Suryaa.co.in

Telangana

నాకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్‌ను మరువను

– ఎన్టీఆర్ కోసం ఏమైనా చేస్తా
– చంద్రబాబు అరెస్టు మంచిదికాదు
– బాబు నాకు సోదర సమానుడు
– నా తల్లి తన పెద్ద కొడుకు చంద్రబాబే అని అప్పుడే చెప్పింది
– కక్ష సాధింపు రాజకీయాలు మంచిదికాదు
– కమ్మవారిది సేవా గుణం
– వారి సహకారం మర్చిపోను
– సనత్‌నగర్ అభివృద్ధిలో మీ సహకారం అవసరం
– కమ్మ సేవాసంఘం వనభోజనాలలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్

‘‘నాకు రాజకీయ జన్మనిచ్చి, ఈరోజు ఈ స్థాయికి వచ్చేందుకు కారకులైన దివంగత మహానేత ఎన్టీఆర్‌కు ఏమిచ్చినా రుణం తీర్చుకోను. ఆ మహానుభావుడి కోసం ఏదైనా చేస్తా. ఎంతైనా చేస్తా. కమ్మ వారిది సేవా గుణం. నాకు ఇప్పటివరకూ మీరిచ్చిన సహకారం మరువలేను. సనత్‌నగర్ మరింత అభివృద్ధికి మీ సహకారం అవసరం’’ అని సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. కమ్మవారు కష్టజీవులని, సేవాగుణం ఉన్న కమ్మవారి సహకారం తనకు లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అమీర్‌పేట డివిజన్ ఎస్సార్‌నగర్‌లో జరిగిన కమ్మవారి సేవా సమితి వనభోజనాలకు తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వనభోజనాల సందర్భంగా అంతా ఒకచోట కలసి చేరటం శుభపరిణామమని, దానివల్ల సమైక్యత-ఆత్మీయత పెరుగుతుందన్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు అదొక వేదిక అన్నారు. ఈ సందర్భంగా పలువురు కమ్మ సంఘం నేతలు, సత్యం థియేటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేయాలని సూచించారు.

అందుకు స్పందించిన తలసాని.. తనకు రాజకీయ జన్మనిచ్చిన దివంగత మహానేత ఎన్టీఆర్‌కు తాను ఏం చేసినా తక్కువేనన్నారు. తప్పకుండా విగ్రహం ఏర్పాటుచేయిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు, జైలుకు పంపించటాన్ని ప్రస్తావిస్తూ… రాజకీయాల్లో కక్ష సాధింపు మంచిదికాదన్నారు. తనకు సోదర సమానుడైన చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని, తాను తొలుతే ఖండించానని గుర్తు చేశారు. ఆ వయసులో ఉన్న నాయకుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం బాధ కలిగిందన్నారు. తన తల్లి కూడా తన పెద్ద కొడుకు చంద్రబాబునాయుడే అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని, రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సనత్‌నగర్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు కమ్మ వర్గం అందిస్తున్న సహకారం మరువలేనిదని, వారి సహకారం కొనసాగించాలని అభ్యర్థించారు. కాగా వచ్చే ఎన్నికల్లో తలసానికి మద్దతుగా నిలుస్తామని కమ్మ సంఘ నేతలు ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ కమ్మకులం సేవాగుణం, త్యాగానికి ప్రతిరూపమన్నారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడం వల్లే తెలుగువారి గుర్తింపు మొదలయిందని, చంద్రబాబు సీఎం అయిన తర్వాత తెలుగువారి ప్రతిభ ప్రపంచానికి తెలిసిందన్నారు. కమ్మవర్గం సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

బీజేపీ జాతీయ నేత డాక్టర్ వీరపనేని పద్మజ మాట్లాడుతూ, రాజకీయాల్లో కమ్మ వారు ఐక్యంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిమానం, ఆదరణ ఉన్న కమ్మ నేతలను నాయకత్వాలు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. కమ్మవారిలో ఐక్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ కార్పొరేటర్ శేషకుమారి, మధు సూధన్, రమేశ్, కిషోర్, టిల్లు, సాయి, బుచ్చి బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE