గుడివాడ పట్టణంలో రూ. 266 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం

-క్యాంపు కార్యాలయంలో ఎంపీ బాలశౌరితో కలిసి మంత్రి కొడాలి నాని సమీక్ష
గుడివాడ, (కృష్ణా జిల్లా) నవంబర్ 8: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో రూ. 266 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్ తయారీపై నేషనల్ హైవే అధికారులతో గుడివాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోమవారం సమీక్షించారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గుడివాడ పట్టణంలోని పామర్రు రోడ్ లో గుడివాడ- భీమవరం, గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ లు ఉన్నాయి. రైళ్ల రాకపోకల సందర్భంగా భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఆటో నగర్ ప్రజలతోపాటు గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గుడివాడ పట్టణం నుండి పామర్రు, మచిలీపట్నం ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు భీమవరం మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర ట్రాఫిక్ లో ఇరుక్కు పోతున్నాయి. దీంతో రెండు రైల్వే ట్రాక్ లపై ఫ్లై ఓవర్ లను నిర్మించాలన్న డిమాండ్ కొనసాగుతూ వస్తోంది. మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి ఎన్నిక కావడం, వరుసగా నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఫ్లైఓవర్ నిర్మాణం ఒక కొలిక్కి వస్తోంది.
గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ బాలశౌరి మంత్రి కొడాలి నానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దీనిలో భాగంగా అనేకసార్లు గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణం అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఫ్లై ఓవర్ నిర్మించే ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు రావు. అయినప్పటికీ గుడివాడ పట్టణంలోని భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల సమస్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి ఎంపీ బాలశౌరి తీసుకువెళ్లారు. సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్-3 గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ దగ్గర, లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్- 52 విజయవాడ- భీమవరం రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ తయారు చేసి నేషనల్ హైవే డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కొడాలి నాని పలు సూచనలు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకొని తయారు చేసే డిజైన్ ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఆమోదం లభించిన వెంటనే గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మించడం జరుగుతుందని ఎంపీ బాలశౌరి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి నారాయణరెడ్డి, నాయకులు మట్టా జాన్ విక్టర్, పెయ్యల ఆదాం, కందుల దుర్గా కుమారి, మేకల సత్యనారాయణ, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, ఎస్కే బాజీ, కంచర్ల జగన్, తోట రాజేష్, గంటా చంద్రశేఖర్, దారం నరసింహ, కందుల నాగరాజు, అంగడాల వేణు, రహమతుల్లా, సయ్యద్ గఫార్, మూడెడ్ల ఉమా, మెండా చంద్రపాల్, అబ్బూరి భాస్కరరావు, గోళ్ళ రామకృష్ణ, మాదాసు వెంకట లక్ష్మి కుమారి, కొర్నిపాటి గణపతి, సత్య దుర్గాప్రసాద్, రేమల్లి పసి, అగస్త్య రాజు కృష్ణమోహన్, అల్లం సూర్యప్రభ, అల్లం రామ్మోహన్, రంగా, వెంపటి సైమన్, మామిళ్ళ ఎలీషా, గుదే లక్ష్మి రంగనాయకమ్మ, గణపతి సూర్జ్యం, బచ్చు మణి కంఠ, కొత్తూరి లక్ష్మీనారాయణ, వీరిశెట్టి వెంకట నరసింహారావు, కనుమూరి రామిరెడ్డి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కొలుసు నరేంద్ర, గుమ్మడి నాగేంద్ర, గుడివాడ ఆర్డిఓ జి శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply