– సీఎం ఆశయాల మేరకు శక్తి వంచన మేరకు పనిచేస్తా…
– అయిదేళ్ళు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసా…
– ఆంధ్రప్రదేశ్ భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు(బాబ్జీ)
తాడేపల్లి: సామాన్యుడుగా ఉన్న నన్ను ముఖ్యమంత్రి ఎన్నో పదవులు ఇచ్చి ప్రోత్సహించారని ఆంధ్రప్రదేశ్ భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు (బాబ్జి) అన్నారు. తాడేపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్ లో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మల్లికార్జునరావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా నన్నునియామకం చేయడం సంతోషంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
నా సాయశక్తులా ఆ పదవికి వన్నె తెస్తానన్నారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేసి వారికి న్యాయం చేస్తానన్నారు. అంతేకాకుండా నాయకుడు పిలుపును అందుకుని పనిచేయడమే లక్ష్యంగా అలవాటు చేసుకున్నానన్నారు. నాకు పదవి రావడంలో నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. వలవల మల్లికార్జునరావు ఉదయం 11 గంటలకు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అయిదేళ్ళలో ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వల వల మల్లికార్జునరావు అన్నారు. కూటమి పొత్తులో భాగంగా మల్లికార్జునరావుకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని, దాని పర్యవసానంగానే ఇప్పుడు చైర్మన్ పదవి వచ్చిందన్నారు. కూటమి సభ్యుల్లో ఏమైనా సమస్యలు ఉంటే అందరూ కూర్చుని మాట్లాడుకుని పరష్కరించుకోవాలన్నారు. నా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా వలవల మల్లికార్జునరావు ఇంకా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కార్మిక శాఖలో 3 బోర్డులు ఉంటాయన్నారు. కార్మిక సమస్యలు మీద ఆ బోర్డుకు ఉన్న ప్రాముఖ్యత పై ఆలోచించి వలవల మల్లికార్జునరావుకు చైర్మన్ పదవిని అందించారన్నారు. మాజీ మంత్రి, శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఒక మంచి నాయకుడుకి ఒక మంచి పదవి ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు అందించటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఆ పిలుపును అందుకుని మల్లికార్జునరావు పనిచేశారన్నారు. మాజీ మంత్రి, శాసన సభ్యుడు పితాని సత్యన్నారాయణ మాట్లాడుతూ కార్మికులకు సమస్యలు మీద పోరాటం చేయడంలో ఆయనకు ఆయనే చాటి అని అన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాసన సభ్యుడు మద్దిపాటి వెంకట్రాజు, బడేటి రాధ(చంటి), ఆప్కో చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.