– యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన ప్రధాన అంశం కావాలి
– అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు.. అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధికి చోదకంగా మారాలి
– 7వ ఎస్ఐపీబీ సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
– పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి వివరాలు ఆన్‌లైన్ పోర్టల్‌లో పెట్టాలి
– రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి : రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు, ప్రాజెక్టులకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమలు ఏర్పాటు అయితే ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయని.. స్థానికులకు ఉపాధి లభిస్తుందని తద్వారా అన్ని చోట్లకూ సంపద విస్తరిస్తుందని అన్నారు.
సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 7వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఎస్ఐపీబీ ఆమోదించింది.
ఈ పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన 7 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.5,34,684 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 4.73,969 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధి
రాష్ట్రంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ప్రాజెక్టులో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కాలని, అందుకు యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కల్పన కూడా ప్రధాన అంశం కావాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఏర్పాటు అయ్యేలా ప్రణాళిక చేస్తున్నట్టు వెల్లడించారు. భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత గడువులోగా యూనిట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. వీటిని వినియోగించుకుని ఒన్ ఫ్యామిలీ- ఒన్ ఎంటర్ ప్రెన్యూర్ కింద ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు, ప్రాజెక్టులు, పెట్టుబడులు, కల్పించే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో పొందుపర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే క్లస్టర్ల వారీగానూ ఈ పరిశ్రమల మ్యాపింగ్ జరగాలని సీఎం సూచించారు.
ప్రతి నెలలో రెండు ఎస్ఐపీబీ సమావేశాలు
పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధికి చోదకంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని వీటిని వినియోగించుకుని ఔత్సాహికులు పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు పాపికొండలు వద్ద బోట్ టూరిజం లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే విశాఖతో పాటు రాష్ట్రంలోని ఇతర తీరప్రాంతాల్లో లగ్జరీ బోట్, క్రూజ్ షిప్ లను ఆపరేట్ చేసేలా ఆయా సంస్థలతో చర్చించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో ఒప్పందం చేసుకున్న వివిధ సంస్థలు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలని సూచించారు. వివిధ పారిశ్రామిక ప్రాజెక్టుల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతి నెలలో రెండు ఎస్ఐపీబీ సమావేశాలు జరగాలని, ఏడాదికి కనీసం 25 సమావేశాలు జరిగేలా కార్యాచరణ ఉండాలని సీఎం సూచించారు.
ఆమోదించిన పెట్టుబడుల వివరాలు
* రేమ్ండ్ రూ.1,201 కోట్లు, 6,571 మందికి ఉద్యోగాలు(వివిధ ప్రాంతాల్లో)
* జి.ఇన్ఫ్రా ప్రెసీజియన్స్ లిమిటెడ్ రూ.1150 కోట్లు, 299 మంది ఉద్యోగాలు(అనంతపురం)
* సంగం డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.130 కోట్లు, 400 మంది ఉద్యోగ, ఉపాధి(తిరుపతి)
* కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1583 కోట్లు, 8000 ఉద్యోగాలు – 3 దశల్లో(విశాఖపట్నం)
* 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.224 కోట్లు, 750 మందికి ఉద్యోగాలు (తూర్పు గోదావరి)
* ఏబీఐఎస్ ప్రొటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.350 కోట్లు, 790 మందికి ఉద్యోగాలు (చిత్తూరు)
* రిలయన్స్ కన్య్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1622 కోట్లు, 1200 మందికి ఉద్యోగాలు (ఓర్వకల్లు)
* మెల్గాన్ లైజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రూ.225 కోట్లు, 350 మందికి ఉద్యోగాలు (ఏలూరు)
* పావని హోటల్స్ లెమన్ ట్రీ ప్రీమియర్ రూ.80 కోట్లు, 300 మందికి ఉద్యోగాలు ( తిరుపతి)
* గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ రూ.145 కోట్లు, 250 మందికి ఉద్యోగాలు (అమరావతి)
* బెర్రీ అల్లోస్ లిమిటెడ్ రూ.573 కోట్లు, 320 మందికి ఉద్యోగాలు.(శ్రీ సత్యసాయి జిల్లా)
* చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,323 కోట్లు, 540 మందికి ఉద్యోగాలు. (కడప)
* అదానీ రెన్యువబుల్ ఎనర్జీ ఫిఫ్టీ వన్ లిమిటెడ్ రూ.8,010 కోట్లు, 3,500 మందికి ఉద్యోగాలు(కడప)
* చానల్ ప్లే రూ.80 కోట్లు, 1100 మందికి ఉద్యోగాలు(కొప్పర్తి)
* అదానీ హైడ్రో ఎనర్జీ ఫోర్ లిమిటెడ్ అండ్ అదానీ హైడ్రో ఎనర్జీ వన్ లిమిటెడ్ రూ.10,900 కోట్లు, 7,000 మందికి ఉద్యోగాలు(రాష్ట్రంలోని వివిధ జిల్లాలు)
* బీపీసీఎల్ అండ్ కేఎస్ఎస్ఎల్, ఎల్టీ ఎలక్ట్రానిక్స్, కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్‌లో అదనపు పెట్టుబడులు, మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.