Suryaa.co.in

Andhra Pradesh

చట్ట వ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

– రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ
– టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని లేఖ రాసిన చంద్రబాబు
– ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ టీడీపీ నేతలను వేధిస్తోందని లేఖ
– మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ APSDRI దుర్వినియోగాన్ని లేఖలో తెలియపరిచిన చంద్రబాబు

లేఖలో పేర్కొన్న అంశాలు :-

ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడు. APSDRI ద్వారా టీడీపీ నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. APSDRIను ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోంది.

అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసుల పెట్టి ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారు.

శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయినా APSRDI డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోంది. కేంద్ర సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని ఏపీఎస్‌డీఆర్‌ఐ విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉంది.

టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రభుత్వం బనాయిస్తోంది. అసలు రాష్ట్రంలో APSDRI ఎందుకు స్థాపించబడింది…దాని లక్ష్యాలు ఏమిటి? కేవలం టీడీపీ నేతలను వేధించడమే APSDRI పనా? APSDRI రాష్ట్రంలో ఏర్పడ్డాక ఎన్ని కేసులు నమోదు చేసింది? ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల పెట్టి వేధిస్తోంది.

ఇప్పుడు మళ్లీ కొత్తగా APSDRI ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో APSDRI వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. APSDRIని దుర్వినియోగం చేసే ప్రభుత్వ చర్యను నిలువరించాలని కోరుతున్నా.

 

LEAVE A RESPONSE