విజయదశమి సందర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివరి రోజున ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే దసరా రోజు రావణదహనంతోపాటు చేయాల్సిన కార్యక్రమాల్లో మరొకటి.. పాలపిట్ట దర్శనం.
దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే అసలు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించాక విజయదశమి రోజున శమీ వృక్షంపై ఉన్న తమ ఆయుధాలను తీసుకుని హస్తినాపురం వైపు ప్రయాణమవుతారు. అదే సమయంలో వారు పాలపిట్టను చూస్తారు. దీంతో వారికి ఆ తరువాత అన్నీ శుభాలే కలుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై వారు విజయం సాధిస్తారు. అప్పటి నుంచి దసరా రోజున పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
పాలపిట్ట సాక్షాత్తూ దేవీ స్వరూపమని, అది ఉత్తర దిక్కు నుంచి వస్తే ఇంకా మంచిదని, శుభాలు, విజయాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. విజయదశమి రోజున కచ్చితంగా పాలపిట్టను చూడండి.. చూడడం మాత్రం మరిచిపోకండి..!
– ఆమంచి రాఘవశాస్త్రి