– వచ్చేవి బై ఎలెక్షన్లు కావు, కాంగ్రెస్, బీజేపీ లకు బైబై ఎలెక్షన్లు
– రేవంత్ రెడ్డి చిల్లర ముఖ్యమంత్రి
– సిద్ధులగుట్ట సాక్షిగా చేసిన ప్రమాణాలేమ య్యాయి?
– ఒక్క ఆర్మూర్ లోనే రుణమాఫీ కాని రైతులు 40వేల మంది
– బీ ఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పెట్టుకుంటే మాడిమసై పోతారని
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఆర్మూర్ నియజకవర్గానికి చెందిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి తన అనుచరులతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ మూడు పేజ్ ల కరెంట్ అని పేర్కొంటూ ఆయనను టచ్ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. వచ్చేవి బై ఎలెక్షన్లు కావని, కాంగ్రెస్, బీజేపీ లకు బైబై చెప్పే ఎలెక్షన్లుఅని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఉత్తర తెలంగాణ నుంచే మొదలవుతుందని, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఈ రోజు జరిగిన బీజేపీ నేత విజయభారతి చేరిక కాంగ్రెస్, బీజేపీ ల పతనానికి నాంది అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక చిల్లర ముఖ్యమంత్రి అని, కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుడు తప్ప ప్రజలకు పెట్టుడు లేదని.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను రేవంత్ రెడ్డి అమలు చేయకుండా బొందపెట్టిండని ఆరోపించారు.
సిద్ధులగుట్ట సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రమాణాలేమ య్యాయని ఆయన నిలదీశారు. నిజామాబాద్ జిల్లాలో ఇంకా రుణమాఫీ కాని రైతులు రెండు లక్షల మంది ఉన్నారని, ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే 40వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.