-తమ ప్రాథమిక హక్కును ప్రశ్నించే అధికారం సాక్షి దినపత్రికకు ఎక్కడిది?
-ప్రజల ప్రాథమిక హక్కును ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు
-అసెంబ్లీ వేదికగా అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వవచ్చు కానీ, తాము రామోజీరావు మంచివాడంటే తప్పు ఎలా అవుతుంది?
-రఘురామ మాటలు జన వాఖ్యం… తనని తమ గొంతుకగా భావిస్తోన్న ప్రజలు
-స్మార్ట్ ఫోన్ల ద్వారా వలంటీర్లు పత్రికలను డౌన్లోడ్ చేసుకొని చదవవచ్చు… పత్రిక కొనుగోలుకు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడం ఎందుకు?
-ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో సాక్షి పత్రికను కొనుగోలు చేస్తున్న వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు
-18 లక్షల సర్కులేషన్ ఉన్న ఈనాడు, 10 లక్షల సర్కులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతిని కాదని వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సాక్షి దినపత్రికను కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏమిటి?
-ఏపీ హైకోర్టు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్న సుప్రీంకోర్టు
-ప్రభుత్వ జీవో పై మధ్యంతర స్టే ఇచ్చి, ఢిల్లీ హైకోర్టుకు కేసును బదిలీ చేస్తామన్న సుప్రీం
-రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదుల విజ్ఞప్తితో కేసు సోమవారానికి వాయిదా
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నిర్దోషి అని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్ధించవచ్చు కానీ దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రామోజీరావు మంచివారని తాము మద్దతు ఇవ్వకూడదా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రామోజీరావు కు, మార్గదర్శి సంస్థ కు మద్దతుగా ఎవరైనా మాట్లాడితే, ఏ ఆధారాల ప్రకారం మద్దతుగా మాట్లాడుతున్నారో తెలియజేయాలని సిఐడి నోటీసులు జారీ చేస్తుందని సాక్షి దినపత్రిక ప్రచురించిన వార్త కథనంపై ఆయన ఫైర్ అయ్యారు. సాక్షి దినపత్రిక తమను బెదిరించాలని చూస్తుందా?, సిఐడి చీఫ్ సంజయ్ ఈ విషయాన్ని నిజంగానే సాక్షి దినపత్రికకు చెప్పారా??, ఒకవేళ సిబిఐ చీఫ్ మాట్లాడాలి అనుకుంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడాలి. అప్పుడు మీడియా ప్రతినిధులు కూడా ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. రాజ్యాంగం ఎప్పుడైనా చదివారా?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన వ్యక్తీకరణ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో ఒకటన్నది వారు ఆయనకు గుర్తు చేస్తారన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రామోజీరావు వంటి విలువలు కలిగిన వ్యక్తి ఎటువంటి తప్పు చేయరని భావించి, ఆయనకు మద్దతుగా మాట్లాడితే తప్పేముంది?. అయినా తన ప్రాథమిక హక్కును ప్రశ్నించే అధికారం సాక్షి దినపత్రికకు ఎక్కడిది?అంటూ నిలదీశారు. సాక్షి దినపత్రిక రాసినట్టుగానే నోటీసులు ఇస్తామని సిఐడి పోలీసులు చెప్పారా ?, లేకపోతే, తనకు తానే ఊహించుకొని సాక్షి దినపత్రిక ఈ వార్తా కథనాన్ని ప్రచురించిందా??. సిఐడి అధికారి ఈ విషయాన్ని చెప్పకముందే, సాక్షి దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురిస్తే, ముందు సాక్షి దినపత్రిక యాజమాన్యానికే సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
బెదిరిస్తే బెదిరి పోవాలా?
సాక్షి దినపత్రిక, సిఐడి పోలీసులు బెదిరిస్తే, బెదిరిపోవాలా? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సిఐడి పోలీసుల వేధింపులను తాళలేక మార్గదర్శి సంస్థ ఆడిటర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని చార్టెడ్ అకౌంటెంట్లతోపాటు, న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడైన ప్రొఫెసర్ శాస్త్రి అనే వ్యక్తి రామోజీరావును రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్న తీరును వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆర్థిక నేరాల కేసులలో జగన్మోహన్ రెడ్డి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అయినా తమ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని పేర్కొనడం జరుగుతోంది. సిఐడి ప్రాతిపదిక ప్రకారం జగన్ నిర్దోషిని పేర్కొన్న వారందరికీ సిబిఐ నోటీసులు ఇవ్వాలి. సిబిఐ నేడు వారికి నోటీసులు జారీ చేస్తే, రేపు సిఐడి అధికారులు తమకు నోటీసులను జారీ చేస్తారేమో?. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వైయస్ అవినాష్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకున్న వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకొని మద్దతు ప్రకటించారు. వైయస్ అవినాష్ రెడ్డికి మద్దతు ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేస్తే, రామోజీరావుకు మద్దతు ప్రకటించిన తమకు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేయవచ్చు. తమ ప్రాథమిక హక్కుల గురించి ప్రశ్నించే అధికారం సిఐడి కి లేదు. రామోజీరావు, మార్గదర్శి సంస్థ తప్పు చేసిందనే ఆధారాలు ఉంటే , సిఐడి పోలీసులు చార్జిషీటు దాఖలు చేసుకోవచ్చునని అన్నారు.
సాక్షి దినపత్రికకు, సిఐడికి ఉన్న సంబంధం ఏమిటి?
సాక్షి దినపత్రికకు, సిఐడి పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని?. సాక్షి దినపత్రిక రాష్ట్ర ప్రభుత్వ మౌత్ పీసా?, రాష్ట్ర ప్రభుత్వాన్ని సాక్షి దినపత్రికనే శాసిస్తోందా??, సాక్షి దినపత్రికలో ఏదైనా వార్త ప్రచురిస్తే, అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టేనా?? అంటూ రఘురామకృష్ణం రాజు శర పరంపరగా ప్రశ్నోస్త్రాలను సంధించారు. రామోజీరావును సిఐడి పోలీసులు విచారిస్తున్న ఫోటో, బయటికి ఎలా వచ్చిందన్న దానిపై ముందు సిఐడి పోలీసులు విచారణ చేపట్టాలి. సాక్షి దినపత్రిక యాజమాన్యాన్ని ప్రశ్నించాలి. రామోజీరావుకు మద్దతుగా మాట్లాడడాన్ని ప్రశ్నిస్తూ వివరాలు తెలియజేయాలని సిఐడి, సాక్షి దినపత్రిక ఉడత ఊపులకు బెదిరిపోయేవారు ఎవరూ లేరు. సిఐడి పోలీసులు తమ పరిధి ఏమిటో ముందు తెలుసుకుని, నడుచుకోవాలి. సిఐడి పోలీసులు, ప్రజల కోసం న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తమ ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. సాక్షి దినపత్రికలో చట్టానికి రామోజీరావు అతీతుడా?అనే శీర్షికతో అర పేజీ కథనం ప్రచురించింది . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన చిట్ పండు చట్టాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినవి కావని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. గత ప్రభుత్వాల హయాంలో చేసినవనే విషయము అందరికీ తెలిసిందే. అయినా చిట్ ఫండ్ చట్టాలను ఉల్లంఘించి ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు గత కొంతకాలంగా రాష్ట్రం లో మూతబడ్డాయి. అటువంటి కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నదో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.
రామోజీరావుకు వ్యతిరేకంగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సిఐడి చెప్పినట్లుగా సాక్షి దినపత్రిక పేర్కొంది. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ఆలస్యం ఎందుకు చేస్తున్నారు… తక్షణమే చార్జిషీట్ ను దాఖలు చేయవచ్చు కదా? అని ఆయన ఎద్దేవా చేశారు . మార్గదర్శి సంస్థ చిట్ ఎత్తుకున్న ఖాతాదారునికి మొత్తం సొమ్మును ఇవ్వకుండా తమ వద్దనే డిపాజిట్ చేసుకుంటుందని, ఆ డిపాజిట్ల మొత్తం వేల కోట్ల రూపాయలని సాక్షి దినపత్రికలో రాశారు. ఈ విషయాన్ని సిఐడి పోలీసులు సాక్షి దినపత్రికకు చెప్పారా?, లేకపోతే స్వయంగా సాక్షి దినపత్రిక పరిశోధన చేసి వార్త రాసిందా??. అటువంటి డిపాజిట్లు మొత్తము సొమ్ము కేవలం 50 నుంచి 60 కోట్ల రూపాయలు మాత్రమే. తనకు పూర్తి వివరాలన్నీ తెలుసు. సాక్షి దినపత్రిక తన వద్దకు వస్తే, వారి వద్దనున్న ఆధారాలతో పాటు , తన దగ్గరున్న వివరాల గురించి చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముపై పక్క రాష్ట్రం పెత్తనమా? అని సాక్షి దినపత్రిక ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసము, సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయం కూడా పక్క రాష్ట్రంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్ముతో దొంగతనంగా నాలుగు లక్షల కాపీల సర్కులేషన్ పెంచుకున్న సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయాన్ని ఏమైనా రాష్ట్రానికి మార్చారా? అంటూ ప్రశ్నించారు. రఘు రామకృష్ణంరాజు మాటలు జన వాఖ్యం. ప్రజలు తన దృష్టికి తీసుకు వస్తున్న విషయాలనే తాను మాట్లాడు న్నాను. ప్రజలు తనను వారి మౌత్ పీస్ గా వాడుకుంటున్నారు. ప్రజా గొంతుకగా తాను ప్రజా సమస్యలనే వినిపిస్తున్నానని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
వలంటీర్ల నియామక తీరును ప్రశ్నించిన సుప్రీంకోర్టు
వలంటీర్ల నియామక తీరు గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . వలంటీర్ల నియామక తీరుతెన్నులను గురించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాదిని వైద్యనాథన్ ను అడిగి తెలుసుకున్నారు. వలంటీర్లంతా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని ఉషోదయ పబ్లికేషన్స్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం పనిచేస్తారని, ఇటీవల చేపట్టిన ఇంటింటికి స్టిక్కర్లు అతికించే కార్యక్రమంలోనూ వారు పాల్గొన్నారని చెప్పారు. వలంటీర్ల నియామకం ఎలా ఎందుకు జరిగిందని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించడమే కాకుండా, వలంటీర్ల నియామకంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించారా? అని అడిగారు. ప్రభుత్వం తరఫున జీతాలను చెల్లిస్తూ, వలంటీర్లను పార్టీ పనుల కోసం అధికార పార్టీ వినియోగించుకుంటుంది.
పార్టీ పనులు చేస్తే తప్పేముందని కొంతమంది అధికారులు కూడా వ్యాఖ్యానించడం విస్మయాన్ని కలిగించే విషయం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చివరకు మంత్రులు కూడా వలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలేనని పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించకుండా, సాక్షి దినపత్రిక ద్వారా వలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలేనని చెప్పించారు. ప్రభుత్వం అనధికారికంగా సాక్షి దినపత్రిక కొనుగోలు కోసం ప్రత్యేక జీవో విడుదలచేసి గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు 200 రూపాయలు కేటాయించడాన్నీ సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సాక్షి దినపత్రికను కొనుగోలు చేయాలని మాటల్లో చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో దినపత్రికను కొనుగోలు చేయాలని ఉంది.సాక్షి దినపత్రిక నే కొనుగోలు చేయాలని గతంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక జీవోను జారీ చేశారు..
రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను సవరిస్తూ, పత్రికను కొనుగోలు చేసి చదవాలని పేర్కొంది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలను చదవవద్దని ముఖ్యమంత్రి పదే, పదే పబ్లిక్ మీటింగుల్లోనే పేర్కొన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ జీవోను సవాలు చేస్తూ ఈనాడు దినపత్రికను ముద్రించే ఉషోదయ పబ్లికేషన్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి వద్దకు కేసు వెళ్ళగా, 2020 లో అడ్వర్టైజ్మెంట్ల కోసం దాఖలు చేసిన పిటిషన్ ఒకటి ప్రధాన న్యాయమూర్తి వద్ద పెండింగ్ లో ఉంది. ఈ కేసును కూడా ఆయన బెంచికే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోరడం, కేసు బదిలీ చేయడం జరిగిపోయింది. రెండున్నర ఏళ్లుగా ఒక కేసు పట్టుకొని కూర్చుని అవస్థలు పడే వ్యవస్థ మనకు ఎందుకని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సాక్షి దినపత్రిక పేరును జోడించ లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. హైకోర్టులో బెంచ్ హంటింగ్ ఎలా జరిగిందో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరిస్తూ, అడ్వర్టైజ్మెంట్ ల కేసు కు నాలుగు లక్షల పేపర్లు అమ్ముకునే కేసుకు ఎటువంటి సంబంధం లేదని వాదనలను వినిపించారు.
ఇది చాలా తేడా వ్యవహారంగా ఉందని, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వ్యవహరించిన తీరు సరిగా లేదని, ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు మార్చి, మధ్యంతర స్టే ఇస్తామని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వెల్లడించినట్లుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఢిల్లీ హైకోర్టును కూడా స్టే యధావిధిగా కొనసాగించాలని సూచిస్తామని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ఆర్డర్ డిక్టేట్ చేసే సమయంలో, ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తీసుకొని మళ్లీ వస్తామని, అప్పటివరకు కేసును వాయిదా వేయాలని కోరారు. దీనితో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసును సోమవారానికి వాయిదా వేసిందని ఆయన వెల్లడించారు. ఏప్రిల్ మాసం పత్రికా కొనుగోలు సొమ్ము ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు విడుదల చేసింది. మే నెల నుంచి సాక్షి దినపత్రిక సర్కులేషన్ నాలుగు లక్షలు తగ్గిపోయే అవకాశం ఉంది. మద్యంతర స్టే ఇవ్వడం, నిరాకరించడం అన్నది న్యాయమూర్తి విచక్షణ ఆధారపడి ఉంటే, పై కోర్టుకు వెళ్లే అధికారం పిటిషన్ దారుడు కి ఉంటుంది. ఎన్ని రోజులపాటు తీర్పును రిజర్వ్ చేసి ఉంచవచ్చ ననేది న్యాయమూర్తి విజ్ఞత యితే, తమకు న్యాయం లభించడంలో జాప్యం జరుగుతోందని చెప్పుకునే వెసులుబాటు పిటిషన్ దారుడికి ఉంటుంది. ఉషోదయ పబ్లికేషన్స్ ఆ వెసులుబాటును ఉపయోగించుకొని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో తమ వారి ఆటలు సాగవు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకుంటే మంచిది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1 పై కూడా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోని కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొనడం అరుదైన సంఘటన. ఢిల్లీ హైకోర్టుకు కేసును బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మేలుకొలుపుగా భావించకాపోతే, ఈ కేసు స్ఫూర్తితో ఎన్నో కేసులలో పిటిషన్ దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.