Suryaa.co.in

Features

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విస్మరిస్తే ప్రమాదకరం

ప్రాంతీయ అభివృద్ధి అసమానతలు అనేది భారతీయ విధాన రూపకర్తలకు నిరంతర అభివృద్ధి సవాల్. ఇది వివిధ భౌగోళిక ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధి మరియు అసమాన ఆర్థిక సాధనలో వ్యత్యాసాన్ని సూచిస్తుంది. తలసరి ఆదాయం, దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న జనాభా నిష్పత్తి, పట్టణ జనాభా శాతం, పరిశ్రమల్లో నిమగ్నమైన వ్యవసాయంలో నిమగ్నమైన జనాభా శాతం, వివిధ రాష్ట్రాల మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సూచికల ద్వారా ఇది ప్రతిబింబిస్తుంది.

సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి అవసరం ప్రజాస్వామ్య రాజకీయాలలో, వృద్ధి మరియు శ్రేయస్సు తప్పనిసరిగా ప్రాంతీయ సమతుల్యత ప్రదర్శించాలి. అందువల్ల అటువంటి సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం అక్షింతలు. భారతదేశం 29 రాష్ట్రాలుగా విభజించబడింది, వాటి ఉత్పాదక సామర్థ్యం మరియు వారు మద్దతు ఇవ్వగల పరిశ్రమ రకం పరంగా విభిన్నంగా ఉంటుంది.

వారి సామర్థ్యాన్ని గ్రహించడం మొత్తం దేశం యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి కీలకమైనది. అభివృద్ధిలో ప్రాంతీయ అసమానత హింసాత్మక సంఘర్షణలు, ప్రణాళిక లేని మరియు ప్రమాదకర వలసలు వంటి సవాళ్లకు కారణమవుతుంది . భారతదేశం సమగ్ర ప్రాంతీయ సామర్థ్యంతో అభివృద్ధి చెందితే తప్ప వృద్ధి రేటు యొక్క స్థిరత్వం, దాని అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దేశం యొక్క లక్ష్యం చేరుకోవడం కష్టం.

రాష్ట్ర విభజన చట్టంలోని రెండు క్లాజులు ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో లభించే వెసులుబాటుతో రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర వెనుకబాటు అధికమించి సమతుల అభివృద్ధి సాధించడానికి అవకాశం కల్పించాయి. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇటువంటి వెసులుబాటు ఉండింది. పునర్వ్యవస్థీకరణ చట్టం 94(1) ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ పరిశ్రమలు స్థాపించడానికి ఆర్థికాభివృద్ధి సాధించడానికి పన్ను మినహాయింపు తో సహా తగిన ఆర్థిక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది.

94(2) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం భౌతిక, సాంఘిక మౌలిక సదుపాయాల కల్పన తో సహా అవసరమైన ఇతర కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ రెండు క్లాజులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కారు. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నెముక లేని పాలక ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీయడంతో పూర్తిగా విఫలమైంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దిశగా కార్యాచరణ లేకపోవడం దురదృష్టకరం.

దేశంలో అత్యంత వెనుకబాటుకు, నిర్లక్ష్యానికి గురైన జిల్లాల అభివృద్ధి గురించి ప్రస్తావించకపోవడం చారిత్రక తప్పిదం. వెనుకబడిన ప్రాంతాల సమతుల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక లేదు. వెనుకబాటు తనానికి మూల కారణాలు శాస్త్రీయంగా మరియు సామాజిక సంస్థలతో విశ్లేషణ జరగలేదు.

గ్రామీణ అభివృద్ధి, పనికి ఆహార పథకం, స్థానిక సంస్థల నిర్వహణ, పంచాయతీ రాజ్ వ్యవస్థలన్నీ తుంగలో తొక్కి నిధులు విడుదల చేయకుండా వ్యవస్థలన్నీ సహజ మరణానికి దారి తీసినట్లు చేస్తున్నారు. ఐదేళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబు రాజధాని పట్టిసీమ పై ఉత్సహం చూపిస్తే, నాలుగు సంవత్సరాలుగా అధికార వికేంద్రీకరణ, అపాత్ర దానాలకు అత్యుత్సాహం చూపుతున్న ప్రభుత్వం కొంతమేరకైనా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పై చూపకపోవడం అభద్రత భావాన్ని, అనుమానాలను, ఈ ప్రాంత ప్రజలలో ఆవేశాలను తీవ్ర నిరాశ నిస్పృహలను రేకెత్తిస్తున్నాయి.

పట్టిసీమ నిర్మిస్తే రాయలసీమ సస్యశామలమవుతుందనే విధంగా గత ప్రభుత్వం తీరు ఉండడం సాధారణ ప్రజలకు విస్మయాన్ని కల్గించింది. ప్రాంతాల అభివృద్ధి గురించి తగినంతగా ఏకరువు పెట్టకపోవడం రాయలసీమ ప్రజలను భాదిస్తున్నది. పాలనావసరాలకు రాజధానితో పాటు విద్య, వైద్య, న్యాయ, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, ఎకాలజి, పర్యావరణం, సేవ సంస్థలు, స్మార్ట్ సిటీలు అన్ని రంగాల అభివృద్ధి కలగా మారింది.

రాయలసీమలో సాగునీరు, వ్యవసాయం, పశుపోషణ, పాడి అభివృద్ధి, పరిశ్రమలు, పర్యాటకం, మొదలైన రంగాలలో సమతుల అభివృద్ధి జరిగి ఉంటే తెలంగాణ విడిపోయిన మనము ఇప్పుడు ఈ దుస్థితి లో ఉండేవాళ్ళం కాదు. శ్రీబాగ్ ఒడంబడిక ఉల్లంఘనతో పాటు సాగు నీటి విషయంలో ప్రాంతీయ అసమానతలు తొలగించే అనేక విషయాలలో నిర్లక్ష్యానికి గురై అనేక విధాలుగా మోసపోతున్నామనే భావన బలంగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలు, ప్రయత్నాలు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం భావనను తొలగించే బదులుగా ఇంకా బలపర్చేవిగా ఉంటున్నాయి.

పౌరసమాజం నుండి రాజకీయ పార్టీలలోనూ అంతర్గతంగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలనే వారు పెరుగుతున్నారు. కవులు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు, పౌర ప్రజాసంఘాలు నుంచి చివరకు సాధారణ ప్రజలలో ఇలాంటి భావన బలపడే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించకపోతే భావోద్వేగాలు పెరిగి, సంక్లిష్టత పెరిగి పరిస్థితి మరింత జటిలం కావడం ఖాయం. రాయలసీమ ఏర్పడితే కొంతమేరకు ఆవేశాలు చల్లార వచ్చు కానీ నీటి వనరులు, విద్యుత్, సంస్థలు, అప్పులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలు నిర్వహణలో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు.

ప్రజల మధ్య విద్వేషాలు, కొట్లాటలు నిత్యకృత్యంగా చోటు చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. పెద్ద దేశాలు ఆర్థిక సమాఖ్యలుగా కలసిపోయి, వనరులను జోడించుకొని ఖర్చులు తగ్గించుకొని ప్రపంచ పోటీకి తట్టుకోవాలని తీవ్రంగా ఆలోచన చేస్తున్న సందర్భంలో అనాగరికంగా తిరోగిమంచడం ఏ మాత్రం సమంజసం కాదు. వెనుకబడిన ప్రాంతాలలో అన్ని రంగాలపై లోతుగా అధ్యయనం చేసి మూలలను గుర్తించి జిల్లాలకు సమన్యాయం, సమతుల అభివృద్ధి సాధించడానికి నిర్దిష్ట ప్రణాళికలు తయారు చేయాలి.

ప్రతి జిల్లాలోనూ బహుళ రంగ సమతుల అభివృద్ధి ప్రణాళిక బోర్డు ని ఏర్పాటు చేయాలి. మేధావులు నిపుణుల సలహాలు సూచనలతో ప్రజల భాగస్వామ్యంతో అధికారుల స్థూల ఆమోదంతో ప్రణాళికలు రూపొందించాలి. ప్రాధాన్యతతో కూడిన ప్రణాళికలకు వనరులు కేటాయించినప్పుడే శాశ్విత సమగ్ర అభివృద్ధి సాధ్యం. వనరులను కేటాయించమని అడగడం, ప్రణాళికలను అమలు చేయమని అడగడం సాధించడం జరిగినప్పుడే అభివృద్ధి దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. మోసపూరిత వాగ్దానాలు, ఉత్తర ప్రగల్భాలు, ప్రత్యేక హోదా గురించి అలాగే వెనుకబడిన ప్రాంతాల గురించి విస్మరించిన పార్టీలను పక్కన పెట్టక తప్పదు.

LEAVE A RESPONSE