ఎంపీ విజయసాయిరెడ్డి
భారతదేశంలో గత 70 ఏళ్లకు పైగా అమలులో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చాలా బలమైనది. గట్టి పునాదులతో విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఇంతటి గొప్ప ప్రజాతంత్ర వ్యవస్థను ఎవరూ దెబ్బదీయ లేరు. కనీసం బలహీనపరచడం కూడా ప్రపంచంలోని ఏ శక్తికీ కుదిరే పని కాదు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి ముందు కొందరు పాశ్చాత్య ప్రముఖులు, ‘సార్వభౌమాధికారం గల దేశంగా ఇండియా మనలేదు. అక్కడ ప్రజాస్వామ్యం వేళ్లూనుకోలేదు. భారత ఉపఖండం నుంచి బ్రిటిష్ వారు వైదొలిగితే–అక్కడ అరాజకం రాజ్యమేలుతుంది. భారతీయులు మతం, భాష, జాతి, కులం పేరుతో తన్నుకు చచ్చిపోతారు,’ అంటూ జోస్యం చెప్పారు. ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తంచేసిన వారిలో ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లండ్ ప్రధాని, యుద్ధ నిపుణుడు, రాజకీయ దురంధరుడు సర్ విన్‌స్టన్ చర్చిల్ కూడా ఉన్నారు. కాని, ఈ రాజకీయ జోస్యాలు, అంచనాలు అబద్ధమని తర్వాత తేలిపోయాయి.
ముఖ్యంగా 1971 తర్వాత ఆరేళ్లకు 1977లో జరిగిన భారత పార్లమెంటు ఎన్నికలు ఈ విషయం తెలియచెప్పాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంతో బలమైన పునాదులున్నదని ప్రపంచానికి ప్రధానంగా పాశ్చాత్య దేశాలకు భారతీయులు చక్కగా నిరూపించారు. అప్పటికి పదేళ్ల ముందు 1967 సార్వత్రిక ఎన్నికల్లో సైతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇక్కడ బలపడుతోందని భారత ఓటర్లు తమ తీర్పు ద్వారా బాహ్య ప్రపంచానికి సూచనప్రాయంగా చెప్పారు. అందుకేనేమో మరి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదివారం కర్ణాటకలో పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ‘ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాతంత్ర వ్యవస్థ మాత్రమే కాదు ఇది ప్రజాస్వామ్యానికే తల్లి. భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరం. భారతదేశంలోని ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు ప్రపంచంలోని ఏ శక్తి కీడు చేయలేదు,’ అని స్పçష్టంచేశారు.
వరుసగా పరాజయం పాలైన రాజకీయపార్టీలు తాము పనిచేసే ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని గగ్గోలు పెట్టడం ప్రపంచవ్యాప్తంగా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఇదే తీరున మాట్లాడుతున్నాయి. పెరుగుతున్న పోలింగ్ శాతమే బలపడుతున్న ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కాని, దేశంలో, వివిధ రాష్ట్రాల్లో ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రోజురోజుకూ బలోపేతమౌతోంది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రజల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 2004 ఎన్నికల్లో 58.04%, 2009లో 58.21%, 2014లో 66.44%, 2019 ఎన్నికల్లో 67.40 % ఓట్లు పోలయ్యాయి. అంతేగాక, యువతరం కూడా ఇండియాలో ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
21వ శతాబ్దంలో దేశంలో జరిగిన పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికల్లో గెలుస్తున్నవారి సగటు వయసు క్రమం తప్పకుండా తగ్గుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, చట్టసభలకు ఎన్నికవుతున్న నాయకుల విద్యార్హతలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, అప్పుడప్పుడూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే దేశాల్లో జరిగే రాజకీయ పరిణామాలను చూసి కొందరు నిరాశా నిస్పృహలు వ్యక్తంచేస్తున్న మాట కూడా నిజమే. కాని, ఏ వ్వవస్థలోనైనా ఒడిదుడుకులు, అనుకోని అవాంతరాలు సహజమేగాని అవి శాశ్వతం కాదని మనందరి అనుభవాలు నిరూపించాయి. పైన పేర్కొన్న చర్చిల్ మహాశయుడు కూడా తనకు బ్రిటన్ తరహా ప్రజాస్వామ్యంపై అసంతృప్తి కలిగిన ఒక సందర్భంలో, ‘ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అంత గొప్పదేమీ కాదు. ఇంతకన్నా మెరుగైన వ్యవస ్థఏదీ లేని కారణంగానే మనం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాం,’ అని వ్యాఖ్యానించారు. అంతమాత్రాన ప్రజాస్వామ్యం బలహీనమైనదని అనుకోవడానికి వీల్లేదు.
1960లు, 70ల్లో మధ్య తరగతి జనం తాము ఎదురుచూస్తున్న బస్సు లేదా రైలు రావడం బాగా ఆలస్యమైనప్పుడు, ‘ఇండియాకు ప్రజాస్వామ్యం పనికి రాదు. మిలిటరీ పాలన అవసరమనిసిస్తోంది,’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు లేకపోలేదు. అయితే, 1977 తర్వాత భారత ప్రజలకు ప్రజాస్వామ్యం ఎంతటి విలువైనదో తెలిసింది.