– సత్తెనపల్లి లో వ్యూహాత్మకంగానే కమ్మ వారిపై మాట్లాడారా?
– కమ్మ వారిని వేధిస్తున్నారన్న జగన్ వ్యాఖ్యల మర్మమేమిటి?
– టీడీపీపై కమ్మకులం అసంతృప్తిని సొమ్ము చేసుకునే వ్యూహమా?
– అధికారంలో ఉన్నా తమను పట్టించుకోవడం లేదంటున్నకమ్మవర్గం అసంతృప్తిని జగన్ సొమ్ము చేసుకుంటున్నారా?
– జగన్ సానుభూతిని కమ్మ వర్గం నమ్ముతుందా?
– రెండుగా చీలిన
– ఒకేరోజు రెండు వర్గాల కమ్మ సంఘాల అనుకూల-వ్యతిరేక ప్రెస్‌మీట్లు
– జగన్ లక్ష్యం కూడా అదేనా?
– ఇప్పటికే కమ్మ సంఘాల్లో మొదలైన చర్చ
– జగన్ జమానాలో కమ్మవర్గంపై వేధింపులు
– కమ్మ వర్గం జగన్‌ను నమ్మదంటున్న కమ్మ సంఘాలు
– క్షమాపణ చెబితే మార్పు రావచ్చంటున్న మరికొన్ని సంఘాలు
– టీడీపీ ఏమీ చేయకపోయినా జగన్ వైపు వెళ్లేదిలేదంటున్న మెజారిటీ కమ్మ సంఘాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఐదేళ్ల జగన్ జమానాలో కమ్మ వర్గం కకావికలయింది. వారిని అన్ని రంగాల్లోనూ జగన్ సర్కారు దారుణంగా దెబ్బతీసింది. తన చుట్టూ ఉన్న కొంతమంది కమ్మ నేతలతోనే టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్ని నిండు సభలో దారుణంగా తిట్టిపోయించిన అదే జగన్.. ఇప్పుడు హటాత్తుగా అదే కమ్మవారిపై సానుభూతి ప్రకటించడం వ్యూహాత్మకమా?.. కూటమి పాలనపై పీక ల్లోతు అసంతృప్తితో రగిలిపోతున్న మెజారిటీ కమ్మ వర్గాన్ని ఆకర్షించే ఎత్తుగడనా?.. అదే నిజమైతే మరి తమను వెంటాడి వేధించిన జగన్‌ను కమ్మ వర్గం జగన్‌ను నమ్ముతుందా? లేక కూటమి పాలనపై అసంతృప్తి ఉన్నా, అనివార్య పరిస్థితిలో టీడీపీతోనే కలసి నడుస్తుందా?.. ఇదీ ఇప్పుడు కమ్మ సామాజికవర్గంలో జరుగుతున్న హాట్ టాపిక్.
‘‘కమ్మవాళ్లు మీ పార్టీలోనే ఉండాలా? మా పార్టీలో ఉండకూడదా? కమ్మవాళ్లు మా పార్టీలో ఉంటే నీకేంటి అభ్యంతరం? నీకు ఊడిగం చేయడానికే కమ్మవాళ్లు పుట్టారనుకుంటున్నావా? కమ్మవాళ్లు బాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే హింసించి జైల్లో పెడుతున్నారు. వాళ్లను ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారు. కమ్మకులానికి చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నాని, తలశిల రఘురాం, సత్యనారాయణ వంటి నాయకులను వేధిస్తున్నారు’’
– ఇదీ జగన్ తాజాగా తనతో ఉన్న కమ్మ నాయకులనుద్దేశించి చేసిన వ్యాఖ్య.
‘‘ కమ్మవాళ్లంతా టీడీపీతో ఉండాలా? కమ్మవాళ్లంటే టీడీపీకి కట్టుబానిసలా? గతంలో కాంగ్రెస్‌లో కమ్మ వారు లేరా? అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకొచ్చింది? కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు. అనేకమంది కమ్మ యువకులను పై చదవులకు విదేశాలకు పంపించిన ఘనత జగన్‌దే. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన ఘనత జగన్‌దే. కమ్మ కార్పోరేషన్‌కు టీడీపీ ప్రభుత్వం నిధులివ్వాలి. కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు? కమ్మ సంఘాలున్నది సేవా కార్యక్రమాలకు. రాజకీయ పార్టీలను విమర్శించడానికి కాదు! వైసీపీలో కమ్మ వాళ్లుంటే తప్పేంటి? వైసీపీలో కమ్మ కులానికి న్యాయం జరగలేదా? కమ్మవారు అన్ని పార్టీల్లో ఉంటేనే మన వర్గానికి మేలు జరుగుతుంది. వైఎస్ తెచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ వల్ల, ఎంతోమంది కమ్మవారి పిల్లలు ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో స్థిరపడ్డారు. రాజకీయం వేరు. కులం వేరు. రాజకీయాలతో మన కులాన్ని ముడిపెట్టకండి’’
– ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ధనేకుల రామ కోటేశ్వరరావు, మాగంటి నవీన్
‘‘జగన్ మా వేలితో మా కంటిని పొడుస్తున్నారు. ఏబీవీ, నిమ్మగడ్డ రమేష్‌ను వేధించారు. ఎన్నికల సంఘానికి కులం అంటకట్టారు. మేం టీడీపీకి దాసోహం కాదు. కమ్మవారిపట్ల ద్వేషంతో అమరావతికి కులం ఆపాదించావు. డీఎస్పీ బదిలీలకూ కులాన్ని ఆపాదించావు. మీ పాలనలో కమ్మ అధికారులను తొక్కిపెట్టావు. దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌కు ఎందుకు మంత్రి పదవులివ్వలేదు? స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క మ్మ కులం లేని క్యాబినెట్ మీ పాలనలోనే చూశాం’’
– జగన్ వైఖరిపై కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఏపీ కమ్మ సంఘాల విమర్శ
కమ్మ వర్గాన్ని తన ఐదేళ్ల పాలనలో ఉక్కుపాదంతో అణచివేసిన జగన్‌రెడ్డి.. మళ్లీ అదే కులంపై సానుభూతి ప్రకటించడం సాహసమే. నిజానికి దానికి చాలా ధైర్యం కూడా కావాలి. మరి అలాంటి జగన్.. తాను ద్వేషించిన కమ్మ కులానికి హటాత్తుగా సానుభూతి వ్యక్తం చేయడం జగన్ విజయమా? అంటే అది కమ్మవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ వైఫల్యమా? కమ్మ వర్గం అసంతృప్తిని సొమ్ము చేసుకునే జగన్ తెలివితేటలా?.. దీనిపైనే ఇప్పుడు కమ్మ సంఘాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.
హటాత్తుగా కమ్మవర్గంపై జగన్‌రెడ్డి టన్నుల కొద్దీ కురిపించిన ఆప్యాయానురాగాలు చూసి ఆ వర్గీయులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ కులాన్ని అణచివేయడమే ఏకైక అజెండాగా పనిచేసిన జగన్.. ఇప్పుడు తమను ముద్దాడటం ఏమిటన్నదే ఆ ఉక్కపోతకు అసలు కారణం. సత్తెనపల్లి నియోజకవర్గంలో, తన పార్టీకి చెందిన ఓ కమ్మ నాయకుడి విగ్రహావిష్కరణకు వెళ్లిన సందర్భంలో.. కమ్మ నాయకులపై చంద్రబాబు సర్కారు వేధింపులకు పాల్పడి, జైళ్లకు పంపిస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు.
చివరకు కమ్మ నాయకులు ఆత్మహత్యలు చేసుకునేందుకు, కూటమి సర్కారు కారణమవుతోందని టన్నులకొద్దీ ఆవేదన కురిపించారు. పనిలో పనిగా కమ్మ వారంతా టీడీపీలో ఉండాలని రూలా? కమ్మవాళ్ళు నీకు కట్టుబానిసలా? అన్న ప్రశ్నలు సంధించి.. పరోక్షంగా తటస్తుగా ఉంటూ, టీడీపీ వైపు కొద్దిగా మొగ్గుచూపే కమ్మ వర్గంలో కొత్త ఆలోచనకు బీజమేశారు.
తమ పార్టీలోని కమ్మ వారిని చంద్రబాబు సర్కారు వేధిస్తోందని చెప్పడం ద్వారా, చివరకు కమ్మవారిని కూడా బాబు ప్రభుత్వం విడిచిపెట్టడం లేదన్న సంకేతాలను, ఆ వర్గంలోకి విజయవంతంగా పంపించగలిగారు. ఫలితంగా జగన్ వ్యాఖ్యలపై కమ్మ వర్గంలో చర్చకు తెరలేచింది.
నిజానికి కమ్యూనిస్టు, కాంగ్రెస్ హవా సాగిన రోజుల్లో, ఆ రెండు పార్టీల్లోనూ కమ్మవారిదే ప్రధాన పాత్ర ఉండేది. కాంగ్రెస్‌లో రెడ్ల అధిపత్యం ఉన్నప్పటికీ, కీలక జిల్లాల్లో వారి హవా సాగేది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లోని కమ్మ నేతలు కాంగ్రెస్- కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఖమ్మం జిల్లాలో వామపక్షపార్టీలు సహా, మిగిలిన ప్రధాన రాజకీయ పార్టీలకు కమ్మవారే నాయకత్వం వహించేవారు.
కృష్ణా, గోదావరి జిల్లాల్లో జమిందార్లు కాంగ్రెస్‌లో ఉండేవారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్లు-ఎంపీలుగా కమ్మవారే గెలిచేవారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహా చాలామంది కాంగ్రెస్ సీఎంలు కమ్మవారిని రాజకీయ- వ్యాపార రంగంలో ప్రోత్సహించారు. వైఎస్ వల్ల చాలామంది కమ్మ వ్యాపారవేత్తలు ఆర్ధికంగా లాభపడ్డారు. ఆవిధంగా కమ్మ వారు టీడీపీ ప్రారంభించేంత వరకూ కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉండేవారు.
టీడీపీ ప్రారంభించిన తర్వాత మెజారిటీ శాతం కమ్మవారు ఆ పార్టీలో చేరడమో, పరోక్షంగా దానిని ప్రోత్సహించడమో చేసినప్పటికీ.. రాజకీయాల్లో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న కమ్మ పెద్ద కుటుంబాలు మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయాయి. ఎన్జీ రంగా, పిన్నమనేని, కావూరి, కాటూరి, రాయపాటి, దొడ్డపనేని, చేబ్రోలు, కాకాని, వసంత, సోమేపల్లి, గొట్టిపాటి, కరణం, చేకూరి, రావి, చెన్నుపాటి కుటుంబాలను కాంగ్రెస్ ఆదరించింది. వీరిలో కొన్ని కుటుంబాలు, కాలగమనంలో టీడీపీలో చేరిపోయాయి.
ఎన్టీఆర్ హయాంలో కమ్మ సంఘం తెరవెనుక కీలకపాత్ర పోషించింది. నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య తగాదాలు పరిష్కరించేది. ఖమ్మం, నిజామాబాద్, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖ, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కమ్మ సంఘ నాయకులు తెరవెనుక ఉండి, పార్టీ వ్యవహారాలు చక్కదిద్దేవారు. నాదెండ్ల తిరుగుబాటు ఎపిసోడ్‌లో ఆయనను కమ్మ సంఘం కుల బహిష్కరణ చేస్తున్నట్లు లెటర్‌హెడ్ విడుదల చేయడం సంచలనం సృష్టించింది. రాజకీయాల్లో ఒక కుల నాయకుడిని ఒక కుల సంఘం తమ కులం నుంచి బహిష్కరించటం అదే తొలిసారి.
అయినప్పటికీ కాంగ్రెస్‌లో ఉన్న కమ్మ నేతలు టీడీపీపైగానీ, టీడీపీలోని కమ్మ నేతలు కాంగ్రెస్‌లోని కమ్మ నేతలపైగానీ.. ఎప్పుడూ బహిరంగ విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. అలాంటి సంస్కృతి జగన్‌తోనే మొదలయింది. నిజానికి చంద్రబాబు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తమ పార్టీని విమర్శించిన ప్రత్యర్ధి పార్టీ నేత.. ఏ కులానికి చెందిన వాడయితే, తన పార్టీలో ఉన్న అదే కులం నేతతో ఎదురుదాడి చేయించే సంస్కృతికి తెరలేపారు.
ఇప్పుడు జగన్ మరో అడుగుముందుకేసి.. కేవలం కమ్మవారినే, కమ్మవారిపై అస్త్రంగా సంధిస్తున్నారు. గత ఐదేళ్లలో బాబు, దేవినేని ఉమ, ధూళిపాళ్ల, చింతమనేని ప్రభాకర్ వంటి నాయకులపై వంశీ, కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్, తలశిల రఘురాం వంటి వారిని ప్రయోగించారు. అయితే ఏనాడూ తన రెడ్డి సామాజికవర్గ నేతలతో తిట్టించని జగన్.. అందుకు కేవలం కమ్మ,బీసీ నేతలను మాత్రమే టీడీపీపై ప్రయోగించారు.
రెడ్లకు వ్యాపారపరంగా ఆర్ధిక ప్రయోజనాలు చేకూర్చిన జగన్.. కమ్మ వారిని ఇలా టీడీపీని తిట్టేందుకు మాత్రమే వాడుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వాల్లో కమ్మ వారికి ప్రాతినిధ్యం ఉండేది. కానీ జగన్ మాత్రం కమ్మ వారు లేని క్యాబినెట్ ఏర్పాటుచేసి చరిత్ర సృష్టించారు. అది వేరే విషయం.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కమ్మ వర్గం పట్టుదలతో పనిచేసి టీడీపీని గద్దెనెక్కించింది. ఆ తర్వాత జన్మభూమి కమిటీల్లో పైచేయి సాధించిన ఫలితంగా… అక్కడి నుంచే టీడీపీ ప్రభుత్వంపై కులముద్ర ప్రారంభమయింది. కాంట్రాక్టులు, నియామకాల్లోనూ కనిపించిన కులవాసనను, వైసీపీ అధినేత జగన్ బాగా సొమ్ము చేసుకున్నారు. మిగిలిన కులాల్లో కమ్మ వర్గంపై ఈర్ష్య – ద్వేషం పుట్టించి, ఆ పార్టీ ఓటమిని శాసించేలా చేయడంలో, జగన్ వ్యూహ బృందం సక్సెస్ అయింది.
నిజానికి బాబు హయాంలో రాజకీయంగా-ఆర్ధికంగా లబ్థిపొందించి ఆయన చుట్టూ ఉన్న కమ్మ వర్గాలు మాత్రమే తప్ప.. రోజువారీ వ్యాపారాలు, వ్యవసాయం చేసుకునే సాధారణ కమ్మ వర్గం చిన్నపాటి లబ్థి పొందలేకపోయిందన్న వాదన ఇప్పటికీ లేకపోలేదు. పైగా తీవ్రంగా నష్టపోయింది. అయినా వారిపై ‘టీడీపీ కులముద్ర’ తప్పలేదు. అది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా నష్టపోయేందుకు కారణమయింది. వైసీపీ స్థానిక నేతలు వారిని అన్ని విధాలా నష్టపరిచారు. దానితో అది వేరే విషయం.
అయితే బాబు చివరి రెండేళ్ల పాలనలో హటాత్తుగా కమ్మ వర్గంలో మొదలైన తీవ్ర అసంతృప్తి, టీడీపీ ఓటమికి కారణమయింది. స్థానికంగా చేసిన బిల్లులు మంజూరు కాకపోవడం, కులముద్ర భయంతో ఎన్నికల చివరి రెండేళ్లు దూరంగా పెట్టడమే కమ్మవారి అసంతృప్తికి ప్రధాన కారణం.
దానితో.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కమ్మ వర్గం తమ ఓటు టీడీపీకే వేసినప్పటికీ, మునుపటి మాదిరిగా పార్టీ విజయం కోసం పనిచేయలేదు. తమ ఓటు వేసుకుని ఇంట్లో కూర్చున్నారే తప్ప, గతంలో మాదిరిగా అందరినీ సమీకరించి దగ్గరుండి పోలింగ్‌ను నిర్వహించలేదు. ఇటీవల చంద్రబాబు ‘ కార్యక ర్తలు అలిగినప్పుడే పార్టీ ఓడింది’ అని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఆ ఎన్నికల్లో అదే జరిగింది.
జగన్ సీఎం అయిన తర్వాత.. తన ఓటమికి కమ్మ వర్గమే కారణమన్న ఆగ్రహంతో, ఆ వర్గాన్ని ఆర్ధికంగా-రాజకీయంగా-సామాజికంగా దెబ్బతీసే ఏకైక అజెండాతో పనిచేశారు. గత టీడీపీ హ యాంలో కమ్మ కాంట్రాక్టర్లు చేసిన లక్ష రూపాయల చిన్నపాటి బిల్లులను కూడా ఇవ్వకుండా నిలిపివేశారు. బిల్లుల కోసం వెళ్లే వారిని ‘మీరు కమ్మ,కాపులయితే బిల్లులు ఇవ్వరు’ అని నిర్మొహమాటంగా చెప్పిన రోజులూ లేకపోలేదు. పోనీ మధ్యలో ఎవరైనా సిఫార్సు చేస్తే, ‘కమ్మ-కాపులకు బిల్లులు ఇవ్వవద్దని ఆర్డరు. వాళ్లు తప్ప ఇంకెవరైనా ఉంటే చెప్పండి చేద్దాం’ అన్న మాటలు వినిపించేవి. అంటే కమ్మ వర్గంపై జగన్ ఏ స్థాయిలో ద్వేషం పెంచుకున్నారో అర్ధవుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో కమ్మవర్గానికి చెందిన చిన్న-మధ్య-పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు తెలంగాణ-కర్నాటక-తమిళనాడుతోపాటు, ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ కాంట్రాక్టులు చేసుకోవడం అనివార్యమయింది. ఇక స్థానికంగా ఎటూ వెళ్లలేని కమ్మ వ్యాపారులు, తమ వ్యాపారాలను నిలిపివేయడమో, మరొకరికి అప్పగించడమో, లేదా వైసీపీ నేతలే వారి వ్యాపారాలు ఆక్రమించుకోవడమో చేశారు. ఇంకొంతమంది స్థానికంగా వైసీపీ వారితో సర్దుకుపోయి, వ్యాపారాలు కొనసాగించారు.
ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో.. కమ్మ వర్గమంతా ఏకతాటిపైకొచ్చి, తమను అన్ని విధాలా నష్టపరిచిన జగన్.. మరోసారి అధికారంలోకి రాకుండా ఉండాలన్న కసితో రంగంలోకి దిగింది. సర్వశక్తులూ ఒడ్డి జగన్‌ను ఓడించింది. అందుకు స్వదేశ, విదేశాల్లో ఉన్న వారి నుంచి ఆర్థిక సమీకరణ చేసింది. విదేశాల్లోని కమ్మ వారు భారీ స్థాయిలో నిధులు పంపించడమే కాదు. ఏపీకి వచ్చి మరీ ఎన్నికల్లో పనిచేశారు. రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ కమ్మవారు చందాలు వేసుకుని మరీ పార్టీని గెలిపించారు.
తమ తాహతును బట్టి ఎమ్మెల్యే అభ్యర్ధులకు, తమ కులం కాకపోయినా సరే జగన్‌పై కసితో ఆర్థికసాయం కూడా చేశారు. ‘‘టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ సంపాదించుకోవచ్చు. అదే జగన్ మళ్లీ కొనసాగితే రాష్ట్రంలో ఉండలేమ’’న్న భయమే, కమ్మవారి ఏకీకకరణకు ప్రధాన కారణంగా కనిపించింది. ఆ సమయంలో ఆర్ధిక సమీకరణ చేసిన కమ్మ వర్గాలను అభినందించిన టీడీపీ నాయకత్వం.. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకూ, వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతోంది. అది వేరే విషయం.
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదయినప్పటికీ.. తమకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్న అసంతృప్తి, కమ్మవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది.గతంలో కమ్మ ప్రముఖులకు సీఎంఓలో ఏదో ఒకవిధంగా ప్రవేశం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంకా చాలామంది కాంట్రాక్టర్లకు బిల్లులు రాని దుస్థితి. స్థానికంగా తమను నష్టపరిచిన వైసీపీ నేతలే మళ్లీ చొక్కాలు మార్చి, తాము గెలిపించిన టీడీపీలో ఎమ్మెల్యేల పక్కన చేరి పక్కన చేరడాన్ని కమ్మ వర్గం జీర్ణించుకోలేకపోతుంది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన వారు, తమను పట్టించుకోని నిర్లక్ష్యాన్ని సహించలేకపోతున్నారు.
మళ్లీ చంద్రబాబు చుట్టూ ఉన్నవారో, ఎన్నికల్లో వందల కోట్లలో సాయం చేసిన ఇతర కులాల వారు మాత్రమే లబ్థిపొందుతున్నారన్నది సగటు కమ్మవారికి అర్ధమయింది. ప్రధానంగా రెడ్డి వర్గానికి చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, మేఘా వంటి కంపెనీలకు మళ్లీ ఈ ప్రభుత్వం కూడా ‘రెడ్డి’కార్పెట్ వేయడాన్ని కమ్మ వర్గం సహించలేకపోతోంది. ముఖ్యంగా పులివెందులలో వంద కోట్లకు పైగా పనిచేసిన వైసీపీకి చెందిన రెడ్డి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను.. ఈ ‘మంచి ప్రభుత్వం’ పువ్వుల్లో పెట్టి అప్పగించిన వైనం, రాష్ట్రంలో సగటు కమ్మవారి గుండెను రగిలించింది.
విద్యాశాఖ సహా కీలక శాఖల్లో, మళ్లీ రెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్లే పెత్తనం చేయడాన్ని కమ్మ కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. జగన్ హయాంలో లబ్ధిపొందిన కాంట్రాక్టర్లే ఇప్పుడు ముందువరసలో కనిపించడాన్ని, సగటు కమ్మ కాంట్రాక్టరు భరించలేకపోతున్నారు. కార్మిక శాఖలో ఎన్నికల ముందు టీడీపీకి పనిచేసిన కమ్మ ఏజెన్సీలను, ఇప్పుడు పక్కనపెట్టి, వైసీపీకి పనిచేసిన వర్గానికి కట్టబెడుతున్న వైనం. ఈవిధంగా డబ్బులిస్తేనే పనులవుతున్నాయే తప్ప, కులాన్ని పట్టించుకోవడం లేదన్న భావన అసంతృప్తి బీజం వేసినట్లు కనిపిస్తోంది.
కాగా మూడునెలల క్రితం హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో కమ్మ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్ల సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఆ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తున్న వారంతా అమరావతికి ఇప్పుడే వెళ్లకూడదని చర్చించుకున్నారట.
‘‘ ఇప్పుడు మనం అంత ఖర్చు చేసి అమరావతికి వెళితే, మళ్లీ జగన్ రాడన్న గ్యారంటీ ఎవరూ ఇచ్చే పరిస్థితి లేదు. అతను వస్తే మన కంపెనీలు మూసుకోవలసిందే. పోనీ ఎక్కడైనా పరిశ్రమ పెడదామంటే మా వాటా సంగతేమిటని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. అందువల్ల ఇప్పట్లో అమరావతికి వెళ్లకూడద’ని తీర్మానించినట్లు సమాచారం.
పైగా అమరావతిలో పనులన్నీ కమిషన్ల పద్ధతిలో ఇస్తున్నారని, ప్రైవేటు కంపెనీలన్నీ కనీస లాభం కూడా లేని విధంగా కాంట్రాక్టులు రూపొందించాయని చర్చించుకున్నట్లు తెలిసింది. కాంట్రాక్టులు పొందిన ప్రధాన కంపెనీలన్నీ దారుణమైన పద్ధతుల్లో సబ్ కాంట్రాక్టులిస్తున్నాయంటున్నారు. పోనీ ఆ కంపెనీలు బిల్లులు కూడా సకాలంలో ఇస్తాయన్న గ్యారంటీ లేదంటున్నారు. ఈ కారణంతోనే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదయినా, ఇప్పటివరకూ పరాయి రాష్ట్రాలకు వెళ్లిన కమ్మ కాంట్రాక్టర్లు ఏపీకి వెళ్లడం లేదని స్పష్టమవుతోంది.
చరిత్రలో ఎప్పుడూ రోడ్డెక్కని కమ్మ మహిళలు తొలిసారి.. జగన్ జమానాలో తమ భర్తలను ముందుంచి, తాము స్వయంగా రోడ్డెక్కి టీడీపీని గెలిపించిన వైనాన్ని కమ్మ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత..తమ కులానికి చెందిన అధికారులు, వ్యాపారులకు ప్రాధాన్యం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.
‘‘ కృష్ణబాబు లాంటి అధికారి తప్ప, మిగిలిన ఏ కీలక శాఖల్లోనూ కమ్మ అధికారులు ఫోకల్ పాయింట్‌లో లేరు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడయిన ఆయనకు మాత్రం కీలక శాఖ ఇచ్చారు. ఫలానా శాఖలో కమ్మ వారిని నియమించేందుకు మా పార్టీ పెద్దలే భయపడుతున్న పరిస్థితి.పైగా మేమే ఉన్నాం కదా? ఇక మీరు ఎక్కడుంటే మీకెందుకు అని కీలకనేతలు ప్రశ్నించే పరిస్థితి వస్తుందని మేం ఊహించలేదు. అలాగని మాది మేం గెలిపించిన టీడీపీపై ద్వేషం కాదు. అసంతృప్తి మాత్రమే. అది ద్వేషంగా మారే పరిస్థితి రాదని భావిస్తున్నామ’’ని కృష్ణా జిల్లాకు చెందిన ఓ కమ్మ సంఘ నేత విశ్లేషించారు. గుంటూరు రేంజ్‌లో ఇప్పటికీ కమ్మ సీఐ, డీఎస్పీలు వీఆర్‌లో ఉన్న విషయాన్ని కమ్మ సంఘ నేతలు గుర్తు చేస్తున్నారు.
కమ్మ వర్గాన్ని మెప్పించేందుకు జగన్ చేసిన వ్యాఖ్యలు.. కూటమి సర్కారు పనితీరుపై అసంతృప్తితో ఉన్న కమ్మ వర్గాన్ని కదిలించేలా ఉన్నాయి. అయితే.. టీడీపీ ప్రభుత్వం తమకు ఏమీ చేయకపోయినా, జగన్ మళ్లీ రాకూడదన్న ధృడ సంకల్పంతో ఉన్న కొన్ని కమ్మవర్గాలపై జగన్ మాటల ప్రభావం ఉండబోదంటున్నారు. కానీ తటస్థంగా ఉన్న కమ్మ వర్గంపై జగన్ వ్యాఖ్యల ప్రభావం 10 నుంచి 15 శాతం వరకూఉంటుందంటున్నారు.
‘‘ మొన్న జగన్ తన సత్తెనపల్లి పర్యటనలో కమ్మ వర్గంపై తన వైఖరికి క్షమాపణ అడిగి ఉంటే, కచ్చితంగా 40 శాతం మంది అతని వైపు మొగ్గుచూపేవారు. కారణం అతను చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం.కానీ జగన్ ఆ పని ఎట్టిపరిస్థితిలోనూ చేయడు. ఆయనకు అలాంటి అలవాటు కూడా లేదు. అంత తెలివే ఉంటే మా కులంతో ఎందుకు శత్రుత్వం పెట్టుకుంటాడు’అని ఓ కమ్మ సంఘ ప్రముఖుడు విశ్లేషించారు.
‘కమ్మవారికి జగన్ గేట్లు మూస్తే మా పార్టీ గేట్లు తెరవలేదు. ఇంతకుమించి నేను ఎక్కువ మాట్లాడను’ అని.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌పై పోరాడి, జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో తమ పార్టీపై వైసీపీ వేసిన కమ్మ ముద్రవల్ల నష్టపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ భయంతో ఈసారి పూర్తిగా తమ కులాన్ని పక్కనపెడుతున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు కమ్మసంఘాల నుంచి వినిపిస్తున్నాయి.