– ఏపీకి కేటాయిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు
– ఫలించిన న్యాయవాది రవితేజ వాదన
అమరావతి: ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటి కేడర్ కేటాయింపు సమస్యకు తెరపడింది. ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించాలని హైకోర్టు జూలై 3, 2025న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను నాలుగు వారాల్లోగా అమలు చేయాలని, అనగా జూలై 31, 2025లోగా ఆదేశాలను పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే, ఈ గడువు ముగిసినప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ( డిఓపీటీ ) ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ( క్యాట్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాట్ విచారణ సందర్భంగా, డిఓపీటీ సెక్రటరీ స్వయంగా హాజరు కావాల్సి ఉండగా, ఆయన స్థానంలో డెప్యూటీ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం పట్ల కూడా క్యాట్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో, క్యాట్ రెండు వారాల్లోగా శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించాలని ఆదేశిస్తూ, ఒకవేళ ఈ ఆదేశాలు అమలు కాని పక్షంలో డిఓపీటీ సెక్రటరీ జీతాన్ని నిలిపివేస్తామని, కోర్టు ధిక్కరణ చట్టం కింద నోటీసు జారీ చేస్తామని హెచ్చరించింది. శివశంకర్ తరపున న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు.
ఈ ఆదేశాల నేపథ్యంలో, డిఓపీటీ తాజాగా శివశంకర్ లోతేటిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా, తెలంగాణ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 2, 2025న శివశంకర్‌ను, తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యతో శివశంకర్ లోతేటి ఇకపై ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో సేవలు అందించనున్నారు.
ఈ విషయంలో క్యాట్, హైకోర్టు ఆదేశాలను డిఓపీటీ సమయానికి అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, తాజా ఉత్తర్వులతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.