(విశ్వకవి విరచిత GO NOT TO TEMPLE కవితకు స్వేచ్చానువాదం..)
కేవలం..
లోకేశుని పాదాల చెంత నాలుగు పూలుంచి మొక్కడానికైతే
గుడికి వెళ్లకోయి..
అంతకంటే..
నీ ముంగిట
అనురాగ పరిమళాలను..
కరుణధారలను వెదజల్లే
ప్రయత్నం చెయ్యి..!
కేవలం..
దేవుడి బొమ్మ ముందు దీపాలు వెలిగించేందుకైతే
గుడికి వెళ్లకోయి..
అంతకంటే..
ముందుగా నీ మనసులోని
పాపం..గర్వం..
అహంకారమనే
చీకట్లను పారద్రోలే
ప్రయత్నం చెయ్యి..!
కేవలం..
పరమాత్మ ముందు
శిరసు వంచి ప్రార్థన చేయడానికైతే
గుడికి వెళ్లకోయి..
అంతకంటే..
నీ సాటి మనిషి
ముందు మోకరిల్లి
చేసిన తప్పులకు
క్షమాపణ వేడుకునే
ప్రయత్నం చెయ్యి..!
కేవలం..
ఆ పరాత్పరుని ముందు మోకరిల్లి ధ్యానం చేయడానికైతే
గుడికి వెళ్ళకోయి..
అంతకంటే..
అణగారిన మనుషులకు
చేయూతనివ్వు..
యువతరాన్ని
అణగదొక్కే బదులు
వారిని శక్తిమంతులుగా మలచే ప్రయత్నం చెయ్యి..!
కేవలం..
నీ పాపాలకు
క్షమాపణ కోసమైతే
గుడికి వెళ్ళకోయి..
అంతకంటే..
నీ పట్ల తప్పు చేసిన
వారిని క్షమించే
ప్రయత్నం చెయ్యి..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286