Suryaa.co.in

Andhra Pradesh

కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్‌లో ‘రాయలసీమ గర్జన’

-జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు ప్రభుత్వ, ప్రై వేటు ఉద్యోగులు, ఎన్జీఓలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు మొదలు ఆటో డ్రైవర్ల వరకు భారీ సంఖ్యలో హాజరు
-ఇంకా 8 జిల్లాలకు చెందిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరు
– న్యాయ రాజధాని కోసం గర్జించిన సీమ
-జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ సభ
-న్యాయ రాజధాని మా హక్కు
-పరిపాలన వికేంద్రీకరణ జరగాలి
– నాడు రాజధాని కోల్పోయాం. నేడు హైకోర్టు ఇవ్వాల్సిందే
– న్యాయ రాజధానికై ఈ పోరాటం ఆరంభం మాత్రమే
– కర్నూలు జగన్నాథ గుట్టపై హైకోర్టు కట్టి తీరుతాం
– సీమ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యమకారులు
– న్యాయ రాజధాని కోసం నగర వీధుల్లో కవాతు
– శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాల్సిందే
-తేల్చి చెప్పిన రాయలసీమ గర్జన సభ
– కర్నూలు న్యాయ రాజధాని జగన్‌గారితోనే సాధ్యం
– 26 జిల్లాల సమగ్ర అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్ష
– అమరావతినే కోరుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు
– కేవలం 26 గ్రామాల అభివృద్ధి మాత్రమే ఆయన లక్ష్యం
-చంద్రబాబుది నిజంగా రాయలసీమ రక్తమేనా?
-అయితే ఆయన కర్నూలులో హైకోర్టును స్వాగతించాలి
-న్యాయ రాజధానికి పవన్‌కళ్యాణ్‌ జై కొట్టాలి
-రాష్ట్రానికి ఒకే రాజధాని అనేది సరైంది కాదు
-అలా ఎవరైనా అంటే తీవ్రంగా వ్యతిరేకించాలి
రాయలసీమ గర్జన సభ పిలుపు

కర్నూలు: రాయలసీమ గర్జించింది. న్యాయ రాజధాని తమ హక్కు అని మరోసారి నినదించింది. సీమ జల్లాల నుంచి సభకు తరలి వచ్చిన వారితో కర్నూలు జన సంద్రాన్ని తలపించింది. రాజధానిపై ఇటీవల కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యలతో సీమ వాసులు మరింత రగిలిపోయారు. తమ ఆకాంక్షను ఎలుగెత్తి చాటేందుకే రాయలసీమ గర్జన అంటూ తేల్చి చెప్పారు. ఇది ఆరంభం మాత్రమే అన్న సీమ వాసులు, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయ్యే వరకు పోరాటం ఆపబోమని ప్రకటించారు. అది సీఎం వైయస్‌ జగన్‌ ఒక్కరి వల్లే సాధ్యమని వారు తేల్చి చెప్పారు. రాయలసీమలోని ఎనిమిది జిల్లాల నుంచి కర్నూలుకు చేరుకున్న ఉద్యమకారులు పురవీధుల్లో కవాతు చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమను అభివృద్ధి చేయాలంటే న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాల్సిందేనని వారు స్పష్టం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో ఏర్పాటు చేసిన రాయలసీమ గర్జన సభ భారీగా సక్సెస్‌ అయ్యింది. నిత్యం కరువుతో అల్లాడే రాయలసీమ కొన్ని దశాబ్ధాలుగా మోసగించబడుతూనే ఉందని, ఇప్పటికైనా కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ భావిస్తే కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని సభలో వక్తలు ఆక్షేపించారు. ఏ పార్టీ అయినా ‘జై న్యాయ రాజధాని’ అనాల్సిందే అన్న వారు, లేకపోతే వారికి ప్రజలు చీపుర్లతో సమాధానం చెబుతారని తేల్చి చెప్పారు.

రాయలసీమ గర్జన సభలో వక్తలు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి:
– చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి కేవలం హైదారాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఆయన ఏనాడూ పాటు పడలేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శ్రీ వైయస్‌ జగన్, వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు న్యాయ రాజధాని ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన అమరావతిలో రాజధాని వద్దని చెప్పలేదు. అమరావతితో పాటు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో న్యాయ రాజధాని, విశాఖలో సచివాలయం ఏర్పాటుతో పరిపాలన రాజధాని ఉండాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విశాఖలో పరిపాలన రాజధాని కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాయలసీమ వాసులు కూడా కర్నూలులో న్యాయ రాజధాని కావాలని పోరాటం చేస్తున్నారు. సీమలో పుట్టి రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా పరిగణించాలి. ఈ రాయలసీమ గర్జనకు సీమ వాసులంతా ముక్తకంఠంతో మద్దతు తెలిపి సక్సెస్‌ చేశారు. ఈ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసి అమరావతిలో శాసన రాజధానిని కొనసాగించగలదు. చంద్రబాబుకు అమరావతి ప్రజల మీద కూడా ప్రేమ లేదు. కేవలం ఆయన, ఆయన బంధుగణం, మిత్రులకు మాత్రమే మేలు జరిగేలా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు.

బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్ధిక శాఖ మంత్రి:
కర్నూలులో హైకోర్టు పెట్టడానికి ఇష్టం ఉందా?. లేదా?. అనేది చంద్రబాబునాయుడు సూటిగా సమాధానం చెప్పాలి. డొక్కల కరువు, తేళ్ల కరువు, గాడిదల కరువు వంటి అనేక కరువులను మా రాయలసీమ చవి చూసింది. జంతు కళేబరాలను కూడా పూడ్చిపెట్టలేని దుస్థితి సీమలో నెలకొంది. రాయలేలిన కాలంలో అత్యంత సంపద కలిగిన ఈ ప్రాంతం నేడు చంద్రబాబు హయాంలో రాళ్లసీమగా మారింది. ఇన్ని దశాబ్ధాల తర్వాత ఒక మగాడు రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు మీరంతా అడ్డుపడుతున్నారో చెప్పాలి.
హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు చంద్రబాబు రూ.15 కోట్లు కేటాయిస్తే.. అప్పట్లో మహానేత వైయస్సార్‌గారు ఏటా 4 వేల కోట్ల చొప్పున కేటాయించి పనులు పూర్తి చేసింది నిజం కాదా?. చంద్రబాబు కేవలం తారు రోడ్డు వేసి వెళ్లిపోతే జగన్మోహన్‌రెడ్డి గారు వచ్చిన తర్వాత కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేశారు. రహదారుల కోసం చంద్రబాబు 2018లో కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేంద్రం నుంచే తెస్తే.. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏకంగా రూ.7500 కోట్లు తీసుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎంగారి ధ్యేయం. కానీ చంద్రబాబుకు 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని రియల్‌ ఎస్టేట్‌ బృందం మీద తప్ప రాష్ట్రంలో ఏ ప్రాంతంపైనా ప్రేమ లేదు. శ్రీబాగ్‌ ఒప్పందం నుంచి నిన్నటి 2014 విభజన చట్టం వరకూ నిర్ధేశించిన మేరకు అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి చెందాలనే సీఎంగారు పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు వచ్చే వరకూ ఈ ఉద్యమం ఆగదు. కచ్చితంగా హైకోర్టు సాధించి జగన్నాథ గుట్టపై కట్టి తీరతాం.

అంజాద్‌ బాషా, డిప్యూటీ సీఎం (మైనారిటీ సంక్షేమ మంత్రి):
– మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే వికేంద్రీకరణ అనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. దశాబ్ధాలుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. 1937లోనే ఆనాటి పెద్దలు ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం రాయలసీమకు రాజధాని కానీ, హైకోర్టు కానీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మూలన పడిన శ్రీబాగ్‌ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చి అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా సీఎంగారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ వాసులను అవహేళన చేస్తూ ఇదే ప్రాంతానికి వచ్చి ఒకే ఒక్క రాజధాని ఉండాలని మాట్లాడుతున్నారు. ఆయన కేవలం 26 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చేయాలంటుంటే.. సీఎంగారు రాష్ట్రంలోని 26 జిల్లాలూ అభివృద్ధి చెందాలని బాటలు వేస్తున్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలంటూ టీడీపీ, జనసేనతో పాటు ఇతర నాయకులు మీ గడప వద్దకు వస్తే చీపుర్లు, చెప్పులు పట్టుకుని తరిమి తరిమి కొట్టండి. ఈ ఉద్యమం కేవలం ఆరంభం మాత్రమే. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయ రాజధాని సాధించే వరకూ ఈ ఉద్యమం ఆగదు.

గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి:
– దాదాపు 80 సంవత్సరాల నుంచి రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఒక మగాడు మన జగనన్న రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తానని చెబితే.. నరనరాన విషమున్న వ్యక్తి చంద్రబాబు మాత్రం ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటున్నాడు. నిజంగా చంద్రబాబుది రాయలసీమ రక్తమే అయితే హైకోర్టును స్వాగతించాలి. చిత్రసీమలోని వ్యక్తులు నిత్యం రాయలసీమపై సినిమాలు తీస్తున్నారు. వారు కర్నూలుకు రాజధాని రావాలని కూడా కోరాలి. పవన్‌ కళ్యాణ్‌ కూడా చంద్రబాబును పక్కన పెట్టి కర్నూలులో న్యాయ రాజధానికి మద్దతు పలకాలి. కర్నూలు న్యాయ రాజధాని ఒక్క జగనన్నతోనే సాధ్యం. అది వచ్చే వరకూ రాయలసీమ వాసులు పోరాటం కొనసాగించాలి.

కెవి.ఉషశ్రీ చరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి:
– శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కొన్ని దశాబ్ధాలుగా ఉంది. ప్రతిపక్షాలు కేవలం తమ స్వప్రయోజనాల కోసం వికేంద్రీకరణను అడ్డుకుంటున్నాయి. సీమకు హైకోర్టు వస్తే తనకు తన కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఉండదని చంద్రబాబు భావిస్తున్నాడు. ఉత్తరాంధ్ర. అమరావతి, కర్నూలు అభివృద్ధే సమగ్ర అభివృద్ధి.. పరిపూర్ణ అభివృద్ధిగా పరిగణించాలి. కచ్చితంగా న్యాయ రాజధాని కర్నూలులో రావాలి. ఇక్కడ ఎయిర్‌పోర్టు, హైవే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతంగా నిలుస్తుంది. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేస్తూ సీఎం శ్రీ వైయస్‌ జగన్, కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు.

LEAVE A RESPONSE