42 శాతం రిజర్వేషన్లను బీసీలకే అందించాలి!
– బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్
హైదరాబాద్: మహేశ్ గౌడ్… మీరు నిజంగా బీసీ బిడ్డేనా? బీసీల పేరుతో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టి బీసీల పొట్టకొడుతుంటే నోరెందుకు మెదపడం లేదు? 42 శాతం రిజర్వేషన్లలో అదనంగా బీసీలకు ఇచ్చేది 5 శాతమైతే, ముస్లింలకు 10 శాతం ఇస్తోంది నిజం కాదా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ నిలదీశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే… బీసీ రిజర్వేషన్ల పేరుతో తెలంగాణలోని నూటికి నూరు శాతం మంది ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తారా? తెలంగాణలో 52 శాతం బీసీలుంటే 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తానని అనడం న్యాయమా?
మీలో బీసీ రక్తమే ప్రవహిస్తే 42 శాతం రిజర్వేషన్లను బీసీలకే అందించాలి. బండి సంజయ్ దేశ్ ముఖ్ అనడం మహేశ్ గౌడ్ మూర్ఖత్వం. బీజేపీ సిద్ధాంతమే ఊపిరిగా బతుకుతూ పేదల కోసం పోరాడుతున్న బీసీ బిడ్డ బండి సంజయ్. తెలంగాణలో దొంగ ఓట్లుంటే ఆ జాబితాను ఎందుకు బయట పెట్టడం లేదు? 20 నెలలుగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కదా…. దొంగ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు? దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీ సీట్లను గెలిచిందా? కాంగ్రెస్ కు నిజంగా దమ్ముంటే తెలంగాణలోని దొంగ ఓట్లను తొలగించాలి?