Suryaa.co.in

Andhra Pradesh

క్యాబినెట్‌లో.. ఇదో రికార్డు!

(కిరణ్‌కుమార్)

ఈ-క్యాబినెట్ సమావేశంలో మొత్తం 43 అంశాలపై చర్చించి ఆమోదం తెలపడం విశేషం.

వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

నవ అమరావతి నిర్మాణానికి పటిష్ట ప్రణాళిక

పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ల్యాండ్ పూలింగ్ పాలసీ 2025కి ఆమోదం:

ప్రపంచ స్థాయి సంస్థలు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన కోసం భూమి పూలింగ్ చేయడానికి “ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ భూమి పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ & ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025” కు ఆమోదం లభించింది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా, రైతులకు మెరుగైన ప్యాకేజీ అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అమరావతి నిర్మాణానికి పటిష్టమైన పునాది వేస్తుంది.

ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగవంతం:

ఇంటిగ్రేటెడ్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ & హెచ్‌ఒడీ కార్యాలయాలు (GAD టవర్), టవర్స్ 1 & 2, టవర్స్ 3 & 4 నిర్మాణ పనులకు సంబంధించి L1 బిడ్‌లను ఆమోదించేందుకు APCRDA కమిషనర్‌కు అధికారం ఇచ్చారు. ఇది పరిపాలనా సౌలభ్యాన్ని పెంపొందిస్తుంది.

అమరావతిలో అంతర్జాతీయ విద్యా సంస్థలకు ప్రోత్సాహం:

ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER)కు భూమి కేటాయింపు ధర మరియు పద్ధతిని సవరించారు. ఎకరానికి రూ.50.00 లక్షల విలువ కలిగిన భూమిని ఫ్రీహోల్డ్ ఆధారంగా, ఏడాదికి చదరపు మీటరుకు రూ.1/- చొప్పున 60 సంవత్సరాల అద్దె ప్రాతిపదికన కేటాయించడం ద్వారా అంతర్జాతీయ విద్యా సంస్థల స్థాపనకు మార్గం సుగమమైంది.

అన్నా క్యాంటీన్ల ఏర్పాటు:

గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో 7 కొత్త అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇది నిరుపేదలకు నాణ్యమైన, సరసమైన ఆహారాన్ని అందిస్తుంది.

భవన నిర్మాణ రంగ అభివృద్ధి:

ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్ రూల్స్, 2017కు సవరణలు తీసుకురావడం ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, నిర్మాణ రంగానికి ఊపునిచ్చే ప్రయత్నం చేశారు.

క్రీడా ప్రతిభకు గుర్తింపు:

అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ శ్రీ సాకేత్ సాయి మైనేని అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా, వారికి డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్-I సర్వీసెస్) గా ఉద్యోగం ఇవ్వాలని ఆమోదించారు. ఇది క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహం, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఒక ఆదర్శం.

అభివృద్ధి ప్రాజెక్టులకు భూ కేటాయింపులు:

విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను కేటాయించారు. ఇవి పర్యాటకం, విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడతాయి. ముఖ్యంగా, తిరుపతి మరియు కడప జిల్లాలో ఒబెరాయ్ రిసార్ట్ వంటి పర్యాటక ప్రాజెక్టులకు భూమి కేటాయింపులు, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి నూతన ఊపిరి పోస్తాయి.

సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ:

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 51 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మత్తులు మరియు పునరుద్ధరణ పనులకు ఆమోదం తెలిపారు. అలాగే తుంగభద్ర హై లెవల్ కెనాల్ (TBP HLC) వ్యవస్థ కింద మూడు అత్యవసర పనులకు నిధులు కేటాయించారు. ఈ పనులు అనంతపురం, కడప జిల్లాల రైతులకు సాగునీటి అవసరాలను తీర్చి, పంటల దిగుబడిని పెంచుతాయి.

సాగునీటి భద్రతకు పెద్దపీట:

సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మరియు NSRS శ్రీశైలం ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెండు పనులకు రూ.350.00 కోట్లకు సవరించిన పరిపాలనా ఆమోదం ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో పాలార్ నదిపై 17 చెక్ డ్యామ్‌ల మరమ్మత్తు/పునర్నిర్మాణానికి ఆమోదం తెలపడం ద్వారా కరవు ప్రాంతాలైన వి.కోట, రామకుప్పం, శాంతికుప్పం ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగి, రైతులకు సేద్యానికి కావలసిన అవసరాలు తీరుతాయి.

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆమోదం:

YSR కడప జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాలో పలు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపునకు ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో 83 MW విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఇది రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించి, భవిష్యత్తుకు భరోసానిస్తుంది.

అంబేద్కర్‌ స్వరాజ్‌ మైదాన్ పునరుద్ధరణ:

విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌ను ‘యథాతథంగా’ కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించే ధృక్పంతో ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి యువజన సర్వీసులశాఖ పరిపాలనా నియంత్రణలో AP కల్చరల్ అఫైర్స్ డైరెక్టర్‌కు బదిలీ చేయాలని ఆమోదించారు. ఇది సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరిస్తుంది.

మినీ అంగన్‌వాడీల అప్‌గ్రేడేషన్:

6497 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడానికి ఆమోదం లభించింది. ఈ ఉన్నతీకరణ ద్వారా ఎస్సీ/ఎస్టీ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో నివసించే సుమారు 1,20,000 నిరుపేద పిల్లలకు నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు ప్రారంభ విద్య అందుబాటులోకి వస్తుంది. ఇది సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు చేరువయ్యే గొప్ప ప్రయత్నం.

సాహస పర్యాటకానికి ప్రోత్సాహం:

ఆంధ్ర ప్రదేశ్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలు, 2025 ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇది సాహస పర్యాటకాన్ని సురక్షితంగా, పర్యావరణ అనుకూలంగా మరియు సామాజిక-ఆర్థిక లాభాలను గరిష్టంగా అందించేలా నిర్వహించడానికి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.

పర్యాటక రంగంలో కొత్త ఉద్యోగాలు:

అమరావతి, పోలవరం మరియు తిరుపతిలో 4-స్టార్ మరియు 5-స్టార్ లగ్జరీ హోటళ్లు/రిసార్ట్‌ల అభివృద్ధి కోసం ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా వందలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి, రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది.

ఐటీ రంగంలో పెట్టుబడులు:

విశాఖపట్నం జిల్లా మధురవాడ గ్రామంలో M/s కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమి కేటాయించి, రూ.1582.98 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహం అందజేసి తద్వారా 8000 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేశారు. ఇది రాష్ట్రంలో ఐటీ రంగానికి ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుంది.

పొగాకు రైతులకు మద్దతు:

KMS 2024-25లో రాష్ట్రంలో పొగాకు మార్కెట్‌ను స్థిరీకరించడానికి మరియు రైతుల ప్రయోజనాలను రక్షించడానికి APMARKFED ద్వారా మొదటి దశలో 20.00 మిలియన్ కిలోల HD BRG పొగాకును సేకరించడానికి ఆమోదం లభించింది. ఇది పొగాకు రైతులకు గొప్ప భరోసానిస్తుంది.

పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం:

రేమండ్ గ్రూప్, G-INFRA ప్రెసిషన్స్, సంగమ్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ, 3F ఆయిల్ పామ్, ABIS ప్రొటీన్స్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి సంస్థల పెట్టుబడులకు ప్రోత్సాహకాలు అందించడానికి ఆమోదం తెలిపారు. అలాగే ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా, కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ మరియు LG ఎలక్ట్రానిక్స్ ఇండియా వంటి సంస్థలకు మరింత రాయితీలను విస్తరించారు.

కొత్త పారిశ్రామిక పాలసీలు:

ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ (2.0) 2025-2030, MSME & ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ (4.0) 2024-29, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ (4.0) 2024-29, టెక్స్‌టైల్స్, అపారెల్ మరియు గార్మెంట్స్ పాలసీ (2024-29) వంటి కొత్త పారిశ్రామిక పాలసీలకు ఆమోదం తెలిపారు. ఇవి రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి కల్పనకు కీలకమైనవి.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్:

జూలై 2024 నుండి రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) ఏడు సార్లు సమావేశమై, 4.88 లక్షల + ఉపాధి కల్పన సామర్థ్యంతో మొత్తం 5.24 లక్షల + కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించింది.

నేటి సమావేశంలో కూడా 28,546 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మరియు 30,270 ఉద్యోగాలను ఆమోదించారు.

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి నూతన దృక్పథం

ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో “స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్” ను “స్వర్ణ ఆంధ్ర P4 ఫౌండేషన్‌గా” పునరుద్ధరించడానికి ఆమోదం లభించింది. ఇది CSR, ప్రపంచ ప్రైవేట్ రంగం, పౌరుల మద్దతు మరియు వినూత్న భాగస్వామ్యాల కేంద్రీకరణకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను స్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధికి ఒక మాడల్ రాష్ట్రంగా స్థాపించడంలో సహాయపడుతుంది.

 

LEAVE A RESPONSE