడు విస్మరిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు .
జగన్ మాటలకు అర్ధాలే లేవులే
జగన్మోహన్ రెడ్డి పాలన అంతా తిరోగమన దిశలో సాగుతుందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. అవునంటే కాదనిలే… కాదంటే అవునని లే … జగన్ మాటలకు అర్ధాలే లేవులే అని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికే 50 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. మిగిలిన వారిని కూడా తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఎందుకంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. ఐదవ తేదీ వచ్చినప్పటికీ, 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు , 75 శాతం మంది ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించిన తర్వాత ఆ పనులు ఎవరి చేత చేయిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. పదవ తరగతి వరకు చదివిన వాలంటీర్లతో ఆ పనులన్నీ చేయిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇంజనీరింగ్, మున్సిపల్ డ్రాయింగ్ లతో పాటు, రేపు ఉపాధ్యాయులు సమ్మెకు దిగితే, విద్యార్థులకు పాఠాలను కూడా వాలంటీర్లతోటే చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. అక్కరకు లేని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి, అవసరమైన ఉద్యోగులను తొలగించడం ఏమిటని నిలదీశారు. తాత్కాలిక ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించి ఉంటే బాగుండేదని రఘురామకృష్ణం రాజు సూచించారు.
ఇవివి… జంధ్యాల సినిమాలా కర్నూలు గర్జన సభ!
తెలుగు హాస్య దర్శకులు ఈ వివి సత్యనారాయణ, జంధ్యాలలు రూపొందించిన హాస్య చిత్రం మాదిరిగా కర్నూలు గర్జన సభ కొనసాగిందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. బ్రిటిష్ వారి పాలనలో మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఓ పదిమంది పెద్ద మనుషులు కూర్చుని చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1953లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గుంటూరులో హైకోర్టు, కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పుడు ఎవ్వరూ కూడా శ్రీ బాగ్ ఒప్పందం గురించి మాట్లాడలేదన్నారు. 2014లోనూ మాట్లాడలేదని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసిన దానికంటే, పార్లమెంట్ చట్టం చేసిన దానికంటే ఎక్కువగా శ్రీ బాగ్ ఒప్పందం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కర్నూలు గర్జన సభకు వాలంటీర్లు వెళ్లి మహిళలను బెదిరించినప్పటికీ, మహిళలు హాజరు కాలేదని తెలిపారు. స్కూల్లు మూసివేసి పరీక్షలను రద్దు చేసి, డ్వాక్రా మహిళలను బెదిరించి సభకు తరలించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
సీమవాసులను చూస్తే జాలి వేస్తోంది
రాయలసీమ వాసులను చూస్తే జాలి వేస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాజధాని అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. కేరళ హైకోర్టు కొచ్చిన్ లో ఉందన్న ఆయన, ఉత్తర ప్రదేశ్ లో హైకోర్టు అలహాబాదులో ఉందని గుర్తు చేశారు. అంతమాత్రాన వాటిని న్యాయ రాజధానులు అని పిలుస్తారా అంటూ ప్రశ్నించారు. కొంతమంది బుద్ధిహీనులు పిచ్చి ప్రేలాపనలతో ప్రజలని మభ్య పెట్టాలని ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు ఏర్పాటుపై మాట మార్చిందని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని నివేదించారని పేర్కొన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయబోమని చెబుతూనే, మరొకవైపు రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కు డ్వాక్రా మహిళలకు సంబంధం ఏమిటన్న ఆయన, పదవ తరగతి విద్యార్థులకు కోర్టు తో అవసరం ఏమిటంటూ నిలదీశారు.
శ్రీ బాగ్ ఒప్పందంలో ఏముంది?
1937లో చేసుకున్న శ్రీ బాగ్ ఒప్పందంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ఉందని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే, రాయలసీమ బంగారు మయమవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 34 వేల కోట్ల రూపాయలతో రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటి వరకు కేవలం 1700 కోట్ల రూపాయల పనులను మాత్రమే చేయించారన్నారు. అందులో 1100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించకుండా ఎగ్గొట్టారని తెలిపారు. ఇప్పటివరకు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదని అన్నారు . రాయలసీమ రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ సరఫరా చేయకుండా, వారిని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు కియాను తీసుకురావడం అభివృద్ధి అని, అమర రాజా బ్యాటరీ కంపెనీ తరిమికొట్టడం కాదన్నారు. చివరకు డ్రాయర్ల ఉత్పత్తి కంపెనీని కూడా తరిమి వేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే రాయలసీమలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు శంకుస్థాపన చేస్తానని, రెండేళ్లలో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పటివరకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.
రైతు సభకు అనుమతి ఇవ్వరా?
పుంగనూరు నియోజకవర్గంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సభ ఏర్పాటు చేయాలని భావిస్తే, తమ ప్రభుత్వం అనుమతించలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. బీసీలు తమ పార్టీకి వెన్నుముక అని చెబుతూ, బీసీ గర్జన నిర్వహిస్తున్న తమ పార్టీ పెద్దలు.. పుంగనూరు నియోజకవర్గంలో పాడి రైతుల గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తున్న రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేసి, తమ పార్టీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారన్నారు. రైతు సభ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో, అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి దండం పెట్టి… తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేయడమే ఆయన చేసిన పాపమన్నారు. ఒకవైపు జనసేన కార్యకర్తలను రౌడీ సేన అని సంబోధిస్తూ… తమ పార్టీ కార్యకర్తలు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో ఇద్దరు సలహాదారులను నియమించిందన్న ఆయన, ఆ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారేనని తెలిపారు. భవిష్యత్తులో బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారికి కూడా సలహాదారులుగా నియమించాలని సూచించారు. కర్నూలు గర్జన మాదిరిగానే బీసీ గర్జన కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కొవ్వూరులో చెట్లను కొట్టివేసి, రంగులు వేయడం పరిశీలిస్తే… తమ ప్రభుత్వ పెద్దలకు రంగుల పిచ్చి పరాకాష్టకు చేరుకుందని స్పష్టమవుతుందన్నారు. గ్రీన్ టాక్స్ పేరిట లారీపై విధించే పన్ను పొరుగు రాష్ట్రాలలో రెండు నుంచి 500 రూపాయలు ఉండగా, మన రాష్ట్రంలో 20వేల రూపాయలు ఉండడం లారీ యజమానులను కుంగదీస్తుందన్నారు. ఒక వైపు సింహం సింగిల్ గా వస్తుందని తమ పార్టీ నాయకులు పదేపదే పేర్కొంటుంటే, తమ నాయకుడు మాత్రం పరదాల చాటున సభలు సమావేశాలకు హాజరవుతుండడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి కి త్వరలోనే నోటీసులు అందే అవకాశాలు ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు.