ఆత్మగౌరవంతో, హుందాగా జీవించడానికి దోహదపడే సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వాల బాధ్యత
“సంక్షేమ పథకాలు – ఉచితాలు”పై దాఖలైన ప్రజా ప్రయోజనాల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల పూర్వరంగంలో
“సంక్షేమ పథకాలు – ఉచితాలు – పర్యవసానాలు” అన్న శీర్షికతో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం, ఆంధ్ర అడ్వకేట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఆగస్టు 21న విజయవాడలో చర్చా వేదికను నిర్వహించాయి. పలువురు ఆలోచనాపరులు చర్చలో పాల్గొని, వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తరతమ భేదాలతో స్థూలంగా ఏకాభిప్రాయం వెల్లడయింది. నేనూ పాల్గొన్నాను. నేను వ్యక్తం చేసిన ముఖ్యమైన అంశాలు:
1. మన రాజ్యాంగం పౌరులకు జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మనది సంక్షేమ రాజ్యమని పేర్కొన్నది. పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి, ఆత్మగౌరవంతో, హుందాగా జీవించడానికి దోహదపడే సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వాల బాధ్యత.
2. సంక్షేమ పథకాల పట్ల రాజకీయ పార్టీలకు భిన్నమైన దృక్పథాలు ఉన్నాయి. అవి భావజాల పరమైనవి. రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడివేసి, అమలు చేయడం ద్వారా ప్రభుత్వాలు వాటికి రాజకీయ రంగులు పులుముతున్నాయి. పర్యవసానంగా చర్చనీయాంశాలవుతున్నాయి. పేదలకు హక్కుగా లభించాల్సిన పథకాలను ప్రభుత్వాధినేతల దయాదాక్షిణ్యాల వల్ల అమలు చేయబడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పథకాలకు ప్రభుత్వాధినేతల పేర్లు పెట్టడం అత్యంత జుగుప్సాకరం.
3. ప్రధాన మంత్రి మోడీ గారు సంక్షేమ పథకాలు – ఉచిత పథకాలు అంటూ అభివర్ణించడం, సుప్రీం కోర్టులో వ్యాజ్యం – విచారణ పర్యవసానంగా ఈ అంశంపై దేశ వ్యాపితంగా విస్తృత చర్చించకు తెరలేసింది.
4. “సంక్షేమ పథకాలు – ప్రజాకర్షక పథకాలు – రాయితీలు” అంశాలపై రాజకీయాలకు అతీతంగా నిష్పాక్షిక చర్చ జరగడం మంచిది. వాటన్నింటినీ కలగలిపి గందరగోళం చేయడం ద్వారా సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టాలనే దుర్బుద్ధి ఎవరికైనా ఉంటే అలాంటి కుట్రలకు ప్రజా చైతన్యంతో అడ్డుకట్టవేయాలి.
5. మన రాజ్యాంగం పరిపూర్ణమైనది కాదు. కాబట్టే అనేక సవరణలు చేయబడ్డాయి. సామాజిక అభివృద్ధి దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని సవరణలు చేయవలసి ఉంటుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలు, లక్ష్యాలకు భంగం కలగకుండా సవరణలు చేయవలసి ఉంటుంది. ప్రాథమిక హక్కుల జాబితాలో ఉండవలసిన అనేక అంశాలు ఆదేశిక సూత్రాలలో పొందు పరిచబడ్డాయి. ఉదా: విద్య, వైద్యం, ఉపాధి వగైరా. వాటిని ప్రాథమిక హక్కులుగా సాధించుకోవడానికి వివిధ రూపాల్లో ఉద్యమాలు జరిగాయి. ఫలితంగా, 6 నుండి 14 సం.ల మధ్య వయస్సు పిల్లలకు విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తూ చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఇవి పరిమితంగానే అమలు చేయబడుతున్నాయి. ఇంకా మెరుగైన చట్టాలను సాధించుకోవాలి. వాటి కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.
6. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సత్ఫలితాలిస్తున్న సంక్షేమ పథకంగా సుప్రీం కోర్టు అభివర్ణించినట్లు ప్రసారమాధ్యమాలలో వార్తలొచ్చాయి. ఇది సంక్షేమ పథకాల కోవలోకి రాదు. అదొక చట్టం. ఆ చట్టం అమలు చేయబడుతున్నది. ఆహార భద్రతా చట్టం ఈ కోవలోనిదే. పనికి ఆహార పథకం వంటి సంక్షేమ పథకాలు గతంలో ఉండేవి. చట్టాల అమలులో భాగంగా అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకమైనా రాజ్యాంగబద్ధమైనదే. వాటికి నిధులను ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.
7. సంక్షేమ పథకాలను ఉచిత పథకాలుగా ఎవరైనా సంబోధిస్తే అత్యంత గర్హనీయం. ఉదా: వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. సేద్యం గిట్టుబాటు కావడం లేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆహార భద్రతకు పెనుముప్పు సంభవిస్తున్నది. రైతుకు సాగు నీటిని హక్కుగా అందించాలి. ఆర్థిక భారాన్ని తగ్గించాలి. ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. దాన్ని ఉచిత పథకమని తేలిక భావంతో మాట్లాడుతూ, సంస్కరణల ముసుగులో మొదట మీటర్లు బిగించి, అటుపై పూర్తిగా ఎత్తివేసే కుట్రపూరిత ఆలోచన ఎవరైనా చేస్తే సమాజానికే నష్టం.
8. అధికార దాహంతో ఎన్నికల సందర్భంలో విసక్షణారహితంగా ఓట్ల కోసం ఎన్నికల ప్రణాళికల ద్వారా, నోటి మాటల ద్వారా రాజకీయ పార్టీల అధినేతలు ప్రజలపై వాగ్దానాల వర్షం కురిపిస్తుంటారు. వాటిని అమలు చేయడానికి ఎంత మొత్తంలో నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుందో అంచనా కూడా వేసుకోరు. ఆ ఆలోచనే చేయరు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రణాళికలను, వాగ్దానాలను విస్మరించి, బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు. జవాబుదారీతనం ఏ కోశానా కనపడదు. కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు వాగ్దానం ఒక మంచి తాజా ఉదాహరణ. సిపీఎస్ ను రద్దు చేస్తామని ఎన్నికల నాడు అవలీలగా చెప్పేశారు.
నేడు మొత్తం వార్షిక బడ్జెట్ కూడా సరిపోదంటూ నాలుక మడతపెట్టి మాట్లాడుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇమ్మంటే చెవికెక్కించుకొని ప్రభుత్వాలు మతపరంగా పాస్టర్స్ కు, ముల్లాలకు గౌరవ వేతనాలు ఇస్తారు. 45 సం.లు దాటిన మహిళలకు పెన్షన్, పసుపు కుంకుమ, ఉచిత ఇసుక, టాబులు, ల్యాప్ ట్యాపులు, టివీలు, ప్రిజ్ లు, వగైరా వగైరా ఓటు బ్యాంకు లేదా ప్రజాకర్షక పథకాలను ఉచిత పథకాలుగా పరిగణించవచ్చు. ఈ తరహా పథకాలను ఏ విధంగా నియంత్రించాలన్న ఆలోచన చేస్తే, అది సమర్థనీయం.
9.రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు బాధ్యతగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా వ్యవహరించాలి. సంక్షేమం – అభివృద్ధిని జోడెద్దులుగా భావించి, సమతుల్యతతో విధానాలను రూపొందించుకొని అమలు చేసినప్పుడే సమాజం ప్రగతి పథంలో నడుస్తుంది. రాష్ట్రం లేదా దేశం యొక్క వార్షిక ఆదాయం ఎంత? అందులో పరిపాలనా ఖర్చులు మినహాయించి, పెట్టుబడి పద్దు క్రింద పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులు, తదితర ఉపాధి కల్పనా రంగాలు, విద్య, వైద్య రంగాల్లో వెచ్చించాల్సి నిధులెంత? సంక్షేమ రంగాల్లో ఎంత మొత్తంలో ఖర్చు చేయగలమన్న విజ్ఞతతో వార్షిక బడ్జెట్లను రూపొందించుకొని చిత్తశుద్ధితో అమలు చేసే గుణం ఉండాలి.
10. రాజకీయ పార్టీలు, నాయకులు ఇచ్చే ఎన్నిక వాగ్దానాలను నియంత్రించే, ఎన్నికల ప్రణాళికల అమలును పర్యవేక్షించే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఏవి సంక్షేమ పథకాలో, ఏవి ఉచిత పథకాలో తేల్చిచెప్పడం కష్టమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పరిణతితో కూడిన సమగ్ర చర్చ చట్ట సభల్లో చేసి మాత్రమే విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని గుర్తు చేసింది. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించే స్థితిలో రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయా?
11. కార్పొరేట్ సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా రాయితీలను ఇస్తున్న ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు మరియు ప్రత్యేకించి పేదలకు రాయితీలు ఇచ్చే విషయంలో “ఉచితం”అన్న భావాన్ని బలంగా ప్రచారంలోకి తెస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై రైతులకిచ్చే సబ్సిడీల్లో, వంట గ్యాస్, కిరోసిన్, ఆహార భద్రత కల్పించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే నిత్యావసర సరుకులపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించారు. సాధారణ ఉద్యోగుల నుండి 30% ఆదాయపు పన్నును చెవులు వడబిండి ముందుగానే టిడీఎస్ రూపంలో వసూలు చేసుకొంటున్న కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ పన్నును 32% నుండి 23% తగ్గించి, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చుతున్నది. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ముసుగులో వివిధ రూపాలలో రాయితీలతో పాటు మొండి బాకీల పద్దు క్రింద రుణాల మాఫీ. ఈ ఆర్థిక నీతిని ఏమనాలి?