-హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల్సిందే
-రాత్రికి రాత్రే కొత్త జిల్లాల ప్రకటన
-ఆధ్యాత్మికత ఆధారంగా జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రకటన
-అలాచేస్తే ధర్నాలు చేయరని అనుకుంటున్నారు
-నాకంటే ఆధ్యాత్మిక చింతన ఎవరికైనా ఉందా?
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో భాగంగా సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేయనున్న ప్రాంగణానికి చేరుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే పోరాటంలో భాగంగా అవసరమైతే రాజీనామా చేస్తానని ప్రకటించారు.*
రాత్రికి రాత్రే కొత్త జిల్లాల ప్రకటన చేశారని ఆయన మండిపడ్డారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఆధ్యాత్మిక అంశాల ఆధారంగానే సత్యసాయి జిల్లా, దాని కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఆధ్యాత్మికత ఆధారంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ధర్నాలు చేయబోరని భావిస్తోందని ఆయన విమర్శించారు.
అయితే, తనకంటే అధికంగా ఆధ్యాత్మిక చింతన ఎవరికైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తాను అఖండ అని, అన్ స్టాపబుల్ గా పోరాడతానని అన్నారు. ఈ ప్రాంతం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తేనే ఆధ్యాత్మికంగానూ అన్ని విధాలుగా సరిపోతుందని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
అసలు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే ధర్నా చేస్తామని, ఎవడొచ్చి ఆపుతాడో చూస్తానని అన్నారు. ఉద్యోగుల ఆందోళన నుంచి దృష్టిని మళ్లించేందుకే కొత్త జిల్లాల ప్రకటన చేశారని బాలకృష్ణ ఆరోపించారు. నిన్న నిరసన ర్యాలీలో ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని ఆయన చెప్పారు.