– వర్ష బాధితులకు సాయం చేస్తా
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన ప్రకటన
హైదరాబాద్ : తాను ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోనని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, గన్ పార్క్ వద్దకు తన మద్దతుదారులతో చేరుకున్న రాజగోపాల్ రెడ్డి మీడియాకు ఈ విషయం వెల్లడించారు.
తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో పాటు, తన నియోజకవర్గమైన మునుగోడుకు నిధులు కేటాయించడం లేదని కోమటిరెడ్డి గత కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల రీజనల్ రింగ్ రోడ్డు రైతుల సమస్యపై కూడా ఆయన ప్రభుత్వానికి భిన్నమైన వైఖరి తీసుకుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అసెంబ్లీకి హాజరుకానంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ అసమ్మతిమార్కు రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది.
అమరవీరుల స్థూపం తమకు గుడితో సమానమని, అక్కడికి రావడానికి ప్రత్యేక కారణాలు అవసరం లేదని, ఈ రోజు తర్వాత తాను మళ్లీ శాసనసభకు రాబోనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో, కామారెడ్డి ప్రాంతంలో ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో వారికి అండగా నిలవడమే తన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. తన అనుచరులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు భరోసా కల్పిస్తానని వెల్లడించారు.