Suryaa.co.in

Editorial

‘పులివెందుల ఫైల్స్’లో.. విజయమ్మ మౌనరాగం

– కూతురిపై మాటల దాడి జరుగుతున్నా తల్లి మౌనం
– కొడుకు సారధ్యంలో వ్యక్తిత్వ హననం జరుగుతున్నా మౌనమేల?
– డాక్టర్ సునీత పెదవి విప్పినా విజయమ్మ పెదవి విప్పరేం?
– షర్మిల అసలు వైఎస్‌కే పుట్టలేదంటూ దారుణ ప్రచారం
– ఆ ప్రచారంపై వైఎస్ అభిమానుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
– రాహుల్ స్పందించినా విజయమ్మ ఎందుకు స్పందించడం లేదని అసంతృప్తి
– ముగ్గురినీ లేపేస్తామని ఫోను బెదిరింపులు
-పోలీసులకు ఫిర్యాదు చేసిన వివేకా కుమార్తె సునీత
– షర్మిల పాదయాత్ర నిందలపైనా పెదవి విప్పని విజయమ్మ
– భారతి పాదయాత్రను షర్మిల హైజాక్ చేసిందన్న కొండా రాఘవరెడ్డి
– బిడ్డలపై ఒట్టేసి మీరూ ఒట్టేయాలని సవాల్ చేసిన షర్మిల
– కావాలంటే తల్లి విజయమ్మనే అడగాలని షర్మిల సవాల్
– అయినా ఇప్పటిదాకా స్పందించని విజయమ్మ
– కూతురి వైపో, కొడుకు వైపో చెప్పని విజయలక్ష్మి
– విజయమ్మది లౌక్యమా? మొహమాటమా? భయమా?
– విజయమ్మ పెదవి విప్పితేనే షర్మిలకు గౌరవం
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్ కుటుంబానికి పెద్ద దిక్కు విజయమ్మ. మహానేత జీవించినంత వరకూ ఆమె బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ వైఎస్ మృతితో, అసలు వైఎస్ కుటుంబమే రోడ్డున పడింది. వైఎస్ మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ సకుటుంబ సపరివార సమేతంగా ఎలుగెత్తి ఆరోపించింది. గతేడాది అదే రియలన్స్‌కు చెందిన పరిమళ్ నత్వానీకి జగన్ వైసీపీ ఎంపి సీటును పువ్వుల్లో పెట్టి మరీ అప్పగించారు. జగన్ జైలు పాలైతే తమకు న్యాయం చేయాలంటూ యావత్ కుటుంబం రోడ్డెక్కింది. అన్న కోసం చెల్లి షర్మిల.. కష్టాలను పంటిబిగువున భరించి, వేల కిలోమీటర్లు చేసిన తొలి మిహ ళా నేతగా రికార్డు సృష్టించారు.

ఈ మొత్తం వ్యవహారాల్లో విజయమ్మ చాలాకాలం, ముందుండి కుటుంబాన్ని నడిపించారు. సహజంగా పెళ్లి అయిన తర్వాత కూతుళ్ల పాత్ర తక్కువ. అలాంటిది అన్న జగన్ జైలుకెళితే, పార్టీ కోసం చెల్లి షర్మిల పాదయాత్ర చేస్తే.. ఆమెకు భర్త బ్రదర్ అనిల్ అండగా నిలిచారు. ఇప్పుడేమో తనకోసం రోడ్డెక్కిన, చెల్లి-బావ సీఎం జగన్‌కు కానివారయ్యారు. తల్లి తన దగ్గర కాకుండా చెల్లితో ఉంటున్న పరిస్థితి. షర్మిల సభల్లో పాల్గొని, ఆమెకు విజయమ్మ మనోధైర్యం ఇస్తున్న పరిస్థితి.

చెల్లిని తన పార్టీ నేతలు తిడుతున్నా.. సొంత మీడియాలో చెల్లిని వ్యక్తిక్వ హననానికి గురిచేస్తున్నా జగన్ స్పందించని వైనం. అయినా తల్లి విజయమ్మ స్పందించరు. ఏది నిజం? ఏది అబద్ధమో పెదవి విప్పరు. ఇంతకూ విజయమ్మది మొహమాటమా? జగన్ బలాన్ని చూసి భయమా? ఆయన మనస్తత్వం తెలిసినందుకే మౌనంగా ఉన్నారా? అందుకే కూతురిపై మాటల దాడి చేస్తున్నా ఆ తల్లి మౌనంగా ఉన్నారా?

దాన్ని పక్కకుపెడితే.. షర్మిల వ్యక్తిత్వ హననంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. షర్మిలకు యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళలపై దాడి అనాగరికమని మండిపడ్డారు. అటు వైఎస్ అభిమానుల రక్తం ఉడికిపోతోంది. తమ అభిమాన నేత బిడ్డ-తల్లి శీలాన్ని శంకిస్తూ, కొడుకు బృందమే దుష్ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా విజయమ్మ ఎందుకు స్పందించరు? మీడియా ముందుకొచ్చి ‘పులివెందుల ఫైల్స్’ను ఎందుకు బయటపెట్టరు? ఇదీ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్.

అప్పట్లో తల్లా? పెళ్లామా అనే బ్లాక్ అండ్ వైట్ సినిమా ఒకటి వచ్చింది. అది కథానాయకుడు.. తన తల్లి-ఆలి మధ్య నలిగిపోయే కథ. ఇప్పుడు పులివెందుల కథలో సీన్లు సేమ్ అయినప్పటికీ, పాత్రలు మాత్రం రివర్స్. పులివెందుల కుటుంబకథలో ఆ పాత్రను తల్లి విజయమ్మ పోషిస్తోంది. కొడుకా? కూతురా? ఎటు వైపో తేల్చుకోలేని అయోయం. అందుకే ఆ తల్లి.. తన కూతురు షర్మిలపై, కొడుకు పార్టీ బృందం నోరుపారేసుకుంటూ, చివరికి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా, గప్‌చుప్‌గా ఉండిపోవడంపై సమాజం ఆశ్చర్యపోతోంది.

షర్మిల అసలు వైఎస్‌కే పుట్టలేదు… షర్మిల, విజయమ్మనూ వదలం. షర్మిల వాళ్ల నాన్నకు పుట్టలేదు..అందుకే పెద్దలన్నారు. శత్రుశేషం ఉంచకూడదని. లేపేయ్ అన్నాయ్ ఇద్దరినీ.. ఈ ఎన్నికలకు పనికొస్తారు. షర్మిల మీద జాలిపడాల్సిన పనిలేదు. గట్టిగా మింగండి. గేరు మార్చండి.. అన్న జోలికొస్తే ఎవరినీ వదలం. సోషల్‌మీడియా దెబ్బ రుచిచూపిస్తాం.. అంటూ… దివంగత వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు వస్తున్న బెదిరింపులివి.

జగన్‌కు వ్యతిరేకశిబిరంలో నిలబడి ఆయనకు సవాలు విసురుతున్న షర్మిల-సునీతలను బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉందనేది మెడపై తల ఉన్న ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. ఆమె దీనిపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా దీనిని అన్నయ్య జగన్, ఇప్పటిదాకా ఖండించిన దాఖలాలు లేవు. వాటిపై విచారణ జరిపిస్తానని హమీ కూడా ఇవ్వలేదు. అదో ఆశ్చర్యం మరి! అంతేనా? అక్క-చెల్లిని గౌరవించే సీమ గడ్డపై ఇదొక సరికొత్త సంస్కృతి.

అవును. నిజమే. తల్లి-చెల్లెళ్ల మీద పోస్టింగులు పెడుతుంటే, స్పందించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత… జగన్‌కు లేదా అని నిలదీసిన, డాక్టర్ సునీత ప్రశ్నలకు ఇప్పటిదాకా జవాబు లేదు. ‘చేసే వాళ్లకంటే చేయించే వాళ్ల బాధ్యతే ఎక్కువ’ అంటూ, ఎవరికి తగలాలో వారికే తగిలే ప్రశ్నలు సంధించడం ఆసక్తికలిగిస్తోంది. ఇక షర్మిల లక్ష్యంగా జరుగుతున్న దాడిపై, సునీత సంధించిన ప్రశ్నాస్త్రాలు మహిళాలోకంలో చర్చనీయాంశంగా మారాయి. ఇవి వైసీపీని మహిళలకు పూర్తిగా దూరం చేసేలా కనిపిస్తున్నాయి.

షర్మిల అసలు వాళ్ల నాన్నకే పుట్టలేదని ప్రచారం చేస్తున్నారు. ఇది తెలిసి కూడా అన్న జగన్ ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఒక నాయకుడే కదా? ఇదేనా మనం నేర్చుకున్న సంస్కారం? షర్మిల-నాకే ఇలా జరుగుతుంటే, ఇక ఏం ఏపీలో మిగిలిన వారి పరిస్థితి ఏంటి అంటూ.. జగన్ లక్ష్యంగా ఇంకో చెల్లి సునీత సంధించిన ప్రశ్నాస్త్రం.. మహిళా వర్గాల్లో షర్మిల-సునీతకు బోలెడంత సానుభూతి, వైసీపీ వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయని వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

ఇక బ్రదర్ అనిల్-షర్మిలను జమిలిగా లక్ష్యం చేసుకుంటూ.. వైసీపీ సోషల్‌మీడియా వర్గాలు చేస్తున్న దుష్ప్రచారంపై సునీత చేసిన వ్యాఖ్యలు, వైసీపీని మహిళలకు దూరం చేసేలా ఉన్నాయి. ‘అప్పుడు షర్మిల భర్త, ఆయన కులం ఏమిటో తెలియదా? పెళ్లిచేసుకున్నంత మాత్రాన పేరు మార్చుకోవాలా? అప్పుడు నాకు షర్మిల మద్దతునిచ్చింది. ఇప్పుడు నేను షర్మిల పోరాటానికి మద్దతునిస్తున్నా’న న్న సునీత వ్యాఖ్యలకు మహిళాలోకంలో మద్దతు పెరుగుతోంది.

అయితే ఇంత జరుగుతున్నా తల్లి విజయలక్ష్మి మాత్రం, పెదవి విప్పకపోవడం విమర్శలకు దారితీస్తోంది. చివరకు కూతురిపై వ్యక్తిత్వ హననంపై రాహుల్‌గాంధీ స్పందించినప్పటికీ, కన్నతల్లి తనకేమీ పట్టనట్లు మౌనంగా ఉండటాన్ని మహిళాలోకం సహించలేకపోతోంది. ఓవైపు కొడుకు జగన్ నుంచి బయటకు వచ్చి, కూతురు షర్మిలతో ఉంటున్న విజయమ్మ.. అసలు అప్పటి రాజకోట రహస్యాలు- జగన్ జైల్లో ఉన్నప్పుడు జరిగిన చర్చలు ఎందుకు బయటపెట్టడం లేదు? పాదయాత్ర చేయాలని భారతిని కోరారా? లేక షర్మిలపై ఒత్తిడి చేశారా? షర్మిల అసలు వైఎస్‌కే పుట్టలేదన్న దారుణ-వ్యక్తిత్వ హనన విమర్శలపై, విజయమ్మ ఎందుకు ఎదురుదాడి చేయడం లేదు?

భారతి పాదయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైతే.. దానిని షర్మిల హైజాక్ చేసిందన్న వైసీపీ నేతల ఆరోపణలను, విజయమ్మ ఎందుకు ఖండించలేదు? అసలు ఆరోజు కుటుంబసభ్యుల మధ్య ఏం చర్చ జరిగింది? ఆ చర్చలో కొండా రాఘవరెడ్డి ఉన్నారా? లేదా? షర్మిలారెడ్డికి బదులు షర్మిలాశాస్త్రి అంటూ కొడుకు పార్టీ చేస్తున్న ప్రచారంపై, విజయమ్మ ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు, విజయమ్మ కేంద్రంగా వెల్లువెత్తుతున్నాయి.

ఫలితంగా… విజయమ్మ లౌక్యంగా వ్యవహరిస్తున్నారా? అటు కొడుకును ఇటు కూతురునూ వదలుకోలేకనే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారా? అన్న సందేహాలు కూడా తెరపైకి వ స్తున్నాయి. అయితే కన్నకూతురి వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు కూడా మౌనంగా ఉంటే.. అది వేరే సంకేతాలకు కారణమవుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఒకరకంగా విజయమ్మ మౌనం…షర్మిల రాజకీయంగా-నైతికంగా నష్టపోతోందని, వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘ఇప్పటివరకూ షర్మిల లక్ష్యంగా వైసీపీ చాలా దారుణంగా వ్యవహరిస్తున్న విషయం విజయమ్మకు తెలుసు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో కూడా ఆమెకు తెలుసు. సునీత పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా విజయమ్మకు తెలుసు. అంటే కుటుంబ పరువు పోయినట్లే. అసలు షర్మిల వైఎస్‌కే పుట్టలేదన్న దారుణ దుష్ప్రచారంపై స్పందించాల్సిన విజయమ్మ, మౌనంగా ఉండటమే ఆశ్చర్యం. పెద్దాయన్న బాగా అభిమానించే షర్మిలపై జరుగుతున్న దాడులను భరించలేకపోతున్నాం. ఇదే మమ్మల్ని వైఎస్ అభిమానులుగా బాధిస్తోంది. మాకే ఇంత ఆగ్రహంగా ఉంటే కన్నతల్లికి ఇంకెంత ఆగ్రహం ఉండాలి? అసలు ఇన్నేసి మాటలు అంటుంటే ఏ తల్లి-అన్నయినా మౌనంగా ఉంటారా? బైబిల్ సాక్షిగా విజయమ్మ చెప్పే నిజాలు, షర్మిలకు నైతిక స్థైర్యం ఇస్తాయి. మరి ఇప్పటికయినా విజయమ్మ నోరు విప్పుతారా లేదో మాకు తెలియద’ని, వైఎస్ కుటుంబ సన్నిహితుడైన.. కడపజిల్లాకు చె ందిన ఓ మైనారిటీ మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE