Suryaa.co.in

Andhra Pradesh

ఎస్సీ గురుకులాల్లో.. వంద శాతం ఫలితాల సాధన ప్రత్యేక చర్యలు

• సీఎం తీసుకున్న చర్యలతో అన్ని సీట్లూ ఫుల్
• మంత్రి మేరుగు నాగార్జున
• మధురవాడలోని గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి

విశాఖపట్నం, ఆగష్టు 27: ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలను సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాఠ్యాంశాల బోధనా ప్రణాళికలోనూ మార్పులు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యల ఫలితంగా మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎస్సీ గురుకులాల్లో సీట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడి ఒక్క సీటు కూడా మిగలకుండా అన్ని సీట్లూ భర్తీ అయ్యాయని వెల్లడించారు.

శనివారం మధురవాడలోని డా.బీఆర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఇ) గురుకులాన్ని నాగార్జున ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగానే సిఓఇ లోని విద్యార్థులతో ముచ్చటించి వారి ప్రతిభా పాటవాలను పరీక్షించారు. కంప్యూటర్ ల్యాబ్, వంటశాల, తరగతి గదులతో పాటుగా వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సిఓఇలో సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే నాగార్జున మాట్లాడుతూ, పిల్లల తల్లిదండ్రుల కంటే మిన్నగా వారి సంక్షేమం గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని, వారికి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న చర్యల ఫలితంగానే ఎస్సీ గురుకులాలలోని సీట్లకు ఈ ఏడాది విపరీతమైన పోటీ ఏర్పడిందని తెలిపారు. గతంలో ఎస్సీ గురుకులాల్లో సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతుండేవని చెప్పారు. అయితే దీని భిన్నంగా ఈ ఏడాది అన్ని సీట్లు భర్తీ కావడంతో పాటుగా అదనపు సీట్ల కోసం ప్రతిపాదనలు పంపాల్సి వచ్చిందని వివరించారు.

ఎస్సీ గురుకులాలు, ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు-నేడు పథకంలోకి తీసుకురావడంతో వీటి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని అభిప్రాయపడ్డారు. ఎస్సీ విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సకల సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలోనే పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ పరిస్థితుల్లోనే గురుకులాల్లో విద్యార్థులు అందరూ అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణలైయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులదేనని నాగార్జున స్పష్టం చేశారు.

విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించనప్పుడు ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులకు ట్యూషన్లు పెట్టించి వారు పాస్ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సంబంధిత సంబంధిత సబ్జెక్టులను బోధించే టీచర్లదేనని పేర్కొన్నారు. వంద శాతం ఫలితాల సాధనలో భాగంగా టీచర్లకు కూడా ప్రత్యేక శిక్షణలు ఇప్పించనున్నామని తెలిపారు. దీంతో పాటుగా గురుకులాల్లో టైమ్ టేబుల్ ను మార్చడం జరుగుతుందని, విద్యార్థులకు వారాంతపు పరీక్షలను పెట్టి వారు సాధించిన మార్కుల ఆధారంగా అవసరమైన వారికి ప్రత్యేక క్లాసులను నిర్వహించడం జరుగుతుందని నాగార్జున వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జీఎం సునీల్ రాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE