Suryaa.co.in

Telangana

నీళ్ల విషయంలో స్వరాష్ట్రంలోనూ అన్యాయం

కృష్ణా నదీ జలాల్లో 550-570 టీఎంసీల వాటా తెలంగాణ ప్రాంతానికి రావాలి
సీఎం కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరిస్తూ సంతకం చేశారు
ప్రభుత్వ తీరుతో నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర నష్టం
సమస్యలకు పరిష్కారం దొరికేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ
రైతు సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

నీళ్లు-నిధులు-నియామకాల విషయంలో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. నీళ్లకు సంబంధించింది ప్రధానంగా 90 శాతం కృష్ణా జలాల్లో నీటి వాటాపైనే పోరాటం జరిగింది.కృష్ణా నది జలాల కేటాయింపు విషయంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా దాదాపు 170 టీఎంసీల నీరు గ్రావిటీ మీద కోల్పోయింది.

కృష్ణా జలాల పంపకంపై మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు 1974లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది.బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 270 టీఎంసీలు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి.

నీళ్ల విషయంలో స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగడం లేదు. కృష్ణా నదీ జలాల పరివాహక ప్రాంతం 68.5 శాతం తెలంగాణలోనే ఉంది. కృష్ణా నదీ జలాల్లో 550-570 టీఎంసీల వాటా తెలంగాణ ప్రాంతానికి రావాలి.270-280 టీఎంసీలు మాత్రమే ఉమ్మడి ఏపీకి లభించాయి. 2015లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది.కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు న్యాయమైన వాటా 570 టీఎంసీలు రావాల్సి ఉండగా, సీఎం కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరిస్తూ సంతకం చేశారు.

బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల ఇంతవరకూ నికర జలాల కేటాయింపు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కేసీఆర్ పాలనలో ఎస్ ఎల్ బీసీ నిర్మాణం అడుగు ముందుకు పడలేదు. గత తొమ్మిదేళ్లలో కృష్ణా జలాల వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.

2016లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ 299 టీఎంసీలకే అంగీకారం తెలిపారు. 570 టీఎంసీలకు పైగా నీటి కేటాయింపులు తెలంగాణ రావాల్సి ఉండగా.. కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకొని అన్యాయం చేశారు.2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్ కు కొన్ని విధివిధానాలు పొందుపర్చారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విధివిధానాలతోనూ తెలంగాణకు అన్యాయమే జరిగింది.

2015లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ట్రిబ్యునల్ ద్వారా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది.6 అక్టోబర్, 2020 నాడు ఢిల్లీలో జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లోనూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించింది.కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ .. తెలంగాణ ప్రభుత్వాన్ని కేసు వెనక్కు తీసుకోవాలని సూచించారు.తద్వారా ట్రిబ్యునల్ ఏర్పాటుకు లీగల్ ఒపినియన్ తీసుకునేందుకు వీలవుతుందని షెకావత్ పేర్కొన్నారు.

కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కేసు వెనక్కు తీసుకోవడంపై ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు.ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఏడాది పాటు కాలయాపన చేశారు.తెలంగాణ బిజెపి నేతల ఒత్తిడితో చివరకు 2021 అక్టోబర్ లో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును వెనక్కు తీసుకుంది.అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో హామీ ఇచ్చినట్లుగా.. తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుకు అవసరమైన లీగల్ ఒపినియన్ ప్రక్రియను కేంద్ర న్యాయశాఖ ప్రారంభించింది.

అనంతరం కేంద్ర కేబినెట్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చర్చలు జరిపి ఒప్పించి, 6 అక్టోబరు 2023 న గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యేలా చొరవ తీసుకున్నారు కేంద్ర కేబినెట్ తెలంగాణకు కృష్ణా నీటి పంపకాలను నిర్ణయించేలా ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. కృష్ణా జలాల వాటా విషయంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరికేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది.

LEAVE A RESPONSE