– సమీక్షా సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్: వరద నష్టం ఎక్కువగా జరగకుండా సరైన సమయంలో అప్రమత్తమై చర్యలు చేపట్టిన అధికారుల కృషిని అభినందిస్తున్నా… పరిపాలన సౌలభ్యం కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసుకున్నాం… క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కామారెడ్డి ఐడాక్ లో వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్లు వివిధ శాఖలన్నింటితో సమన్వయ సమావేశాలు నిర్వహించండి. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో వ్యవహరించాలి. సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తా… నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి సీతక్క ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సమీక్షలో మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లండి. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీఫ్ ఫండ్ ను రాబట్టుకోవాలి. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.