– మీకెందుకు రాజకీయాలు?
– అధికారంలోకి వస్తూనే హామీలను అటకెక్కించిన కూటమి పార్టీలు
– ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని చంద్రబాబు ప్రభుత్వం
కూటమి పార్టీలకు వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు హెచ్చరిక
తాడేపల్లి: 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీతో ఇతర రాష్ట్రా లు పోల్చి చూశాయని జూపూడి తెలిపారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. హామీల అమల్లో విఫలమైందని మండిపడ్డారు.
ప్రజలు టీడీపీని, కూటమి పార్టీలని నిలదీస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఊపిరి ఆడటం లేదు. ఈ సందర్భంలో తాను పరిపాలన చేయలేనని.. అవసరమైతే ధర్నాలు చేస్తానంటూ కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ చేతులెత్తేశాడు. ఆయన ప్రభుత్వంలో ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు.
ఈ నేపథ్యంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి పార్టీలు పారిపోతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళిక ప్రకారం ‘డైవర్షన్ పాలిటిక్స్’ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ ని తెరపైకి తీసుకొచ్చారు. పరిపాలన నాకు చేతగాదు అని చెప్పే భాగస్వామితో కలిసి అధికారంలో ఉన్న కూటమి కాబట్టి… 35 మార్కులు బ్యాచ్ అయింది. పరిపాలన చేతకాకపోతే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? మీకెందుకు రాజకీయాలు? ఒకవైపు పరిపాలన చేతగాదు అని చెబుతూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అన్న సంకేతం పంపుతున్నారు.
2017 లో కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 183 మంది కల్తీ లిక్కర్ తో చనిపోగా, 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం నాటికి మరణాల సంఖ్య గతం కన్నా 27 తగ్గగా, 2020 నాటికి మరో 18 తగ్గింది. ముప్పై వేల మంది చనిపోయారని చెబుతున్నవారు వారి దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలి. తలో లెక్కతో కూటమి అనుకూల ఛానెల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఇవాళ రెడ్ బుక్ అనే ఇడియటిక్ బుక్ తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నారు. గుర్తుంచుకొండి. ఇవాళ ఏం మీరు నాటుతున్నారో అదే కాస్తుంది. వ్యవస్థలను నాశనం చేయాలనుకునే మీ ఫాసిస్టు దోరణిని ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.
పీ-4 ఓ మూర్ఖ పథకం
మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కొత్త కొత్త పేర్లతో పథకాలు పెడతారు. పీ-4 పేరుతో ప్రతి గ్రామంలో సర్వే చేస్తారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి పేదరికం పోదు. టీడీపీకి ఓటేసి వారికి మాత్రమే మీరు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఇది కూడా ఓ ఇడియటిక్ ప్రోగ్రాం.
ఇక మీరు అడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్న రూ.1500 ఏమయ్యాయి? దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పలేక నీ అనుకూల యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా 30 వేల మంది బిడ్డలు తండ్రులను కోల్పోయారని, అనాధలయ్యారని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.
ఆడబిడ్డ నిధి కోసం ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలని చెబుతున్న మంత్రులున్న ప్రభుత్వమిది. ఇప్పటికే రాష్ట్రంలో ఖనిజ సంపద, మెడికల్ కాలేజీలతో సహా అన్నింటినీ మీరు ఇప్పటికే అమ్మకం పెట్టారు.