– ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం వార్నింగ్..
హైదరాబాద్ : కర్నూల్ జిల్లా, చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే.. హత్య నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు.
రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ట్రావెల్స్ యజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. దాని వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని మండిపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు ఒడిషాలో రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ఉద్ఘాటించారు. కర్నూలు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. బస్సుల ఓవర్స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తున్నట్లు పొన్నం ప్రకటించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థను నియంత్రించే ప్రయత్నం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.