– ఎట్టకేలకు కొత్త న్యాయ విచారణ చట్టాల రూపకల్పనకు శ్రీకారం
– ఎంపీ విజయసాయిరెడ్డి
కాలం చెల్లిన చట్టాలను రద్దుచేయడం లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం, మార్పులు అవసరమైన చట్టాలను సవరించడం, మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సాధారణమని రాజ్యసభ సభ్యులు,వైయస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు.
186 ఏళ్ల చరిత్ర కలిగిన భారత శిక్షా స్మృతికి (ఐపీసీ)కి ఎట్టకేలకు కొత్త న్యాయ విచారణ చట్టాల రూపకల్పనకు కేంద్రం శ్రీకారం చుట్టడంపై విజయసాయిరెడ్డి ఆయన అభిప్రాయాలను శనివారం వెల్లడించారు.
భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్–ఐపీసీ), 1860, నేర విచారణ ప్రక్రియా స్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్–సీఆర్పీసీ), 1898, భారత సాక్ష్య చట్టం (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్), 1872 ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రక్రియ పార్లమెంటులో ప్రారంభమైందనన్నారు. స్వతంత్ర భారతంలో ఇది విప్లవాత్మక చర్యగా భావిస్తున్నారని చెప్పారు. ఈ నెల 11న ఈ మూడు చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు (బీఎన్ ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు (బీఎన్ ఎసెస్), భారతీయ సాక్ష్య బిల్లు (బీఎస్)లను కేంద్ర హోం మంత్రి అమిత్ ప్రవేశపెట్టారని వెల్లడించారు.
కీలకమైన ఈ 3 మూడు బిల్లులను సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి, వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు సూచించడానికి పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లులను తర్వాత నివేదించారు. అయితే, ఈ మూడు చట్టాలూ న్యాయవ్యవస్థ విచారణ ప్రక్రియకు సంబంధించినవి కావడంతో కొత్త బిల్లులపై ఆసక్తి పెరుగుతోందనన్నారు. బ్రిటిష్ వారి పాలనాకాలంలో రూపొందించి, అమల్లోకి తెచ్చిన పై మూడు చట్టాలకూ తర్వాత, స్వతంత్ర భారతంలో అవసరమైన సవరణలు చేశారన్నారు.
అయినా, మారిన పరిస్థితులు, అభిప్రాయాల కారణంగా 21వ శతాబ్దంలో భారత పార్లమెంటు ఈ మూడింటి స్థానంలో కొత్త బిల్లులు రూపొందించి, వాటికి చట్ట రూపం కల్పించే ప్రక్రియను 17వ లోక్ సభ చివరి సంవత్సరంలో ప్రారంభించడం మంచి పరిణామమని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారని చెప్పుకొచ్చారు.. ఈ సందర్భంగా వీటిలో అత్యంత కీలకమైన భారత శిక్షా స్మృతి (ఐపీసీ) ఎలా అమలులోకి వచ్చింది ఓసారి గుర్తుచేసుకుందమన్నారు..
ఇంగ్లిష్ వారి హయాంలో 1862 నుంచి అమలులోకి వచ్చిన ఐపీసీ
తొలుత ఈస్టిండియా కంపెనీ పాలనలో ఇండియాలోని మూడు ప్రధాన ప్రాంతాలను (కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలు) కేంద్రీకృత పాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. కంపెనీ అధీనంలోని అన్ని భూభాగాల ప్రజల కోసం శాసనాలు చేయడానికి సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ ఏర్పాటయిందని చెప్పారు. కొత్తగా చేసే చట్టాల రూపకల్పనకు కౌన్సిల్ లో న్యాయవిభాగం సభ్యుడు థామస్ బీ మెకాలే అధ్యక్షతన రెండేళ్ల తర్వాత లా కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
తమ మాతృదేశం బ్రిటన్లో అమలులో ఉన్న సాధారణ ఇంగ్లిష్ చట్టాల ఆధారంగా ఇండియాలో అమలు చేసే చట్టాలు ఉండాలనేది వారి అప్రకటిత లక్ష్యం. మొదట సమగ్రమైన పీనల్ కోడ్ (శిక్షా స్మృతి) ను రూపొందించే బాధ్యతను లా కమిషన్ కు అప్పగించారు. మెకాలే బృందం హడావుడిగా ఒక ముసాయిదా స్మృతిని నాటి గవర్నర్ జనరల్ కు 1837లో సమర్పించిందన్నారు. కొన్నేళ్లు అధ్యయనం చేశాక మెకాలే వారసులు డ్రింక్ వాటర్ బెతూన్, బార్నెస్ పీకాక్ దాన్ని సంపూర్ణంగా సవరించారని చెప్పారు.సవరించిన ముసాయిదాను 1856లో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించారు.
1857లో తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయి తిరుగుబాటు) కారణంగా ఈ ముసాయిదాను చట్టంగా చేసే పని నిలిచిపోయిందన్నారు. ఈ బెంబేలెత్తిన బ్రిటిష్ సర్కారు భవిష్యత్తులో ఇలాంటి ‘తిరుగుబాటుదారుల’ను అణచివేసే అధికారాన్ని దఖలు పరచుకుంటూ ఈ ముసాయిదాను మరోసారి సవరించిందని తెలిపారు. భారీ మార్పులతో రూపొందించిన ముసాయిదాను కేంద్ర చట్టసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించగా 1860లో దీన్ని ఆమోదించించారు.
ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) పేరుతో 1862లో ఇది అమలులోకి వచ్చింది. వెంటనే నాటి న్యాయస్థానాల భాష అయిన ఉర్దూలోకి దీన్ని అనువాదం చేయించారు. ఉర్దూ తర్జుమా ప్రతికి ‘తాజీరాతే హింద్’ అని పేరుపెట్టారు. మొదట ఈ ఐపీసీలో 23 చాప్టర్ల కింద 511 సెక్షన్లు ఉన్నాయి. 11 ఐపీసీ సవరణ చట్టాల పేరుతో దానిలో మార్పులు చేశారన్నారు. చాప్టర్ల సంఖ్య 25కు పెంచారు. స్వతంత్ర భారతంలో 1959 నుంచి ఐపీసీని 12 పర్యాయాలు సవరించారు. 1860 నుంచి దానికి అదనంగా 61 సెక్షన్లు జోడించారు.
అలాగే, అనవసరమని భావించిన 21 సెక్షన్లను తొలగించారు. ప్రస్తుతం ఐపీసీలో 555 సెక్షన్లు ఉన్నాయి. కోడ్ అనే మాటకు సంస్కృతంలో స్మృతి అంటారు. దాన్నే ఇప్పుడు హిందీలో సంహిత అనే పేరుతో కొత్త శాసనం రూపొందిస్తున్నారు. బ్రిటిష్ వారి జమానాలో ఐపీసీని భారతీయ దండ్ సంహిత అని హిందీలోకి అనువదించినప్పటికీ అప్పట్లో అది ప్రాచుర్యంలోకి రాలేదని విజయసాయిరెడ్డి చెప్పారు..