అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కాన్వేన్ష్ న్ కేంద్రంలో మూడు రోజుల పాటు జరిగిన అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ అన్న నినాదం ప్రతిధ్వనించింది.
ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్ళ వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు ,హత్యలు, అత్యాచారాలపై, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఏపీ ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సారధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న దళితుల ఉద్యమానికి అండగా ఎన్నారైలు మద్దతు పలికారు. కాన్ఫరెన్స్ హాల్లో అమరావతి బహుజన ఐకాస ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసి ప్రజారాజధాని అమరావతి మహిళల పోరాట చిత్రపటాలతో పాటు డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి వారి ఫోటోలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సోమవారం ఆత్మగౌరవ సమితి గౌరవ సలహాదారులు యలమంచిలి ప్రసాద్ ( చికాగో)మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందని, ఎన్నో కలలతో రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల కలలు ధ్వంస మయ్యాయని విచారం వ్యక్తంచేశారు. మాస్క్ అడిగాడని డాక్టర్ సుధాకర్ ను, మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ బాబు ను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటనలు రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనం అన్నారు.
ఏపీలో జరుగుతున్న దాష్టీకాలను, దళితుల స్థితి గతులను ప్రపంచంలోని తెలుగు ప్రజలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే మహాసభల్లో ‘మాకు ఊపిరి ఆడటం లేదు’ అంటున్న దళితుల గొంతుకను వినిపించామని చెప్పారు. తానా మహాసభలకు సాంకేతిక పరమైన కారణాలతో బాలకోటయ్య హాజరు కాలేక పోయారని యలమంచిలి తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి , వేనుగుంట రాజేష్,యలమంచిలి సుధ తదితరులు పాల్గొన్నారు.